‘గండేడ్’ను మహబూబ్‌నగర్‌లో విలీనం చేయాలి
నంచర్లగేట్ పల్లవి కళాశాల ఆవరణలో విలీన చర్చ
గండేడ్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న గండేడ్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో విలీనం చేయాలని గండేడ్ ఎంపీపీ శాంతిబాయి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని నంచర్ల పల్లవి కళాశాల ఆవరణలో గురువారం విలీన చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాను విడిగా చేసే కార్యక్రమంలో భాగంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేస్తూ గండేడ్ మండలాన్ని రంగారెడ్డిలోనే కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు. అలా ఐతే వికారాబాద్‌కు 70 కిలోమీటర్లు కాగా.. అక్కడికి వెళ్లేందుకు ప్రజలు అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు. కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం అయితే.. అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మండలాన్ని మహబూబ్‌నగర్‌లో కలపాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొమిరె లక్ష్మయ్య, రుద్రారెడ్డి, యాదయ్య, గోవిందరెడ్డి, అనంతరెడ్డి, ఎంపీటీసీ ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.