ఆ యువకుడు పాకిస్థానీనా..?
జర్మనీలో ఉగ్రవాదదాడికి పాల్పడిన యువకుడు (17) ఏ దేశానికి చెందినవాడన్న విషయంపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆగంతకుడిని అఫ్ఘానిస్థాన్‌కు చెందిన శరణార్థిగా పోలీసులు మొదట భావించారు. అయితే ఈ యువకుడు పాకిస్థాన్‌కు చెందినవాడిగా బుధవారం సందేహం వ్యక్తం చేశారు. జర్మనీలో దాడికి పాల్పడింది తామేనని, ఉగ్రవాదిని తమ ఫైటర్‌గా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా ఈ ఉగ్రవాది ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఉగ్రవాది రెండేళ్ల క్రితం జర్మనీకి శరణార్థిగా వచ్చాడు. జర్మనీలోకి సులువుగా ప్రవేశించేందుకోసం అఫ్ఘాన్ జాతీయుడిగా ఆ యువకుడు చెప్పిఉంటాడని భద్రతాధికారులు భావిస్తున్నారు. అతని గదిలో పాకిస్థాన్‌కు చెందిన డాక్యుమెంట్, ఐఎస్ జెండా లభ్యమయ్యాయి. వీడియోలో ఉగ్రవాది తన పేరును మహ్మద్ రియాద్గా చెప్పుకున్నా, జర్మనీలోకి అతను వచ్చినపుడు రిజిస్టర్ అయిన వివరాలతో ఈ పేరు మ్యాచ్ కాలేదు. ఉగ్రవాది నివసించిన ప్రాంతంలోని స్థానికులు అతడి పేరును రియాజ్‌గా చెప్పారు.
సోమవారం అర్ధరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఓ యువకుడు కత్తి, గొడ్డలితో ప్రయాణికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జర్మనీ భద్రత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి యువకుడిని కాల్చి చంపాయి. బాంబులు, తుపాకీలతో దాడులు చేసే ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విభిన్న మార్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఇటీవల ఐఎస్ ఉగ్రవాదులు జనసమూహంపై ట్రక్ నడిపారు. ఈ దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.