శస్త్ర చికిత్స చేసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
కడుపులో పేగు కుళ్లిపోయి.. తీవ్ర నొప్పితో బాధపడుతూ మదనపల్లె ఏరియా ఆస్పత్రికి వచ్చిన బాలికకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లే స్థోమత లేదని, ఇక్కడే శస్త్రచికిత్స చేయాలని బాలిక తల్లిదండ్రులు వేడుకున్నారు. హైరిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను తాము చేయలేమని చేతులెత్తేశారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా మదపల్లె ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు.
విజయవంతంగా ఆపరేషన్ చేసి బాలికప్రాణాలు కాపాడారు. మదనపల్లెకు చెందిన 13 ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడం తో సోమవారం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. జనరల్ సర్జన్ ఫహీమ్‌నవాజ్, సహాయక సర్జన్ రామకృష్ణారెడ్డి ఆపరేషన్‌కు ఉపక్రమించారు.
థియేటర్‌లోనికి వెళ్లిన తర్వాత బాలిక పరిస్థితిని గమనించి ఎక్కువ రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అని తిరిగి వెనక్కి వచ్చేశారు. విషయాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రవికుమార్ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డికి ఫోన్‌చేసి కేసు పరిస్థితిని వివరించారు. జనరల్ సర్జన్ అయిన తిప్పారెడ్డి స్థానికంగానే వైద్య సేవలందించేవారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని జనరల్ సర్జన్ల సమక్షం లో బాలికకు ఆపరేషన్ చేసి కుళ్లిపోయిన పేగును తీసేశారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎమ్మెల్యే గా రాజకీయ కోణంలోనే కాకుండా వైద్యుడిగా కూడా తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తిప్పారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.