తెలంగాణ ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నాం
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని కేంద్ర మంత్రి, జీవోఎంలో సభ్యుడు గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. శుక్రవారం పార్లమెంట్లో ఆజాద్ మాట్లాడారు. నేడు జరగనున్న కేంద్ర కేబినెట్ ముందుకు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు వస్తుందన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే తెలంగాణ బిల్లును ఆమోదింపచేయడానికి తామంతా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసమగ్రం ఉందని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపింది.
అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు హస్తిన చేరుకున్నారు. బిల్లు ఆమోదం పొందకుండా ఓ ప్రాంత వారు, బిల్లు ఆమోదం పొందాలని మరో ప్రాంతం వారు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర పార్టీల నేతలను కలసి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలో ఇరు ప్రాంతాల వారులో ఒకరు ఆమోదం పొందుతుందని, మరోకరు ఆమోదం పొందదని బల్లగుద్ది మరి చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ విభజన అంశం కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్ రెండు సభలలో ఆమోదం పొందేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.