Genco power plant
-
నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలి
ఏపీ జెన్కో ప్రాజెక్టు సీఈ బాలాజీ ముత్తుకూరు: ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మెళకువలు పాటించాలని ఏపీజెన్కో ప్రాజెక్టు సీఈ (నిర్మాణం) పీ బాలాజీ అన్నారు. సమావేశ మందిరంలో సోమవారం జరిగిన సూపర్వైజర్ల అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. 3వ యూనిట్ కింద మరో 800 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం మొదలవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్ట్రక్చర్ల నిర్మాణ పనుల్లో నిర్ధేశించిన జాగ్రత్తలు పాటించాలని, భద్రతా నియమాలు ఉల్లంఘించవద్దని సూచించారు. విశ్రాంత పర్యవేక్షక ఇంజనీర్ కోటేశ్వరావు మాట్లాడుతూ, నేల పరీక్షలు, నీటి నమూనాల పరీక్షల అవసరాన్ని వివరించారు. ప్లాస్టరింగ్, క్యూరింగ్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దృశ్య, శ్రవణ విధానం ద్వారా విశదీకరించారు. కార్యక్రమంలో ఎస్ఈలు రమణారెడ్డి, కోటేశ్వరావు, ముఖ్య సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ, టాటా ప్రాజెక్టు ప్రతినిధి ఎల్ కాళేశ్వరావు పాల్గొన్నారు. -
'రైల్వే లైనుకు సహకరించండి'
జైపూర్: రైలుమార్గం ఏర్పాటుకు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ను రైతులు కోరారు. జిల్లాలోని జైపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన బుధవారం రైతులతో సమావేశమయ్యారు. రైతులకు సక్రమంగా పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. జైపూర్‌లో జెన్కో విద్యుత్ ప్లాంటు నిర్మిస్తోంది. ఈ ప్లాంటుకు మంచిర్యాల సమీపంలోని గనుల నుంచి బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. దీనికి గాను రైలు మార్గం నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం బాధిత రైతులతో సమావేశమయ్యారు. -
కూలిన బతుకులు
ఇద్దరిది... ఊరు కాని ఊరు.. ముగ్గురిది... రాష్ట్రం కాని రాష్ట్రం అంతా బతుకుదెరువుకొచ్చినవారే... శ్రమనే నమ్ముకున్న జీవులు వారు... విరామమెరుగక పనిచేస్తుండగా... అంతలోనే మృత్యువు... మట్టి కట్ట రూపంలో మాటు వేసింది.. మట్టిమనుషులను ఆ మట్టిలోనే కలిపేసింది... ఐదు కుటుంబాల్లో తీరని శోకం నింపింది... కూలీల బతుకులు అలా ‘కూలి’ పోయాయి... మేళ్లచెర్వు/కోదాడ అర్బన్/హుజూర్నగర్: పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న జెన్కో విద్యుత్ ప్లాంట్ పనుల్లో పనిచేస్తున్న కూలీల బతుకులు కూలిపోయాయి. శుక్రవారం అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలీలపై పడడంతో ఐదుగురు మృతిచెందారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 50 అడుగుల ఎత్తుగల మట్టికట్ట వెంట గోడ నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కనీసం ముందస్తు చర్యలో భాగంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లను చేయలేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కట్ట మొత్తం తడిసిపోయి ప్రమాదకరంగా కనపడుతున్నప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శించి కూలీలతో యధావిధిగా పనులు చేయిస్తుండటంతో అమాయకులు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. 120 మెగావాట్ల జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ నిర్మాణంలో అధికారుల, కాంట్రాక్టర్ పర్యవేక్షణ నిరంతరం ఉండాల్సి ఉంది. కానీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్‌పై బాధ్యతలు వదిలి వేసి నామమాత్రంగా విధులు నిర్వహించడం కూడా పనిప్రదేశంలో ప్రమాదానికి కారణంగా పలువురు భావిస్తున్నా రు. అంతేగాక మట్టి కట్ట వెంట కాకుండా మరికొంత దూరంలోనైనా గోడ నిర్మాణం చేపట్టినా ఈ ప్రమా దం జరగకపోయేదని మరికొందరు అంటున్నారు. ఒకవేళ నిపుణుల సూచనల మేరకు మట్టికట్ట వెంటనే గోడ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నట్లయితే కనీనం పని జరిగే ప్రదేశంలో కొంత భాగం మట్టిని తొలగించి చదును చేసినట్లయితే ప్రమాదం జరిగి ఉండేది కాదు. మృతులు వీరే.. మృతుల్లో మహబూబ్‌నగర్ జిల్లా సున్నిపెంటకు చెందిన పోతన గోపాలకృష్ణ (35), మేళ్లచెర్వు మండలం వజినేపల్లికి చెందిన బారెడ్డి గోవిందరెడ్డి (45), మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగరవేలి జిల్లా బరిల్‌బరిది గ్రామానికి చెందిన నందుకోల్ (20), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సారంగ్పూర్ జిల్లాకు చెందిన మహ్మద్‌ఖలీల్ (23), పశ్చిమబెంగాల్ రాష్ట్రం ప్రాన్స్‌పుర గ్రామానికి చెందిన సుబ్బురాయ్‌పాడవాయ్ (35)లు ఉన్నారు. ఐదు నిమిషాల ముందు జరిగి ఉంటే.. మధ్యాహ్న భోజనం సమయం కాబట్టి ఐదుగురు ప్రాణాలు మాత్రమే కోల్పోయారు. మరో ఐదు నిముషాల ముందు ఇదే ప్రదేశంలో 30 మంది కూలీలు పనిచేశారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయంగా ఉందని పలువురు కూలీలు తెలిపారు. కాంట్రాక్టర్ లాభాపేక్ష, అధికారుల నిర్లక్ష్యం వెరసి కూలీల పాలిట మృత్యువుగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీల ప్రాణాలను పణంగా పెట్టి ఇటువంటి ప్రమాదకర పనులు చేయించడం తగదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి మృత్యుఒడిలోకి ... ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు శుక్రవారం ప్రాజెక్ట్ వద్ద జరిగిన ప్రమాదంలో మృత్యుఒడిలోకి వెళ్లారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన సుబ్బురాయ్‌పాడవాయ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ఖలీల్, మధ్యప్రదేశ్‌కు చెందిన నందుకోల్ మట్టిపెళ్లల కింద నలిగి దేహాలు ఛిద్రమై మృతిచెందారు. పొట్ట కూటి కోసం కుటుంబాలను పోషించుకునేందుకు సుదూర ప్రాంతాలలో సైతం పనిచేసేందుకు వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో సంఘటనాస్థలంలో అనేకమంది కన్నీరు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో వారి సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లనున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం వారిని మృత్యుకౌగిలిలో బంధించింది.