German Grand Prix
-
వెల్డన్... వెర్స్టాపెన్
హాకెన్‌హీమ్ : జర్మనీ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఈ డచ్ యువ రేసర్ జర్మన్ ట్రాక్‌పై దుమ్మురేపాడు. రేసును అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 64 ల్యాపుల ఈ రేసులో అతనికి ఆదివారం బాగా కలిసొచ్చింది. మేటి రేసర్ల కార్లు ఢీకొనడం, వర్షం వల్ల గజిబిజిగా సాగిన ఈ రేసులో వెర్స్టాపెన్ చివరకు విజేతగా నిలిచాడు. అతను గంటా 44 నిమిషాల 31.275 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో రెండో టైటిల్ సాధించాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో ఇది ఏడో విజయం. నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్ దక్కించుకున్న ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు అందనంత వేగంగా కార్‌ను బుల్లెట్లా పరుగెత్తించాడు. దీంతో వెటెల్ 1గం:44ని:38.608 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టోరో రోసో డ్రైవర్ డానిల్ క్వియాట్ (1గం:44ని:39.580 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ రేసు తీవ్ర నిరాశను మిగిల్చింది. తన కెరీర్లో 200వ రేసు బరిలోకి దిగిన హామిల్టన్ కారు ప్రమాదానికి గురవడంతో చాలా ఆలస్యంగా 1గం:44ని:50.942 సెకన్లలో రేసును పూర్తిచేశాడు. ప్రమాదంతో పాటు అగచాట్లతో ఆరు సార్లు అతని కారుకు బ్రేకులు పడ్డాయి. దీంతో కనీసం ఒక్క పాయింటైనా అతను పొందలేకపోయాడు. గత 23 రేసుల్లో ఈ మెర్సిడెస్ డ్రైవర్ పాయింట్ కూడా గెలవలేకపోవడం ఇదే మొదటిసారి. ఈ రేసులో పలువురి కార్లు ఢీకొనడంతో హేమాహేమీలైన డ్రైవర్లు అసలు రేసునే పూర్తి చేయలేకపోయారు. బొటాస్ (మెర్సిడెస్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ), రికియార్డో (రెనౌ)లు రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆగస్టు 4న హంగేరి గ్రాండ్‌ప్రి జరుగుతుంది. -
హామిల్టన్ 'సిక్సర్'!
హాకెన్‌హీమ్:వారం రోజుల క్రితం హంగేరీ గ్రాండ్ ప్రిలో సత్తా చాటిన ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దుమ్మురేపాడు. జర్మన్ గ్రాండ్ ప్రిలో భాగంగా ఆదివారం జరిగిన ప్రధాన రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ 67 ల్యాప్‌లను అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. తద్వారా వరుసగా నాల్గో విజయాన్ని సాధించిన హామిల్టన్.. ఈ సీజన్లో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంత ఆకట్టుకున్నాడు. అయితే క్వాలిఫయింగ్ సెషన్లో పోల్ పొజిషన్ సాధించి రేసును ఆరంభించిన తన సహచర మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ నాల్గో స్థానానికి పరిమితమై సొంత ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాడు. కాగా, రెడ్ బుల్ కు చెందిన డానియల్ రికియార్డో, మాక్స్ వెర్స్టాపెన్లు పొడియం పొజిషన్ సాధించారు. ఈ రేసులో రికియార్డో రెండో స్థానంలో, వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలవడం విశేషం. గత హంగేరి గ్రాండ్ ప్రితో ఈ సీజన్ లో తొలిసారి డ్రైవర్ల పాయింట్ల పట్టికలో ముందంజలోకి వచ్చిన హామిల్టన్..తాజా రేసులో విజయం సాధించిన అనంతరం 19 పాయింట్ల ఆధిక్యం సాధించి రోస్ బర్గ్ ను మరింత వెనక్కినెట్టాడు. ఇది జర్మన్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ కు మూడో విజయం కాగా, ఓవరాల్ కెరీర్లో 49 విజయం కావడం విశేషం. -
రోస్బర్గ్కే పోల్ పొజిషన్
హాకెన్‌హీమ్:ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సొంతగడ్డపై శనివారం జరిగిన జర్మన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. తద్వారా ఈ సీజన్ లో ఐదోసారి పోల్ పొజిషన్ ను నమోదు చేశాడు. రోస్ బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 14. 363 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్ బర్గ్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. అయితే అతని సహచర జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 0.107 సెకన్ల వెనుకబడి రెండో స్థానానికి పరిమితం కాగా, రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో మూడో స్థానంలో నిలిచాడు. గత హంగేరీ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ కు ఇది వరుసగా రెండో పోల్ పొజిషన్.