ప్రియుడి ఆత్మహత్య - రైలు ఎదుట దూకేసిన ప్రియురాలు
తన ప్రియుడు హౌరా బ్రిడ్జి మీద నుంచి దూకేసినట్లు తెలియడంతో ఆ ప్రియురాలి హృదయం గాయపడింది. అతడులేని జీవితం తనకెందుకని అనుకుంది. అంతే.. మెట్రో రైల్వే స్టేషన్కు చేరుకుని, వేగంగా వస్తున్న రైలు ఎదుటకు దూకేసి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని కాళీఘాట్ మెట్రో రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది.
రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కాళీఘాట్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రియుడు బికాష్ సాహుకు, ఆమెకు ఫోన్లో గొడవ కావడంతో అతడు హౌరా బ్రిడ్జి మీద నుంచి హుగ్లీ నదిలోకి దూకేశాడు. ఆ విషయం తెలియడంతో ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాలీగంజ్లో నివసించే ఆమె.. కాలేజిలో చదువుతోంది.