వేధింపులకు వివాహిత బలి
ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం
భర్త, అత్తామామలపై కేసు నమోదు
గండేడ్: జీవితంపై కోటిఆశలతో ఆ యువతి అత్తింట్లోకి అడుగుపెట్టింది. ఎన్నో కలలు కన్నది. ప్రేమ వివాహం.. ఇద్దరి సామాజిక వర్గాల నేపథ్యంలో అవన్నీ చెదిరిపోయాయి. అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లి అయిన 10 మాసాలకే వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన గండేడ్ మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జూలపల్లికి ముదిరాజ్ తిరుపతయ్య, అదే గ్రామానికి చెందిన ఈడిగి ప్రమీల (19)గత 10 నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. తిరుపతయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కొన్ని రోజులపాటు వారి కాపురం సాఫీగానే సాగింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కొంతకాలం నుంచి ప్రమీలను ఆమె భర్త తిరుపతయ్య, అత్తామామలు వేధించసాగారు. ఇటీవల వేధింపులు భరించలేనంత తీవ్రమవడంతో జీవితంపై విరక్తి చెందిన ప్రమీల శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమేరకు పోలీసులు ప్రమీల ఆమె భర్తతోపాటు అత్తామామలైన రాములమ్మ, బుచ్చయ్యపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.