Girijapur
-
అక్రమ ప్రాజెక్టుల పాపం బాబుదే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో చేసిన నిర్వాకాల వల్లే కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీలను నిర్మించుకునే స్థాయికి బరి తెగించిందని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం రాయచూర్ జిల్లా గిరిజాపూర్‌లో నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మహబూబ్‌నగర్ నుంచి భారీ వాహన శ్రేణితో కర్ణాటక సరిహద్దుకు చేరుకున్న పొంగులేటి.. కర్ణాటక ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సరిహద్దు బ్రిడ్జిపై పాదయాత్ర నిర్వహించారు. కార్యకర్తలతో కలసి గిరిజాపూర్ ప్రాంతానికి వెళ్లేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించారు. ఒక దశలో కర్ణాటక పోలీసులను ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ‘శీనన్న సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారా సాత్‌హై..’ అంటూ నినాదాలిస్తూ పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పొంగులేటికి అండగా నిలిచారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఆయన కార్యకర్తలతో కలసి కాలినడకన కర్ణాటకలోకి ప్రవేశించారు. గిరిజాపూర్ వద్ద 144 సెక్షన్ ఉన్నందున అనుమతించలేమని కర్ణాటక పోలీసులు చెప్పడంతో తాము వెళ్లి తీరాల్సిందేనని పొంగులేటి వారికి స్పష్టంచేశారు. దీంతో చేసేది లేక మీడియాతో పాటు ఎనిమిది మందిని బ్యారేజీ సందర్శనకు అనుమతించారు. బ్యారేజీ పనులు క్షుణ్ణంగా పరిశీలించిన పొంగులేటి అక్కడి అధికారులతో నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కర్టాటక తీరుతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిలిపివేత కోసం తమతో కలసి వచ్చే అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమం ఏర్పాటు చేస్తామన్నారు. ఉమాభారతికి ఫిర్యాదు చేస్తాం కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై పల్లెత్తు మాట అనలేదని.. అదే అలుసుతో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తును 518 అడుగుల నుంచి 526 అడుగులకు ఎత్తు పెంచుకున్నా ఏమాత్రం స్పందించకపోగా.. సహకరించినట్లుగా వ్యవహరించార ని దుయ్యబట్టారు. కర్ణాటక ప్రభుత్వ అక్రమ కట్టడ నిర్మాణాలపై త్వరలో కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరే ముందు మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పొంగులేటికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ సమీపంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భగవంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, నాయకులు జెట్టి రాజశేఖర్, మహ్మద్ వాజీద్, మతిన్ ముజాహిత్ అలీ, జయరాజ్, జెఎస్.మేరీ, వంగ లక్ష్మణ్, లింగారెడ్డి, రవిందర్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, హైదర్ అలీ, విష్ణువర్ధన్‌రెడ్డి, జయంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజాపూర్ వద్ద గిల్లికజ్జాలు
కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలు సరిహద్దుల్లో మంత్రి, ఎంపీలను అడ్డుకున్న కర్ణాటక పోలీసులు మీడియాకు అనుమతి నిరాకరణ మహబూబ్‌నగర్: కర్ణాటకలోని గిరిజాపూర్ వద్ద కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని పరిశీలించేందుకు మంగళవారం టీఆర్ఎస్ నేతలు అక్కడకు వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీని పరి శీలించడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలను కర్ణాటక సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. గిరిజాపూర్, శక్తినగర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ప్రజలను, పార్టీ నేతలను అనుమతించే అవకాశం లేదని అడ్డుకున్నారు. దీంతో దాదాపు గంటసేపు ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్ స్తంభిం చింది. కర్ణాటక లోని రాయిచూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పాపయ్య, డీఎస్పీలతో వాదోపవాదాలు జరి గిన అనంతరం మంత్రితో పాటు ఐదుగురిని అనుమతించడానికి పోలీసులు అంగీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వెళ్లిన మీడియాను పోలీసులు అనుమతించలేదు. కర్ణాటక నుం చి వచ్చిన మీడియాను మాత్రం గిరిజాపూర్ వరకు అనుమతిం చారు. దీంతో జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డి వెళ్లి బ్యారేజీని పరిశీలించారు. వీటికి ఉన్న అనుమతుల గురించి, ఎంత నీటిని నిల్వ చేస్తున్నారన్న అంశాన్ని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణావాటర్ బోర్డు నుంచి రెండు టీఎంసీలను నిల్వ చేసుకోవడానికి అనుమతి ఉందని అధికారు లు వివరించారు. బ్యారేజీ నిర్మాణం రాయిచూర్ థర్మల్ పవర్‌స్టేషన్ నీటి వినియోగానికి మాత్రమే ఉపయోగిస్తామని.. ఇందులో ఎటువంటి ఆయకట్టు లేదని అక్కడి అధికారులు వివరించారు. ‘దమ్ముంటే ఆ బ్యారేజీని ఆపాలి’ మాగనూర్: టీటీడీపీ నాయకులకు దమ్ముంటే గిరాజాపూర్ బ్యారేజీని ఆపేందుకు కేంద్రానికి చంద్రబాబుతో చెప్పించాలని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజాపూర్ బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన వెళ్లారు. విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం కాబట్టి కేంద్రానికి చెప్పి నిలిపివేయించాలన్నారు. -
కర్ణాటక జల చౌర్యానికి అంతేది?
కృష్ణా, భీమా నదులపై అక్రమ బ్యారేజీల నిర్మాణం గుల్బర్గా జిల్లాలోనే 13కు పైగా బ్యారేజీల ఏర్పాటు శరవేగంగా కొనసాగుతున్న గిరిజాపూర్ బ్యారేజీ పనులు మాగనూర్: వర్షాలు కురవకపోయినా ఎప్పుడూ నదితీర ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటిని అందించే కృష్ణా, భీమా జీవనదులు జీవచ్ఛవంలా మారాయి. చుక్కనీళ్లు లేక రాళ్లు తేలాయి. ఈ ప్రాజెక్టులకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్ట ప్రభుత్వాలు పది కిలోమీటర్లకు ఒక బ్యారేజీ చొప్పున అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ప్రభుత్వం రాయిచూర్ జిల్లాలోని గిరిజాపూర్ గ్రామం వద్ద కృష్ణానదిపై మరో అక్రమ బ్యారేజీ నిర్మాణం ప్రారంభించింది. దీనికి గత నెల 28న అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటూ రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ బ్యారేజీ పొడవు 1170 మీటర్లు (1.35 కిలోమీటర్లు). దీనికి 194 గేట్లు బిగించనున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. ఈ బ్యారేజీ నిర్మాణాన్ని యుద్ధప్రతిపాదికన చేపట్టి 24 నెలల్లోనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శక్తినగర్‌లోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు నీటిని అందించేందుకే ఈ బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. ఇందులో అధికారికంగా ఒక టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ ఉంచుతామని అక్కడి అధికారులు చెబుతున్నా, అదనంగా మరో టీఎంసీ నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉంది. అదనంగా నిల్వ చేసే నీటిని లిఫ్ట్‌లతో రైతుల పొలాలకు నీరందించే ప్రయత్నంలో ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లనుంది. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో ఈ బ్యారేజీల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఆ తరువాత నవంబర్, డిసెంబర్ నెలలో వరద తగ్గుతుంది. ఆ సమయంలో పైన ఉన్న ఈ బ్యారేజీలకు గేట్లు మూసేసి వచ్చే నీటిని నిల్వచేసుకుంటారు. దీంతో దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు నీరురాక ఇబ్బందులు ఏర్పడనున్నాయి. మూడు జిల్లాలకు నష్టం కర్ణాటక నిర్మిస్తున్న గిరిజాపూర్ ప్రాజెక్టువల్లా దిగువన ఉన్న 17 ఎత్తిపోతల పథకాలకు నీరందకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా తాగునీటికోసం కృష్ణానదిపై ఆధారపడిన మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు రానున్నాయి. నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నామంటున్న కర్ణాటక నదులపై బ్యారేజీల నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక అధికారులు వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూమి ముంపునకు గురైతేనే కేంద జలవనరుల శాఖ అనుమతులు అవసరమని.. ఇప్పుడు కర్ణాటక నిర్మించిన ఏ ప్రాజెక్టులోనూ భూమి ముంపునకు గురికానందున అనుమతి అవసరం లేదని వాదిస్తోంది. ప్రస్తుతం వారు నదిలో మాత్రమే నీటిని నిల్వ చేసుకుంటున్నారు. వీటికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడంతో పాటూ రెతులు సొంతంగా మోటర్లు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని వాడుకుంటున్నారు. కానీ ఎక్కడా భూములు, గ్రామాలు ముంపునకు గురికాలేదు. తాము కేవలం నదిలోనే నీటిని నిల్వ ఉంచుకొని నీటిని వాడుకుంటున్నాం కాబట్టి వీటికి అనుమతులు అవసరం లేదని వాదిస్తున్నారు. పదేళ్ల నుంచి బ్యారేజీల నిర్మాణం కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం పదేళ్ల క్రితం నుంచే బ్యారేజీల నిర్మాణాలు ప్రారంభించింది. భీమా నదిపై ఇటీవల నిర్మించిన గూడూర్, సన్నత్తిగి, యాద్గిర్ బ్యారేజీలు, కృష్ణానదిపై గూగల్, తింతిని వద్ద నిర్మించిన బ్రిడ్జికి గేట్లను అమర్చింది ఈ మధ్య కాలంలోనే. సన్నత్తి వద్ద నిర్మించిన బ్యారేజీలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనిని 2005 లో ప్రారంభిం చి, 2011లో పూర్తిచేశారు. దీని పొడవు 665 మీటర్లు. యాద్గిర్ వద్ద నిర్మించిన బ్యారేజీలో అదనంగా 1.01 టీఎంసీ నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనిని 2003 లో ప్రారంభించి 2005లో పూర్తిచేశారు. ఈ బ్యారేజీ పొడవు 425 మీటర్లు. యాద్గిర్, శాపూర్ పట్టణాలకు తాగునీటి సౌకర్యం కూడా ఈ బ్యారేజీ నుంచి కల్పిస్తున్నారు. కృష్ణానదిపై నారాయణపూర్ ప్రాజెక్టు దిగువన తింతిని వద్ద నిర్మించిన బ్యారేజీలో ఒక టీఎంసీకి పైగా నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంది. దీని దిగువన గూగల్ వద్ద నిర్మించిన బ్యారేజీలో రెండు టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. గూగల్ బ్యారేజీ దిగువన గిరిజాపూర్వద్ద ప్రస్తుతం నూతనంగా మరో బ్యారేజీని కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనిలో కూడా రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విధంగా కర్ణాటక భీమా నదిపై గుల్బర్గా జిల్లాలోనే 13 బ్యారేజీలు, యాద్గిర్ జిల్లాలో నాలుగు బ్యారేజీలు నిర్మించింది.