G.Konduru
-
జి.కొండూరు పీఎస్‌లో దేవినేని ఉమాపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై జి.కొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని దాసరి సురేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషిస్తూ కర్రలు, రాడ్లు, రాళ్లతో తనను గాయపరచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవినేని ఉమా, ఆయన అనుచరులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని సురేశ్ తెలిపారు. ఈ క్రమంలో దేవినేని ఉమాపై 188, 147, 148, 341, 323, 324, 120బి, 109, 307, 427,.. 506, 353, 332 రెడ్‌విత్ 149 ఐపీసీ, 3ఈడీఏ, 3(1)R, 3(1)S,.. 3(2)V, ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దేవినేని ఉమాతో పాటు మొత్తం 18 మందిపై కేసు పెట్టారు. కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన విషయం విదితమే. అదే విధంగా దళిత కార్యకర్త సురేశ్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దేవినేని ఉమా పోలీసులను ఇబ్బంది పెట్టారు: డీఎస్పీ
సాక్షి, కృష్ణా జిల్లా/జి. కొండూరు: టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టు నేపథ్యంలో డీఎస్పీ కీలక వివరాలు వెల్లడించారు. ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సుమారు 4 గంటల పాటు దేవినేని అడిగామని.. అయినా కారులో నుంచి దిగకుండా ఆయన పోలీసులను ఇబ్బంది పెట్టారన్నారు. ‘‘ఫిర్యాదు ఇవ్వకపోగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవరించారు. తన వర్గాన్ని రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రోత్సహించారు. పోలీస్ స్టేషన్‌కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు రావచ్చు. ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేశాం. ఓ వర్గానికి చెందిన 18 మందిపై, మరో వర్గానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తాం’’ అని డీఎస్పీ తెలిపారు. కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు కూడా రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పిడుగుపాటుతో వ్యక్తి మృతి
జి.కొండూరు (కృష్ణా) : పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ ఒకరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన అమరపూడి దావీదు(35) మండలంలోని ముత్యాలంపాడు(హెచ్)లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కాగా ఆయన సోమవారం గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలంలో వరి నాటు వేశాడు. ఇంటికి తిరిగి వచ్చేందుకు బయలుదేరుతుండగా చిన్నగా వర్షం మొదలైంది. అంతలోనే హఠాత్తుగా ఆయనపై పిడుగు పడింది. దీంతో దావీదు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. -
విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ మృతి
జి.కొండూరు, న్యూస్‌లైన్ : జి.కొండూరులో విద్యుత్‌షాక్‌కు గురై లైన్‌మన్ దుర్మరణం చెందారు. గ్రామంలో విద్యుత్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న సరిపల్లి రాధాకృష్ణ(34) మంగళవారం స్తంభం ఎక్కి వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. స్తంభం మీదనుంచి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం.. గ్రామంలోని మంచినీటి సంపు సమీపాన గల ఓ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో మరమ్మతులు చేయడానికి వచ్చిన రాధాకృష్ణ స్తంభానికి నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి నిచ్చెన చివర నిల్చుని స్తంభం చివరన ఉన్న వైర్లు సరిచేస్తున్నారు. హఠాత్తుగా విద్యుత్ షాక్‌కు గురై నిచ్చెనపై నుంచి ఒక్క సారిగా కింద ఉన్న కంకరగుట్ట పై తలకిందులుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది రాధాకృష్ణ మృతి చెందినట్టు నిర్ధారించారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. ఏడిఏ మురళీకృష్ణ, ఏఈ కృష్ణారావు, సాంబశివరావు ప్రమాధం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీటి సరఫరా ఆగకూడదని విద్యుత్ సరఫరా ఆపలేదు.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద సరఫరా ఆపకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మంచినీటి సరఫరా అయ్యేందుకు ఉపయోగించే సంపు మోటార్లు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో రాధాకృష్ణ ట్రాన్స్ఫార్మర్ ఆపలేదు. స్తంభంపై నుంచి రాళ్ల గుట్టపై పడటంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్త స్రావం జరిగిందని తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు రాధాకృష్ణకు భార్య, ఆరేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న బాబు ఉన్నారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పెరవల సమీపంలోని ముక్కామల గ్రామం కాగా వృత్తి రీత్యా స్థానిక సబ్ స్టేషన్లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలం కంచికచర్లలో జేఎన్ఎంగా కూడా పనిచేశారు. రాధాకృష్ణను పెద్ద ఎత్తున గ్రామస్తులు, తోటి సిబ్బంది తరలివచ్చారు. భౌతికకాయం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రాధాకృష్ణ కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందరితో కలివిడిగా ఉండే రాధాకృష్ణ మరణవార్తను గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.