అక్రమ ప్రాజెక్టుల పాపం బాబుదే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో చేసిన నిర్వాకాల వల్లే కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీలను నిర్మించుకునే స్థాయికి బరి తెగించిందని తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం రాయచూర్ జిల్లా గిరిజాపూర్‌లో నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మహబూబ్‌నగర్ నుంచి భారీ వాహన శ్రేణితో కర్ణాటక సరిహద్దుకు చేరుకున్న పొంగులేటి.. కర్ణాటక ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సరిహద్దు బ్రిడ్జిపై పాదయాత్ర నిర్వహించారు.
కార్యకర్తలతో కలసి గిరిజాపూర్ ప్రాంతానికి వెళ్లేందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నించారు. ఒక దశలో కర్ణాటక పోలీసులను ప్రతిఘటించారు. ఈ సందర్భంగా ‘శీనన్న సంఘర్ష్ కరో.. హమ్ తుమ్హారా సాత్‌హై..’ అంటూ నినాదాలిస్తూ పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పొంగులేటికి అండగా నిలిచారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఆయన కార్యకర్తలతో కలసి కాలినడకన కర్ణాటకలోకి ప్రవేశించారు. గిరిజాపూర్ వద్ద 144 సెక్షన్ ఉన్నందున అనుమతించలేమని కర్ణాటక పోలీసులు చెప్పడంతో తాము వెళ్లి తీరాల్సిందేనని పొంగులేటి వారికి స్పష్టంచేశారు.
దీంతో చేసేది లేక మీడియాతో పాటు ఎనిమిది మందిని బ్యారేజీ సందర్శనకు అనుమతించారు. బ్యారేజీ పనులు క్షుణ్ణంగా పరిశీలించిన పొంగులేటి అక్కడి అధికారులతో నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కర్టాటక తీరుతో తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టుల నిలిపివేత కోసం తమతో కలసి వచ్చే అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమం ఏర్పాటు
చేస్తామన్నారు.
ఉమాభారతికి ఫిర్యాదు చేస్తాం
కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై పల్లెత్తు మాట అనలేదని.. అదే అలుసుతో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తును 518 అడుగుల నుంచి 526 అడుగులకు ఎత్తు పెంచుకున్నా ఏమాత్రం స్పందించకపోగా.. సహకరించినట్లుగా వ్యవహరించార ని దుయ్యబట్టారు.
కర్ణాటక ప్రభుత్వ అక్రమ కట్టడ నిర్మాణాలపై త్వరలో కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరే ముందు మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పొంగులేటికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భగవంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, నాయకులు జెట్టి రాజశేఖర్, మహ్మద్ వాజీద్, మతిన్ ముజాహిత్ అలీ, జయరాజ్, జెఎస్.మేరీ, వంగ లక్ష్మణ్, లింగారెడ్డి, రవిందర్‌రెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, హైదర్ అలీ, విష్ణువర్ధన్‌రెడ్డి, జయంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.