స్వచ్ఛందంగా ఇచ్చేస్తున్నారు!
పాలకుల ఆరంభ శూరత్వం ప్రభుత్వ పథకాల పాలిట శాపంగా మారుతోంది. పథకాల ప్రారంభానికే పరిమితమవుతున్న విధాన నిర్ణేతల అలక్ష్యంతో అంతిమ లక్ష్యం కొడిగడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 'గివ్ ఇట్ ఆప్' కాల్ ఇచ్చారు. వంటగ్యాస్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేసే స్తోమత ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే రాయితీని స్వచ్ఛందంగావదులుకోవాలని ఎల్పీజీ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. పిలుపు వరకు బాగానే ఉంది కానీ అమలు తీరే ఉస్సూరనిపిస్తోంది. ప్రధాని సందేశాన్ని వినియోగదారులకు చేరవేయడంలో సహజవాయు-పెట్రోలియం మంత్రిత్వ శాఖ చతికిలపడింది. అయినప్పటికీ విజ్ఞులైన స్థితిమంతులు తమకు తాముగా ముందుకు వచ్చి రాయితీ వదులుకుంటున్నారు.
ఈ విషయంలో తెలుగు ప్రజలు కాస్త ముందున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5,628 మంది స్వయంగా సబ్సిడీ రద్దు చేసుకున్నారు. ఏపీలో 2,477 మంది, తెలంగాణలో 3,151 స్వచ్ఛందంగా సబ్సిడీ వద్దనుకున్నారు. ఏపీలో 86 లక్షల మంది, తెలంగాణలో 70 లక్షల మంది ఎల్పిజీ వాడుతున్నారు. సబ్సిడీ వదులుకున్న వారిలో ఎక్కువ మంది వేతనజీవులు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది రాయితీ రద్దు చేసుకున్నారు. ప్రధాని పిలుపునిచ్చిన వారానికే 2 లక్షల మంది స్వచ్ఛందగా సబ్సిడీ వద్దనుకున్నారు. ఈ విషయంలో నేతాశ్రీలు చివరి నుంచి మొదటి స్థానంలో ఉన్నారని చెప్పక తప్పదు. ప్రధాని పిలుపు స్పందించి రాయితీ రద్దు చేసుకున్న నేతలను వేళ్లపై లెక్కెట్టొచ్చు. 'గివ్ ఇట్ ఆప్' పాలకుల చిత్తశుద్ధిని సాక్షీభూతంగా సాక్షాత్కరింపజేసింది.
నాయకులు తమకు తాముగా ముందుకు వచ్చి గ్యాస్ రాయితీ వదులుకుంటే ఆ సందేశం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేది. విధాన నిర్ణేతలను ఆచరించి చూపితే ఆ మార్గంలో నడిచేందుకు జనం సదా సిద్దంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొమ్ములు దండిగా ఉన్న శ్రీమంతులు నుంచి ఆశించిన స్పందన రాకపోవడం విస్తుగొలిపే అంశం. ఈ విషయంలో కుబేరుల కంటే వేతనజీవులే నయమనిపిస్తున్నారు. అధికారులు తమకు పనిగట్టుకుని చెప్పకపోయినా తమంత తాముగా రాయితీ రద్దు చేసుకుంటున్నారు. తమ బాధ్యతగా భావించి స్వయంచలితంగా స్పందిస్తున్నారు. పాలకులు, అధికారులు ఇప్పటికైనా మేలుకుని 'గివ్ ఇట్ ఆప్'పై పెద్దఎత్తున ప్రచారం చేస్తే స్పందన పెరిగే ఛాన్స్ ఉంది. నాయకులు కూడా స్వచ్ఛందంగా రాయితీ వదులుకుని ఆదర్శంగా నిలవాలి.
-పి.ఎన్.శ్రీనివాసరావు
(సాక్షి వెబ్ ప్రత్యేకం)