తెలుగుదేశానికి తుడుం దెబ్బ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి గిరిజన అభ్యర్థుల నుంచి గట్టి దెబ్బ తగలనుంది. అల్లూరి జిల్లాలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఇప్పటికే పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి దొన్నుదొర, అబ్రహంలు పోటీలో ఉంటామని ప్రకటించారు. అదే దారిలో రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరి కూడా రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
గిరిజనులను మోసం చేసిన తెలుగుదేశం పార్టీని అల్లూరి జిల్లాలో తుడిచిపెట్టేస్తామని హెచ్చరిస్తున్నారు. గిరిజనులంటే చిన్న చూపు ఉన్న తెలుగుదేశం పార్టీకి తమ సత్తా చాటుతామని.. నిన్ను నమ్మం బాబూ అంటూ ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అల్లూరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూసింది. ఎంపీ ఎన్నికల్లో కూడా నామరూపాలు లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో మరింత గట్టిగా తెలుగుదేశం పార్టీకి తుడుం దెబ్బ రుచి చూపిస్తామని గిరిజనులు ఘంటాపథంగా హెచ్చరిస్తున్నారు.
పార్టీలు మారినా ఫాయిదా లేదు..!
వాస్తవానికి 2014 ఎన్నికల్లో పాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి.. చంద్రబాబు వలలో చిక్కుకుని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక అరకు నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావు కూడా చంద్రబాబు మాటల మాయలో పడి పార్టీ మారారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా అదే దారిలో వెళ్లారు. అయితే, ఈ దఫా ఎన్నికల్లో వీరిలో ఇద్దరికీ పక్కా సీటు అని చంద్రబాబు నమ్మించారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి పక్కాగా పోటీలో ఉంటానని నమ్మారు. ఇక రంపచోడవరం నుంచి రాజేశ్వరి కూడా తనకు ఎదురులేదని భావించారు.
పార్టీ మారి వచ్చిన తమకు గౌరవం దక్కుతుందని ఊహించుకున్నారు. అరకు నుంచి దొన్నుదొరను అభ్యర్థిగా కూడా బహిరంగ సభ పెట్టి మరీ బాబు ప్రకటించారు. అయితే, తీరా ఎన్నికలు వచ్చే సమయానికి అరకు సీటును బీజేపీకి కేటాయించిన చంద్రబాబు.. మిగిలిన రెండు సీట్లలో కూడా తనను నమ్మి పార్టీ మారి వచ్చిన వారికి మొండిచేయి చూపారు. తమకు విలువ లేకుండా పోయిందని వారంతా మరింత కోపంతో రగిలిపోతున్నారు. నమ్మించి మోసం చేసిన బాబుకు తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.
నామరూపాలు లేకుండా చేస్తాం...!
అల్లూరి జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటునూ టీడీపీ దక్కించుకోలేదు. అరకు ఎంపీతో పాటు పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలన్నింటిలోనూ ఓటమి చవిచూసింది. ఈ దఫా ఎన్నికల్లో ఎక్కడో ఒక్క సీటులోనైనా బోణీ చేయాలని భావించిన టీడీపీ అరకు నుంచి ముందుగానే దొన్నుదొరకు సీటు ఇస్తున్నట్టు ప్రకటించింది. దొన్నుదొరకు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ మరో నేత అబ్రహం రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. అయితే, తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ సీటును కూడా బీజేపీకి కేటాయించారు.
ఈ నేపథ్యంలో అరకు నుంచి అటు అబ్రహంకు తోడు దొన్నుదొర కూడా చంద్రబాబు వ్యవహారశైలిపై మండిపడుతూ బరిలో ఉండనున్నట్టు ప్రకటించారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబును ఏజెన్సీ ప్రాంతాల్లో నామరూపాలు లేకుండా చేస్తామని గిడ్డి ఈశ్వరి శపథం చేస్తున్నారు. మరోవైపు సీటు కోల్పోయి కన్నీరు పెట్టుకున్న రంపచోడవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరి కూడా తమ సత్తా చూపి ఏజెన్సీల్లో సైకిల్ పార్టీకి సీటు లేకుండా చేస్తామని పేర్కొంటున్నారు. మొత్తంగా అల్లూరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద వెంటాడుతోంది.