విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ మృతి
Published Wed, Oct 2 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
జి.కొండూరు, న్యూస్‌లైన్ : జి.కొండూరులో విద్యుత్‌షాక్‌కు గురై లైన్‌మన్ దుర్మరణం చెందారు. గ్రామంలో విద్యుత్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న సరిపల్లి రాధాకృష్ణ(34) మంగళవారం స్తంభం ఎక్కి వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. స్తంభం మీదనుంచి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం.. గ్రామంలోని మంచినీటి సంపు సమీపాన గల ఓ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో మరమ్మతులు చేయడానికి వచ్చిన రాధాకృష్ణ స్తంభానికి నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి నిచ్చెన చివర నిల్చుని స్తంభం చివరన ఉన్న వైర్లు సరిచేస్తున్నారు. హఠాత్తుగా విద్యుత్ షాక్‌కు గురై నిచ్చెనపై నుంచి ఒక్క సారిగా కింద ఉన్న కంకరగుట్ట పై తలకిందులుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది రాధాకృష్ణ మృతి చెందినట్టు నిర్ధారించారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. ఏడిఏ మురళీకృష్ణ, ఏఈ కృష్ణారావు, సాంబశివరావు ప్రమాధం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నీటి సరఫరా ఆగకూడదని
విద్యుత్ సరఫరా ఆపలేదు..
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద సరఫరా ఆపకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మంచినీటి సరఫరా అయ్యేందుకు ఉపయోగించే సంపు మోటార్లు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో రాధాకృష్ణ ట్రాన్స్‌ఫార్మర్ ఆపలేదు. స్తంభంపై నుంచి రాళ్ల గుట్టపై పడటంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్త స్రావం జరిగిందని తెలిపారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు
రాధాకృష్ణకు భార్య, ఆరేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న బాబు ఉన్నారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పెరవల సమీపంలోని ముక్కామల గ్రామం కాగా వృత్తి రీత్యా స్థానిక సబ్ స్టేషన్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలం కంచికచర్లలో జేఎన్‌ఎంగా కూడా పనిచేశారు. రాధాకృష్ణను పెద్ద ఎత్తున గ్రామస్తులు, తోటి సిబ్బంది తరలివచ్చారు. భౌతికకాయం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రాధాకృష్ణ కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందరితో కలివిడిగా ఉండే రాధాకృష్ణ మరణవార్తను గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.
Advertisement