Ghanded
-
వేధింపులకు వివాహిత బలి
ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం భర్త, అత్తామామలపై కేసు నమోదు గండేడ్: జీవితంపై కోటిఆశలతో ఆ యువతి అత్తింట్లోకి అడుగుపెట్టింది. ఎన్నో కలలు కన్నది. ప్రేమ వివాహం.. ఇద్దరి సామాజిక వర్గాల నేపథ్యంలో అవన్నీ చెదిరిపోయాయి. అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లి అయిన 10 మాసాలకే వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన గండేడ్ మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జూలపల్లికి ముదిరాజ్ తిరుపతయ్య, అదే గ్రామానికి చెందిన ఈడిగి ప్రమీల (19)గత 10 నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. తిరుపతయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులపాటు వారి కాపురం సాఫీగానే సాగింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కొంతకాలం నుంచి ప్రమీలను ఆమె భర్త తిరుపతయ్య, అత్తామామలు వేధించసాగారు. ఇటీవల వేధింపులు భరించలేనంత తీవ్రమవడంతో జీవితంపై విరక్తి చెందిన ప్రమీల శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమేరకు పోలీసులు ప్రమీల ఆమె భర్తతోపాటు అత్తామామలైన రాములమ్మ, బుచ్చయ్యపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. -
నలుగురు ఉపాధ్యాయుల బైండోవర్
గండేడ్: బోగస్ ఉపాధ్యాయుల విషయమై సమాచార హక్కుచట్టం కింద సమాచారాన్ని కోరిన విషయంలో తనపై కేసులు నమోదు చేయించి తనను జైలుపాలు చేశారని మహమ్మదాబాద్ గ్రామస్తుడు గోపాల్ ఫిర్యాదు మేరకు గండేడ్ మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను మంగళవారం బైండోవర్ చేసినట్లు ఎస్ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొండారెడ్డి, పాండునాయక్, వెంకట్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌ను గండేడ్ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచామని ఆయన చెప్పారు. గోపాల్‌కు ఎలాంటి హాని జరిగినా సదరు ఉపాధ్యాయులే బాధ్యులవుతారని ఎస్ఐ వివరించారు. -
‘గండేడ్’ను మహబూబ్‌నగర్‌లో విలీనం చేయాలి
నంచర్లగేట్ పల్లవి కళాశాల ఆవరణలో విలీన చర్చ గండేడ్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న గండేడ్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో విలీనం చేయాలని గండేడ్ ఎంపీపీ శాంతిబాయి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని నంచర్ల పల్లవి కళాశాల ఆవరణలో గురువారం విలీన చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను విడిగా చేసే కార్యక్రమంలో భాగంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేస్తూ గండేడ్ మండలాన్ని రంగారెడ్డిలోనే కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు. అలా ఐతే వికారాబాద్‌కు 70 కిలోమీటర్లు కాగా.. అక్కడికి వెళ్లేందుకు ప్రజలు అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు. కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం అయితే.. అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మండలాన్ని మహబూబ్‌నగర్‌లో కలపాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొమిరె లక్ష్మయ్య, రుద్రారెడ్డి, యాదయ్య, గోవిందరెడ్డి, అనంతరెడ్డి, ఎంపీటీసీ ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.