గిరిజాపూర్ వద్ద గిల్లికజ్జాలు
కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన టీఆర్‌ఎస్ నేతలు
సరిహద్దుల్లో మంత్రి, ఎంపీలను అడ్డుకున్న కర్ణాటక పోలీసులు
మీడియాకు అనుమతి నిరాకరణ
మహబూబ్‌నగర్: కర్ణాటకలోని గిరిజాపూర్ వద్ద కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని పరిశీలించేందుకు మంగళవారం టీఆర్‌ఎస్ నేతలు అక్కడకు వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీని పరి శీలించడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలను కర్ణాటక సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. గిరిజాపూర్, శక్తినగర్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ప్రజలను, పార్టీ నేతలను అనుమతించే అవకాశం లేదని అడ్డుకున్నారు. దీంతో దాదాపు గంటసేపు ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్ స్తంభిం చింది. కర్ణాటక లోని రాయిచూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పాపయ్య, డీఎస్పీలతో వాదోపవాదాలు జరి గిన అనంతరం మంత్రితో పాటు ఐదుగురిని అనుమతించడానికి పోలీసులు అంగీకరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వెళ్లిన మీడియాను పోలీసులు అనుమతించలేదు. కర్ణాటక నుం చి వచ్చిన మీడియాను మాత్రం గిరిజాపూర్ వరకు అనుమతిం చారు. దీంతో జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డి వెళ్లి బ్యారేజీని పరిశీలించారు. వీటికి ఉన్న అనుమతుల గురించి, ఎంత నీటిని నిల్వ చేస్తున్నారన్న అంశాన్ని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణావాటర్ బోర్డు నుంచి రెండు టీఎంసీలను నిల్వ చేసుకోవడానికి అనుమతి ఉందని అధికారు లు వివరించారు. బ్యారేజీ నిర్మాణం రాయిచూర్ థర్మల్ పవర్‌స్టేషన్ నీటి వినియోగానికి మాత్రమే ఉపయోగిస్తామని.. ఇందులో ఎటువంటి ఆయకట్టు లేదని అక్కడి అధికారులు వివరించారు.
‘దమ్ముంటే ఆ బ్యారేజీని ఆపాలి’
మాగనూర్: టీటీడీపీ నాయకులకు దమ్ముంటే గిరాజాపూర్ బ్యారేజీని ఆపేందుకు కేంద్రానికి చంద్రబాబుతో చెప్పించాలని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజాపూర్ బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన వెళ్లారు. విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం కాబట్టి కేంద్రానికి చెప్పి నిలిపివేయించాలన్నారు.