Girmajipet
-
యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ
దంపతులిద్దరూ పని కోసం నగరానికి వలసొచ్చారు. ఆభరణాల తయారీతో జీవితం మారుతుందనుకున్నారు. ఎన్నో ఆశలతో బతుకు ప్రయాణం మొదలెట్టారు. చేతినిండా పని దొరకలేదు.. జేబులో గవ్వ నిలవలేదు! చుట్టూ ఆర్థిక చీకట్లు అలుముకున్నాయి. చావొక్కటే మార్గంలా కనిపించింది.. ఆభరణాలకు మెరుగుపట్టే సైనేడ్ తీపి పాయసమైంది భార్యాభర్తలిద్దరూ గుండెనిండా దుఃఖంతో మింగారు. ఈలోకం విడిచి వెళ్లారు. పిల్లలు, వృద్ధులను ఒంటరి వాళ్లను చేశారు. ఇప్పుడు వీరికి దిక్కెవరు? సాక్షి, వరంగల్: బంగారం వ్యాపారానికి వరంగల్ నగరం అడ్డా. ఇక్కడ ఎంతోమంది స్వర్ణకారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. విశ్వకర్మ వీధిలో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే తన జీవితాన్ని బంగారుమయం చేసుకుందామని జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీశ్ అలియాస్ నవధన్ (33) భార్య స్రవంతి(28)తో కలిసి నగరానికి వచ్చాడు. పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు విరాట్, విహార్. కరోనా.. ఆతరువాత అంతో ఇంతో కోలుకున్నా.. రానురానూ పని దొరకడం కష్టమైంది. కుటుంబ పోషణ భారమై.. ఇటీవల కొద్ది రోజుల నుంచి పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు ఉండడం లేదు. ఇంట్లో వృద్ధాప్యంలో కాలు విరిగిన నాన్న, అమ్మ. భార్యా, ఇద్దరు పిల్లలు.. కుటుంబ పోషణ కష్టమైంది. తెలిసిన వారి దగ్గర, ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పు తెచ్చి బతుకు బండిని నెట్టుకొచ్చాడు. అప్పులిచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని అడగడం మొదలెట్టారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దైన్యం. దంపతులకు రూ. 10లక్ష నుంచి రూ.20లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది. అప్పులు తీర్చేదారి కని పించక సతీశ్ మానసికంగా కుంగిపోయాడు. రో జూ భార్యతో చెబుతూ బాధపడేవాడు. నాలుగు రోజులక్రితం తన తండ్రి మోహన్‌తో తన గోస చెప్పి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేయగా, ఏమీ కాదు.. అన్ని సర్దుకుంటాయని మనోధైర్యం కల్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది. చదవండి: Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. ప్రాణాలతో బయటపడిన విరాట్, సైనేడ్‌ను నీళ్లతో కలుపుకొని తాగిన బాటిళ్లు నాన్నా.. ఇది దేవుడి తీర్థం రా.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న సతీశ్, స్రవంతిలు.. గురువారం రాత్రి చిన్న కుమారుడు నానమ్మ, తాతయ్య దగ్గర ఆడుకుంటుండగా పెద్దకుమారుడు విరాట్‌ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్‌ను వాటర్‌బాటిళ్లలో కలుపుకుని భార్యాభర్తలిద్దరూ తాగారు. పెద్దకుమారుడికి ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ నోట్లో పోశారు. వెంటనే బాలుడు బయటికి ఉమ్మి వేశాడు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడగా, దంపతులిద్దరూ చనిపోయారు. కొడుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు.. చేతికొచ్చిన కొడుకు తమను సాకుతాడని భావించిన తండ్రి ఆకొడుకు కన్న పిల్లల బాధ్యత చూడాల్సి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘కొడుకా.. ఇంత పనిచేస్తావనుకోలేదు’అంటూ ఆ వృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వర్ణకారులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దేవుడా.. ఇదేమి అన్యాయం.. గుండెకోత మిగిల్చావ్
వరంగల్ చౌరస్తా: వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పిల్లలు కూడా కష్టపడి చదివారు. పెద్దకూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగి, కాగా, చిన్నకూతురును ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపాడు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు.. మధ్యలోనే ఆరిపోయాయి. అమెరికాలో స్నేహితులతో కలిసి వ్యాన్‌లో వెళ్తున్న ఆమె.. పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇక్కడ మరో విషాద ఏమిటంటే.. కూతురు చనిపోయిన విషయం తల్లికి తెలియజేయలేని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేష్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్ స్కూల్ టీచర్. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు పావని (22)ని అమెరికా పంపించాలనుకున్నారు. అందుకోసం రూపాయి.. రూపాయి కూడబెట్టారు. గత ఏడాది బీటెక్ పూర్తికాగా, ఎంఎస్ కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లింది. స్నేహితులతో వెళ్తుండగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో కనెక్టికట్ రాష్ట్రంలో 8 మంది స్నేహితులు మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా, అందులో పావని ఒకరు. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. మరికొంతమంది గాయపడ్డారు. గుండెలవిసేలా.. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రమేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తల్లికి అనారోగ్యం కారణంగా విషయం చెప్పకుండా దాస్తున్నట్లు తెలిసింది. బంధువులు, ఇతరులు కూడా విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆదివారం పావని మృతదేహం నగరానికి చేరుతుందని సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (క్లిక్ చేయండి: ఉన్నత చదువుకు అమెరికా వెళ్లి.. మృత్యుఒడికి..) దేవుడు అన్యాయం చేసిండు ‘ఇద్దరు కూతుళ్లు అని ఎప్పుడూ బాధ పడలేదు. ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం నేను, నా భార్య అహర్నిశలు కష్టపడ్డాం. మా కలలకు తగ్గట్టుగా పెద్ద పాప ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న పాపను అమెరికాను పంపాలనుకున్నాం. రెండు నెలల కిందట పంపించాం. మొన్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వీడియో కాల్లో మాతో మాట్లాడింది. అంతా బాగానే ఉందని ఓదార్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. చనిపోయినట్లు అమెరికా నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడా.. ఇదేమి అన్యాయం’ - దగ్గర బంధువుల వద్ద పావని తండ్రి ఆవేదన -
మహిళ అదృశ్యం
కాశిబుగ్గ : వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఓ వివాహిత మూడురోజుల క్రితం అదృశ్యమైనట్లు ఇంతేజార్గంజ్ సీఐ భీంశర్మ తెలిపారు. గిర్మాజీపేటలో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జానకి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త ప్రసాద్ బుధవారం ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ ఆచూకీ తెలిసినవారు 94910 89131 ఫోన్ నంబర్లో సమాచారం అందించాలని సీఐ సూచించారు. -
గొంతు కోసి బంగారు నగల అపహరణ
వరంగల్ అర్బన్: బంగారు నగల కోసం ఇంట్లో ఉన్న ఓ గృహిణిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలో బుధవారం ఈ ఘటన జరిగింది. మాసూంఅలీ పాఠశాల వీధిలో ఇమ్మడి శ్యాంసుందర్-జ్ఞానేశ్వరీ (56) దంపతులు నివసిస్తున్నారు. శ్యాంసుందర్ ఉదయం 8 గంటలకు పల్లీ గింజల మిల్లు దగ్గరకు వెళ్లిపోయాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వీరింట్లో పనిచేసే వాణి వచ్చి తలుపు తట్టగా... యాజమానురాలు జ్ఞానేశ్వరి తలుపు తీయలేదు. కిటీకీలోంచి చూడగా జ్ఞానేశ్వరి రక్తపు మడుగులో పడి ఉంది. విషయూన్ని గ్రౌండ్ ఫ్లోర్లో కిరాయిదారులకు చెప్పగా, వారు యాజమాని శ్యాంసుందర్‌కు ఫోన్ చేసి చెప్పారు. హూటాహుటిన శ్యాంసుందర్ ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే జ్ఞానేశ్వరి మతి చెందింది. పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగుడు జ్ఞానేశ్వరి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రతిఘటించినట్టు సంఘటనా స్థలాన్నిబట్టి అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.