గర్భిణీలను కాపాడే ‘గాజులు’
న్యూఢిల్లీ: గర్భవతులైన స్త్రీలను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండి కంటికి రెప్పలా కాపాడుకునే సాంకేతిక గాజులు వస్తున్నాయి. ఇవి కూడా సాధారణ గాజుల్లాగా రంగు రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ ఎక్స్పోజర్ లిమిటర్ (కోయల్), అంటే వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్‌ను గుర్తించి దాన్ని తగ్గించేందుకు సహకరిస్తుందికనుక వీటిని కోయల్ గాజులని వ్యవహరిస్తున్నారు.
అత్యాధునిక ప్లాస్టిక్‌తోని తయారు చేసిన ఈ గాజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకు నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని గుర్తించే అత్యాధునిక సెన్సర్లు ఉంటాయి. వీటిని ధరించిన గర్భిణీ స్త్రీలను తగిన విధంగా అవి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటాయి. మోతాదుకు మించిన కార్బన్ మోనాక్సైడ్ గుర్తించిన వెంటనే ఈ గాజులు ఎర్ర రంగులో వెలుగుతూ బీప్ శబ్ధాన్ని విడుదల చేస్తాయి. ఆ తర్వాత బయటకు పొమ్మని, సురక్షిత ప్రాంతానికి వెళ్లుమంటూ స్థానిక భాషలో హెచ్చరికలు జారీ చేస్తాయి.
అంతేకాకుండా రెండు నెలల గర్భం అప్పటి నుంచి ఎప్పుడూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ వారంలో ఏ ఆహారం తీసుకోవాలో, ఏ నెలలో డాక్టర్ వద్దకు వెళ్లాలో, ప్రసవం కోసం ఎప్పుడూ ఆస్పత్రులో చేరాలో కూడా మాటల రూపంలో ఈ గాజులు సందేశాలు ఇస్తుంటాయి. గ్రామీన్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ (జీఐఎస్బీ) కంపెనీ బంగ్లాదేశ్ స్థానిక భాషను ఉపయోగించి ఈ గాజులను తయారు చేసింది.
కార్బన్ మోనాక్సైడ్‌కు దూరంగా ఉండడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల ఏటా 830 మంది, సంవత్సరానికి దాదాపు మూడు లక్షల మంది గర్భిణీ స్త్రీలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఇంటెల్ కార్పొరేషన్, గ్రామీన్ ట్రస్ట్‌లో కలసి ఈ సాంకేతిక గాజులను అభివృద్ధి చేసింది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తోపాటు భారత్‌లో కూడా ఐదువేల మంది గర్భిణీ స్త్రీలకు ఈ గాజులను పంపిణీచేసి ప్రయోగాత్మకంగా పనితీరును పరిశీలించామని కంపెనీ వర్గాలు తెలిపాయి. పనితీరు బాగున్నట్లు ఫలితాలు వచ్చాయని, మరో రెండు నెలల్లో ఈ రెండు దేశాల్లో వీటి విక్రయాలు చేపడతామని, ఆ తర్వాత వివిధ దేశాల భాషల్లోకి హెచ్చరికలు, సందేశాలను తర్జుమా చేశాక ఆయా దేశాల్లో విక్రయిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఈ గాజుల విలువ సుమారు 800 రూపాయలు ఉంటుందని కంపెనీ వర్గాలు చెప్పాయి.