స్వచ్ఛ భారత్ లక్ష్యం ఇదేనా..?
► ఏళ్లతరబడిగా మూతపడిన సులభ్‌కాంప్లెక్స్
► బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన
పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్): ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా, సుల్తానాబాద్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక మినీ కలెక్టరేట్ ఏర్పడిన సమయంలో సందర్శకులు, ప్రజల కోసం సులభ్‌కాంప్లెక్స్‌ను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరరెడ్డి దూరదృష్టితో మినీ కలెక్టరేట్‌తో పాటు సులభ్‌కాంప్లెక్స్‌ను నిర్మించి 2008జూలై 14న ప్రారంభించారు. ప్రభుత్వ వాటాగా రూ.2.50లక్షలు, నిర్వహకులు రూ.2.50లక్షలతో దీనిని నిర్మించారు.
అయితే సులభ్‌కాంప్లెక్స్ నిర్వహకులకు ప్రభుత్వ వాటా చెల్లింపు కాకపోవడం, అప్పట్లో ఆదరణ లేకపోవడంతో దీనిని మూసివేశారు. దాదాపు ఆరేళ్లుగా తెరువడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దీని అవసరం ఎంతో ఏర్పడింది. అనేక గ్రామాలకు, మండలాలకు కూడలి అయిన సుల్తానాబాద్‌లో ప్రజలకు తగినన్ని మూత్రశాలలు లేకుండా పోయాయి. కూరగాయల మార్కెట్ వద్ద ఒకటి మాత్రమే పనిచేస్తోంది. కాల్వశ్రీరాంపూర్ చౌరస్తాలో ఉన్న ఐబీ, ఇరిగేషన్, పాత సివిల్ ఆసుపత్రి, పాత మటన్ మార్కెట్, బస్టాండ్ స్థలాల్లో, బంజరుదొడ్డి, రోడ్డు ప్రక్కన డ్రెయినేజీల్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు.