ఘటోత్కచుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 34
ఘటోత్కచుడు హిడింబి అనే ఒక రాక్షసి కడుపున పుట్టాడు. అంటే, రాక్షసాంశ ఉన్నవాడన్నమాట. పాండవుల తట్టున ఉన్నంతమాత్రాన, భీమసేనుడి కొడుకైనంత మాత్రాన ఘటోత్కచుడు ధర్మలోపం చేయనివాడేమీ కాదు. అతను యజ్ఞద్వేషీ జ్ఞానద్వేషీను. కర్ణుడు ఇంద్రుడికి తన కవచ కుండలాల్ని దానం చేసి, ప్రతిదానంగా అర్జునుణ్ని చంపాలనే దుర్బుద్ధితో శక్తినొకదాన్ని అడిగి పుచ్చు కొన్నాడు.
ఆ శక్తి కర్ణుడి దగ్గరున్నంత వరకూ శ్రీకృష్ణుడికి ఒకటే బెంగ. దాన్ని, ఘటోత్కచుడి ప్రతాపాన్ని సహించలేక కర్ణుడు వేసి అతన్ని చంపినప్పుడు, శ్రీకృష్ణుడు ఆనందాన్ని పట్టలేక, గట్టిగా సింహనాదం చేస్తూ అర్జునుణ్ని కావలించుకొన్నాడు. మగధరాజు జరాసంధుడూ చేదిరాజు శిశుపాలుడూ నిషాదరాజు ఏకలవ్యుడూ - వీళ్లని వేరు వేరు ఉపాయాలతో చనిపోయేలాగ చేయకపోతే, ఈ మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి వైపు వాళ్లు చేరడమూ ఖాయమే, వాళ్లను జయించలేకపోవడమూ ఖాయమే అయ్యుండేది. వాళ్లతోపాటు ఘటోత్కచుడు కూడా ముందే పోవలసిన వాడే కానీ పాండవులకు ప్రియుడు గనక, ఇంత కాలంపాటు అతను బతికి ఉన్నాడు.
కర్ణుణ్ని కవచకుండలాలతో సహా శక్తి హీనుణ్ని చేసి మానుషత్వాన్ని పొందేలాగ ధర్మాన్ని నిలబెట్టే శ్రీకృష్ణుడి ఉపాయమే చేసింది. కర్ణుడు బ్రహ్మణ్యుడు, అంటే, జ్ఞాన సంపన్నుల్ని ప్రేమించేవాడు; సత్యాన్నే చెప్పేవాడు; తపస్సు చేసిన వాడు; నియమాలనూ వ్రతాలనూ చేసిన వాడు; శత్రువుల్ని కూడా దయగా చూసే వాడు. ఈ గుణాల కారణంగా అతన్ని ధర్మాత్ముడని నలుగురూ చెప్పుకొనేవాళ్లు. అర్జునుడు తప్ప మరెవ్వరూ చంపలేరు కర్ణుణ్ని. అర్జునుడికి ఆ అవకాశం రావాలంటే, కర్ణుడికి ఇంద్రుడిచ్చిన శక్తి వ్యర్థమైపోవాలి.
దాన్ని అతను వివశుడై, మరేమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉపయో గించాలి. ఈ యోగంతోనే రెండు ఫలా లను సాధించాడు శ్రీకృష్ణుడు; ఒకటి, కర్ణుడు శక్తిహీనుడు కావడమూ, రెండోది, ఘటోత్కచుడనే రాక్షస స్వభావం చనిపో వడమూను. ఈ కారణంగానే ఘటోత్క చుడు పతనమై పోగానే పాండవులందరూ శోకంతో ఏడుస్తున్నా, శ్రీకృష్ణుడు ఆపుకో లేనంత ఆనందంతో అతిహర్ష నాదాన్ని చేస్తూ నాట్యం చేశాడు.
బావగారైన సైంధవుణ్ని అర్జునుడు చంపి, ప్రతిజ్ఞ తీర్చుకోగానే, దుర్యో దనుడు ఉండబట్టలేక, ద్రోణుణ్ని ‘పాండవ పక్షపాతిగా యుద్ధం చేస్తున్నావు’ అంటూ నానామాటలూ అన్నాడు. దానితో బాధపడుతూ సాయంత్రం శిబిరానికి వచ్చి కూడా కవచం విప్పకుండానే తిరిగి యుద్ధభూమికి వెళ్లిపోయాడు ద్రోణుడు. పాంచాలుల్ని చంపి గానీ తిరిగి రానంటూ ఉక్రోషంతో మాట్టాడుతూ రణ భూమికి చేరిన ద్రోణుడి ముందు ఎవరూ నిలవలేకపోయారు.
ఆ విధంగా మహా భారత యుద్ధపు పద్నాలుగోరోజున యుద్ధ నియమాలకు విరుద్ధంగానే రాత్రి యుద్ధం ప్రవర్తించింది. రాక్షసులకు రాత్రి పూట అనువైన కాలం. ఇటు పాండవుల వైపు హిడింబుడి మేనల్లుడు ఘటోత్క చుడూ అటు కౌరవులవైపు జటాసురుడి కొడుకు అలంబుషుడూ ఇద్దరూ అతి రాక్షస బలంతో పేట్రేగిపోయారు.
ఘటోత్కచుడికి ఒక అక్షౌహిణీ ఉంది: ఇరవై యొక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలూ అన్నే ఏనుగులూ వాటికి మూడింతలు, అంటే, అరవై ఐదు వేల ఆరు వందల మంది గుర్రాలూ దీనికి మరో రెండింతలు కలిపిన, అంటే, ఒక లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై మంది కాల్బలమూ - ఇదీ ఒక అక్షౌహిణీ అంటే. ఈ సేన శూలాలూ ముద్గరాలూ కొండ శిఖ రాలూ పెద్ద పెద్ద వృక్షాలూ ఆయుధాలుగా పట్టుకొని సిద్ధంగా ఉంది.
ఘటోత్కచుడు ఒక పర్వత శిఖరంలాగ వస్తూ ఒక సింహగర్జన చేశాడు. ఆ గర్జనకు మనుషులు అల్లాడిపోయారు. అతను సృష్టించిన మాయతో ఇనప చక్రాలూ ఈటెలూ శూలాలూ శతఘు్నలూ వరసగా మీదపడుతూంటే ధృతరాష్ట్రుడి కొడుకులూ కర్ణుడూ ఇతర రాజులూ పరుగులు పెట్టారు. అశ్వత్థామ మాత్రం తన అస్త్ర బలంతో ఘటోత్కచుడి మాయను నష్ట పరిచి, అతనికి అతి కోపాన్ని తెప్పించాడు.
అతను కోపంతో వేసిన శరవ్రాతాలు అశ్వత్థామ శరీరంలోకి దూరి రక్తసిక్తం చేశాయి. కోపంతో అశ్వత్థామ వేసిన పది బాణాలతో గట్టి పీడ పుట్టిన ఘటోత్క చుడు ఒక చక్రాన్ని విసిరాడు. దాన్ని అశ్వత్థామ వాడి బాణాలతో దెబ్బతీశాడు. ఇంతలో ఘటోత్కచుడి కొడుకు అంజన పర్వుడు అశ్వత్థామకు అడ్డుకట్ట వెయ్య డానికి వచ్చాడు. అశ్వత్థామ అంజన పర్వుడి ధ్వజాన్ని,
రథసారథుల్నిద్దర్నీ, రథాన్నీ, నాలుగు రథాశ్వాలనూ నేల మీదకు ఒరిగేలా చేశాడు. అప్పుడు విరథుడైన అంజన పర్వుడు ఖడ్గాన్ని తీసుకొంటే దాన్నీ రెండు ముక్కలు చేశాడు ద్రోణ పుత్రుడు. ఆ మీద అంజనపర్వుడు ఆకాశంలోకి ఎగిరి వృక్షాలను వర్షించడం మొదలుపెట్టాడు. అతణ్ని ద్రోణపుత్రుడు తన వాడి శిలీ ముఖాలతో బాధపెట్టేసరికి, అంజన పర్వుడు కిందికి దిగివచ్చాడు.
రుద్రుడు అంధకాసురుణ్ని అంతం చేసినట్టు, ఇనప కవచాన్ని ధరించి ఉన్న అంజనపర్వుణ్ని ద్రౌణి యమదండంలాటి ఒక బాణంతో వధించాడు అశ్వత్థామ.
కొడుకును చంపిన అశ్వత్థామ మీదకు కసిగా ఉరికాడు ఘటోత్కచుడు. మాయను పన్ని కాటుక కొండలాగ మీద పడుతూ ఉంటే, అశ్వత్థామ వజ్రాస్త్రాన్ని వేసి, ఆ మాయాపర్వతాన్ని చూర్ణం చేశాడు. ఆ మీద అతను మేఘమై రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెడితే, వాయవ్యాస్త్రం వేసి ఆ నీలిమేఘాన్ని చెదర గొట్టేశాడు అశ్వత్థామ.
తన ప్రయత్నాలన్నీ వమ్మై కంగారేమీ పడకుండా కరాళ ముఖాలున్న చాలామంది రాక్షసులతో కలిసి అశ్వత్థామ మీద దాడిచేశాడతను. తొణకకుండా ఆ అక్షౌహిణీ సైన్యం మొత్తాన్నీ అశ్వత్థామ యమపురికి పంపించాడు. ఘటోత్కచుణ్ని కూడా ఒక బాణంతో వేధించి కిందపడేశాడు.
కొంత రాత్రి గడిచిన తరవాత మళ్లీ ఘటోత్కచుడు అశ్వత్థామకు ఎదు రయ్యాడు. ఈసారి రాక్షసుడు అశ్వ త్థామను తుఫానుగాలికి ఊగిపోయే చెట్టులాగ వణికించేశాడు. ఇంతలోనే పుంజుకొని మళ్లీ ఘటోత్కచుణ్ని యమ దండంలాటి గొప్ప బాణాలతో వేధించాడు అశ్వత్థామ. బాధలో మునిగిన ఘటోత్కచుణ్ని చూసి అతని సారథి త్వరగా రథాన్ని పక్కకు తప్పించేశాడు.
ఆ రోజు రాత్రి యుద్ధంలో కర్ణుడు విపరీతంగా విక్రమించడం మొదలు పెట్టాడు. ధర్మరాజుకు భయం వేసింది. అతను అర్జునుడితో ‘నువ్వు ఇక కర్ణుణ్ని చంపకపోతే మన సైన్యంలో ఎవరూ మిగలరు’ అంటూ అతన్ని తొందర పెట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ‘కర్ణుడితో తలపడవలసిన సమయం ఇంకా రాలేదు. ఇంకా అతని దగ్గర శక్రశక్తి ఉంది. ఇప్పుడు ఘటోత్కచుణ్ని అతని మీదకు పంపిద్దాం. ఆ రాక్షసుడి చేతిలో కర్ణుడికి మూడుతుంది’ అన్నాడు. ఘటో త్కచుణ్ని పిలిచి కర్ణుడితో యుద్ధం చేసి చంపమని పురమాయించాడు కూడాను.
ఘటోత్కచుడు కర్ణుడివైపు వెళ్తూంటే, అలంబుషుడు అడ్డుకొన్నాడు. అతణ్ని చంపి కర్ణుడి మీదకు మళ్లీ లంఘించాడు ఘటోత్కచుడు. కర్ణ ఘటోత్కచులిద్దరూ రెండు పులులు గోళ్లతో చీల్చుకొన్నట్టు, రెండు ఏనుగులు దంతాలతో కొట్టు కొన్నటు బాణాలతో ఒకళ్లనొకళ్లు క్షత విక్షతులనుగా చేసుకోవడం ప్రారంభిం చారు. ఇద్దరి శరీరాలూ రక్తాలోడాయి. మాయావి అయిన రాక్షసుడు ఒకసారి ముక్కముక్కలై బలహీనుడై ఆకాశం నుంచి పడిపోయినట్టు మాయను కల్పించాడు. అతను చనిపోయాడని కౌరవులందరూ గర్జిస్తూ ఉండగా మళ్లీ కొత్త కొత్త దేహాలతో అన్ని దిక్కుల్లోనూ కనిపించడం మొదలుపెట్టాడు. ఒకసారి బొటనవేలంత చిన్నవాడిగానూ మరోసారి మైనాక పర్వతమంత పెద్దగానూ అవుపిస్తూ వాళ్లకు శాంతి లేకుండా చేస్తూ మూడు చెరువుల నీళ్లు తాగించాడు.
ఈవిధంగా రాత్రి యుద్ధం జరుగు తూన్న విషయం అలాయుధడనే బకా సురుడి సోదరుడికి తెలిసి దుర్యోధనుడి దగ్గరికి తన రాక్షస సైన్యంతో సహా వచ్చి ‘నేను భీముణ్ని చంపి మా అన్న బకుడి ఋణం తీర్చుకొంటాను. అతను మా రాక్షసుల ఆడపడుచును బలాత్కారంగా పెళ్లి చేసుకొని మమ్మల్ని అవమానించాడు. హిడింబుణ్నీ కిమ్మీరుణ్నీ చంపాడు. మా రక్తం కుతకుతలాడుతోంది. అనుజ్ఞ ఇయ్యి’ అంటూ ప్రాధేయపడ్డాడు.
దుర్యోధనుడి ఆజ్ఞ తీసుకొని భీముణ్ని ఎదిరించాడు అలాయుధుడు. అతను భీముణ్ని హింసి స్తూంటే శ్రీకృష్ణుడు మళ్లీ ఘటోత్కచుణ్ని పిలిచి ‘మీ నాన్నను ఇబ్బందిపెడుతూన్న అలాయుధుణ్ని ముందుగా చంపు’ అని పంపాడు. ఆ మీద అలాయుధుణ్ని పట్టి తిప్పితిప్పి నేలకేసి కొట్టి తలకాయను నిర్దాక్షిణ్యంగా కోసేశాడు ఘటోత్కచుడు.
తిరిగి కర్ణుడి మీదకు మళ్లించాడు ఘటోత్కచుడు తన ప్రతాపాన్ని.
కర్ణుడు అంతరిక్షాన్నంతనీ బాణాలతో ఆచ్ఛాదించి విజృంభిస్తూ ఉంటే, ఘటోత్కచుడు దారుణమైన మాయను ప్రయోగించాడు. ఎర్రటి మబ్బులు ప్రకాశించాయి; వాటి నుంచి మెరుపులూ ఉల్కలూ పడడం మొదలుపెట్టాయి. రకరకాల శరాలూ శక్తులూ ఈటెలూ రోకళ్లూ గొడ్డళ్లూ ఖడ్గాలూ ఇనపగదలూ శతఘు్నలూ బండరాళ్లూ పిడుగులూ చక్రాలూ సైన్యం మీద అవిచ్ఛిన్నంగా పడడం మొదలు పెట్టాయి. వాటిని ఆపలేకపోయాడు కర్ణుడు.
గుర్రాలు చచ్చి కిందపడు తున్నాయి; ఏనుగులు నేలకూలి పోతున్నాయి; మహారథులు చతికిల పడిపోతున్నారు.ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. ఎవర్నీ వదలకుండా నిర్దాక్షిణ్యంగా నరికి పోగులు పెట్టాడు ఘటోత్కచుడు. ఈ ఊచకోతను భరించలేక కౌరవులు కర్ణుడితో ‘ఇక నువ్వు ఇంద్రశక్తితో వీణ్ని చంపకపోతే మేమందరమూ నాశనమైపోతాం’ అంటూ కాళ్లావేళ్లాపడి బతిమాలడం మొదలుపెట్టారు. దాంతో అర్జునుణ్ని చంపాలని దాచుకొన్న శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు కర్ణుడు. ఆ రాక్షసుడి మహా శరీరం నేలమీద పడుతూ ఒక అక్షౌహిణీ కౌరవ సైన్యాన్ని ముద్ద ముద్ద చేసింది. ఇదే కర్ణసంహారానికి దారిని సుగమం చేసింది.