హృద్రోగాలను తెలుసుకునేందుకు కొత్త పరికరం
లండన్: జన్యు సంబంధ హృద్రోగ వ్యాధులపై అంచనా వేసేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తతో కూడిన పరిశోధకుల బృందం ఓ పరికరాన్ని కనిపెట్టింది. దీంతో ముందుగానే గుర్తించి, రాకుండా చూడొచ్చని లేదా సకాలంలో సరైన చికిత్స అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. గుండె సంబంధ వ్యాధులు రావడంలో పలు జన్యు కారకాలు దోహదపడుతాయని చాలా కాలంగా తెలిసిన విషయమే.
డీఎన్ఏలో అతి తక్కువ తేడా ఉండటాన్ని సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజం (ఎస్ఎన్పీ) అంటారు. ఇది వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. ఇలాంటి దాదాపు 49 వేల ఎస్ఎన్పీలను పరిశోధకులు గుర్తించి ఓ స్కోర్‌ను రూపొందించారు. దీన్ని జీనోమిక్ రిస్క్ స్కోర్ (జీఆర్ఎస్) అంటారు. ఈ జీఆర్ఎస్ స్కోర్ ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ శాతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు గుర్తించారు.