శిశువు మృతికి ఆస్పత్రి అధికారులే కారణం
పౌరహక్కుల సంఘం నిజనిర్థారణ కమిటీ వెల్లడి
పాతగుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో వాస్తవాలను గుర్తించేందుకు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ ఆదివారం ఉదయం గుంటూరు జీజీహెచ్లో శిశువుకు సర్జరీ చేసిన డాక్టర్ సీహెచ్ భాస్కరరావు, స్టాఫ్ నర్సులను, సిబ్బందిని కలిసి వివరాలు సేకరించింది. ఎలుకలు దాడిచేసి గాయపరచడం వల్లే పసికందు మృతిచెందిందని కమిటీ నిర్ధారించింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎంవో, శానిటరీ ఇన్స్పెక్టర్, కమిటీ చైర్మన్లపై మాత్రమే ఉందని డాక్టర్లు, నర్సులకు సంబంధించిన అంశం ఏమాత్రం కాదని తేల్చింది.
ఇప్పటికైనా మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత జీజీహెచ్ అధికారులపై ఉందని అభిప్రాయపడింది. విచారణ జరిపిన కమిటీలో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు, డి.వెంకటేశ్వరరావు, డాక్టర్ వీరేశలింగం, జంపని చెనకేశవులు, ఇతర కార్యవర్గసభ్యులు ఉన్నారు.