కర్ణాటక జల చౌర్యానికి అంతేది? | Karnataka water antedi compromised? | Sakshi
Sakshi News home page

కర్ణాటక జల చౌర్యానికి అంతేది?

Published Wed, Aug 19 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

కర్ణాటక జల చౌర్యానికి అంతేది?

కర్ణాటక జల చౌర్యానికి అంతేది?

కృష్ణా, భీమా నదులపై అక్రమ బ్యారేజీల నిర్మాణం
గుల్బర్గా జిల్లాలోనే 13కు పైగా బ్యారేజీల ఏర్పాటు
శరవేగంగా కొనసాగుతున్న గిరిజాపూర్ బ్యారేజీ పనులు

 
మాగనూర్: వర్షాలు కురవకపోయినా ఎప్పుడూ నదితీర ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటిని అందించే కృష్ణా, భీమా జీవనదులు జీవచ్ఛవంలా మారాయి. చుక్కనీళ్లు లేక రాళ్లు తేలాయి. ఈ ప్రాజెక్టులకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్ట ప్రభుత్వాలు పది కిలోమీటర్లకు ఒక బ్యారేజీ చొప్పున అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ప్రభుత్వం రాయిచూర్ జిల్లాలోని గిరిజాపూర్ గ్రామం వద్ద కృష్ణానదిపై మరో అక్రమ బ్యారేజీ నిర్మాణం ప్రారంభించింది. దీనికి గత నెల 28న అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటూ రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ బ్యారేజీ పొడవు 1170 మీటర్లు (1.35 కిలోమీటర్లు). దీనికి 194 గేట్లు బిగించనున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన రఘు ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది.

ఈ బ్యారేజీ నిర్మాణాన్ని యుద్ధప్రతిపాదికన చేపట్టి 24 నెలల్లోనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శక్తినగర్‌లోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు నీటిని అందించేందుకే ఈ బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. ఇందులో అధికారికంగా ఒక టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ ఉంచుతామని అక్కడి అధికారులు చెబుతున్నా, అదనంగా మరో టీఎంసీ నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉంది. అదనంగా నిల్వ చేసే నీటిని లిఫ్ట్‌లతో  రైతుల పొలాలకు నీరందించే ప్రయత్నంలో ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లనుంది. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో ఈ బ్యారేజీల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఆ తరువాత నవంబర్, డిసెంబర్ నెలలో వరద తగ్గుతుంది. ఆ సమయంలో పైన ఉన్న ఈ బ్యారేజీలకు గేట్లు మూసేసి వచ్చే నీటిని నిల్వచేసుకుంటారు. దీంతో దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు నీరురాక ఇబ్బందులు ఏర్పడనున్నాయి.

మూడు జిల్లాలకు నష్టం
కర్ణాటక నిర్మిస్తున్న గిరిజాపూర్ ప్రాజెక్టువల్లా దిగువన ఉన్న 17 ఎత్తిపోతల పథకాలకు నీరందకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా తాగునీటికోసం కృష్ణానదిపై ఆధారపడిన మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు రానున్నాయి.
 
నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నామంటున్న కర్ణాటక

నదులపై బ్యారేజీల నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక అధికారులు వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూమి ముంపునకు గురైతేనే కేంద జలవనరుల శాఖ అనుమతులు అవసరమని.. ఇప్పుడు కర్ణాటక నిర్మించిన ఏ ప్రాజెక్టులోనూ భూమి ముంపునకు గురికానందున అనుమతి అవసరం లేదని వాదిస్తోంది. ప్రస్తుతం వారు నదిలో మాత్రమే నీటిని నిల్వ చేసుకుంటున్నారు. వీటికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడంతో పాటూ రెతులు సొంతంగా మోటర్లు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని వాడుకుంటున్నారు. కానీ ఎక్కడా భూములు, గ్రామాలు ముంపునకు గురికాలేదు. తాము కేవలం నదిలోనే నీటిని నిల్వ ఉంచుకొని నీటిని వాడుకుంటున్నాం కాబట్టి వీటికి అనుమతులు అవసరం లేదని వాదిస్తున్నారు.
 
పదేళ్ల నుంచి బ్యారేజీల నిర్మాణం
కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం పదేళ్ల క్రితం నుంచే బ్యారేజీల నిర్మాణాలు ప్రారంభించింది. భీమా నదిపై ఇటీవల నిర్మించిన గూడూర్, సన్నత్తిగి, యాద్‌గిర్ బ్యారేజీలు, కృష్ణానదిపై గూగల్, తింతిని వద్ద నిర్మించిన బ్రిడ్జికి గేట్లను అమర్చింది ఈ మధ్య కాలంలోనే. సన్నత్తి వద్ద నిర్మించిన బ్యారేజీలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనిని 2005 లో ప్రారంభిం చి, 2011లో పూర్తిచేశారు. దీని పొడవు 665 మీటర్లు. యాద్గిర్ వద్ద నిర్మించిన బ్యారేజీలో అదనంగా 1.01 టీఎంసీ నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనిని 2003 లో ప్రారంభించి 2005లో పూర్తిచేశారు. ఈ బ్యారేజీ పొడవు 425 మీటర్లు. యాద్గిర్, శాపూర్ పట్టణాలకు తాగునీటి సౌకర్యం కూడా ఈ బ్యారేజీ నుంచి కల్పిస్తున్నారు. కృష్ణానదిపై నారాయణపూర్ ప్రాజెక్టు దిగువన తింతిని వద్ద నిర్మించిన బ్యారేజీలో ఒక టీఎంసీకి పైగా నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంది. దీని దిగువన గూగల్ వద్ద నిర్మించిన బ్యారేజీలో రెండు టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. గూగల్ బ్యారేజీ దిగువన గిరిజాపూర్‌వద్ద  ప్రస్తుతం నూతనంగా మరో బ్యారేజీని కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనిలో కూడా రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విధంగా కర్ణాటక  భీమా నదిపై గుల్బర్గా జిల్లాలోనే 13 బ్యారేజీలు, యాద్గిర్ జిల్లాలో నాలుగు బ్యారేజీలు నిర్మించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement