సీఎం కేజ్రీవాల్‌ను కలిసిన జర్మనీ ప్రతినిధి బృందం
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. భారత్‌లోని జర్మనీ రాయబారి మైఖేల్ స్టెయినర్ నేతృత్వంలోని 20 మంది ప్రతినిధులు కేజ్రీవాల్‌ను కలిసి ఇటీవల ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయానికి శుభాకాంక్షలు చెప్పారు. ఏ విధంగా వారితో సహకారాన్ని పంచుకోవాలనే అంశాలపై దృష్టి సారించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీని కోసం దేశ రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పునరుత్పాదక శక్తి వనరులు తదితరాల అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అవినీతిని అంతమొందించడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా జర్మనీ ప్రతినిధులతో కేజ్రీవాల్ వ్యాఖ్యానించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ ప్రభుత్వం దీని కోసం వీలైనంత త్వరగా అవినీతి వ్యతిరేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని వారికి వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో రెండు రకాలైన అవనీతి ఉందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఒకటి ఘరానా దోపిడీ రకానికి చెందినదైతే, రెండోది పరస్పర ఇష్టంతో జరుగుతున్నదని వారికి కేజ్రీవాల్ వివరించారని అధికారి తెలిపారు. ఈ రెండు రకాల అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ చెప్పారన్నారు. దీని కోసం యాంటీ కరప్షన్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడానిక ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.