‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ లో ముకేశ్ అంబానీ
ఫోర్బ్స్ లిస్ట్‌లో జేమ్స్ డైసన్, లారీ ఫింక్, క్రిస్టో వైస్ వంటి ప్రముఖులకు చోటు
న్యూయార్క్: ఫోర్బ్స్ తాజా ‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్.. 25 మంది వ్యాపార దిగ్గజాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో స్థానం పొందిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జీవితాల్లో మార్పుకు కారణంగా నిలిచారని ఫోర్బ్స్ పేర్కొంది.
భారతీయులకు ఇంటర్నెట్ను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకురావడానికి అంబానీ తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఆయనకు జాబితాలో స్థానం కల్పించామని వివరించింది. ‘గ్యాస్, ఆయిల్ రంగ దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్.. టెలికం రంగంలోకి భారీ ఎంట్రీ ఇచ్చింది. చౌక ధరలకే వేగవంతమైన ఇంటర్నెట్ను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలో కస్టమర్ల సంఖ్యను 10 కోట్లకు పెంచుకుంది. మార్కెట్ స్థిరీకరణకు కారణంగా నిలిచింది’ అని ఫోర్బ్స్.. రిలయన్స్ జియోను ఉటంకిస్తూ ఈ వివరణ ఇచ్చింది.
జాబితాలోని ప్రముఖులు
ఫోర్బ్స్ ‘గ్లోబల్ గేమ్ ఛేంజర్స్’ జాబితాలో గృహోపకరణాల కంపెనీ ‘డైసన్’ వ్యవస్థాపకుడు జేమ్స్ డైసన్, అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ‘బ్లాక్‌రాక్’ సహ వ్యవస్థాపకుడు లారీ ఫింక్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, సోషల్ మీడియా కంపెనీ ‘స్నాప్’ సహ వ్యవస్థాపకుడు ఇవాన్ స్పీగెల్, చైనీస్ రైడ్ షేరింగ్ కంపెనీ ‘డిడి చుక్సింగ్’ వ్యవస్థాపకుడు చెంగ్ వెయి, ఆఫ్రికన్ రిటైల్ దిగ్గజం క్రిస్టో వైస్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.