ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకాలు తీసుకొని ఏ విధంగా లబ్ధి పొందిందో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆమె ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబానికి ఎంతగా లబ్ధి చేకూరిందీ, వారి పిల్ల లకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా విధానం ఎంతగా ఉపయోగ పడనున్నదో సంతోషంగా తెలియ పరిచింది. కానీ ఆమె అభిప్రాయంపై కొందరు వ్యక్తులు (ప్రతి పక్షాల కార్యకర్తలు) అనుచిత, అన్‌పార్ల మెంటరీ పదాలతో కూడిన కామెంట్లు చేశారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు తల్లిలేని పిల్లలయ్యారు.
ఈ మధ్యకాలంలో ‘సోషల్ ట్రోలింగ్’ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజ కీయాలలో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఒక పార్టీనీ, ఒక వ్యక్తినీ, ఒక నాయకుణ్ణీ, ఒక విధానాన్నీ సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే సామాజిక మాధ్యమాల్లో పలు పార్టీలకు సంబంధించిన వారు అదే పనిగా వారిని విమర్శించడం కనిపిస్తోంది. అయితే ఇందులో మహిళలను కించపరచడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, అనరాని మాటలు అనడం బాధాకరం. రాజకీయ చర్చల్లో సాధారణంగా చిన్న పిల్లల్నీ, మహిళలనూ కించపరచకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా?
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కేవలం రాజకీయ వర్గాలే కాదు సాధారణ ప్రజలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలికలు మాట్లా డిన ఇంగ్లీష్‌పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి వారు ముందుకు దూసుకువెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటువంటి పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్‌పై వ్యంగ్యా స్త్రాలను ఆ యా వర్గాలకు చెందిన వారే కొందరు ట్రోల్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇలా ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న మహిళలూ, బడిపిల్లలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వారిని క్షోభ పెట్టడం ప్రతిపక్ష కార్యకర్తలకు తగదు. ఇలా చేస్తే వారు అవమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం పెరుగుతుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు... ట్రోల్ చేసేవారిని గుర్తించి, నియంత్రించడానికి ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా తమ ఐటీ డిపార్ట్‌మెంట్ ద్వారా తగిన నియంత్రణా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటువంటి వారికి జరిమానాలు విధించాలి.
భావస్వేచ్ఛ ఉందికదా అని ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదుకదా? ఇటువంటి వారి ప్రవర్తన సామాజిక మాధ్య మాల్లో చురుగ్గా ఉండే యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఈ ట్రోలింగ్‌లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం ఇందుకు నిదర్శనం. గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు గురు వారం ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని గుంటూరు ఎస్పీ తుషార్ ప్రకటించారు. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే ట్రోలింగ్‌ను అరికట్టడం సాధ్య మవుతుంది.
– డా‘‘ శ్రవణ్ కుమార్ కందగట్ల
sravankuc@gmail.com
ట్రోలింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
Published Fri, Mar 15 2024 12:30 AM | Last Updated on Fri, Mar 15 2024 12:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment