బలిపీఠంపై భావ ప్రకటనా స్వేచ్ఛ
దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో పలుచోట్ల కూడా వివిధ స్థాయిలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పాత్రికేయులు, విలేకరులు, సంపాదకులపైన పాలక వర్గాలు కన్నెర్ర చేస్తూ అధికార గణంతో దాడులు, అరెస్టులు చేయించడం చూస్తున్నాం. వారి ఈ అహంకారానికీ, అసహనానికీ చేదోడు వాదోడవుతున్న మూలం ఏది? ఈ ప్రశ్నకు జర్మనీ రాజధాని బాన్‌లో పాత్రికేయ శిఖరాగ్ర సభను నిర్వహించిన ప్రపంచ సంస్థ గ్లోబల్ మీడియా ఫోరమ్ చర్చల సారాంశంలో దీటైన సమాధానం దొరుకుతుంది.
‘‘దేశాల అభ్యుదయానికి సంబంధించిన సకల అంశాలలో పారదర్శకత ద్వారా అవినీతిని, లంచగొండితనాన్ని అదుపు చేయడానికీ; పౌర సమాజాన్ని నిర్మించడానికి, న్యాయ చట్టాల ద్వారా చట్టబద్ధ పాలనను స్థిరపరచడానికీ మీడియా (పత్రికలు, టీవీ మాధ్యమాలు) అత్యవసరం, అనివార్యం. పాలక వ్యవస్థ ప్రయోజనాలతో నిమిత్తం లేని ప్రచార ప్రసార మాధ్యమాలు ఏ మేరకు స్వేచ్ఛగా ఉండగలవో ఆ మేరకు దేశాల స్వేచ్ఛాస్వాతంత్య్రాల ఉనికి ఆధారపడి ఉంటుంది. ఈ మీడియా స్వేచ్ఛ మనుగడ అనేది దఫదఫాలుగా జరిగే ఎన్నికల కన్నా కూడా దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు సరైన కొలమానంగా భావించాలి.’’ - డేవిడ్ హాఫ్మన్ (ఇంటర్ న్యూస్ మీడియా నిర్మాత, ఎమిరిటస్ ప్రెసిడెంట్, ఎమ్మీ అవార్డు గ్రహీత, సిటిజన్స్ రైజింగ్ గ్రంథకర్త)
‘అబద్ధాల అంకయ్యకు అర వీశెడు సున్నం నోట్లో కొడితేగానీ వాయి ముడవడు’ అన్నది సామెత. మహజర్లూ, విజ్ఞాపనలూ, సంప్రదింపుల ద్వారా దీర్ఘకాలం పాటు ఉద్యమించి; పాలకుల మొండితనం వల్ల సమస్య ఒక కొలిక్కి రానప్పుడు, ఒక సామాజిక వర్గం సమస్యకు అంతిమ పరిష్కా రంగా మచ్చలేని నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరశన తలపెట్టడం ఏమిటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం తలెత్తే ఆందోళనలను, ఉద్యమా లను, ఉద్రేకాలను; ఆఖరికి ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యకలాపాలతో సహా అన్నింటినీ అటు అక్షరబద్ధంగానూ, ఇటు దృశ్య మాధ్యమంతోనూ ఆవి ష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ మీడియా చానల్ ప్రసా రాలను నిషేధించడం ఏమిటి? ఆ రెండింటికీ సంబంధం ఏమిటి?
ప్రాథమిక హక్కు అన్న సంగతి మరచిపోవద్దు
పై ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు పాలకుల నుంచి రాలేదు. కానీ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రం ‘ముద్ర గడ దీక్ష నేపథ్యంలో ఈ ప్రసారాలను మేమే నిలిపివేశాం’ అని స్వయంగా ప్రకటించారు. నిత్యమూ తాము ‘ప్రజాస్వామ్యం’ కోసమే, దాని ‘పరిరక్షణ’ కోసమే పాటుపడుతున్నామని గుండెలు బాదుకునే పాలకులను గతంలోనూ చూశాం. ఇప్పుడూ చూస్తున్నాం. నిజానికి, ప్రజాస్వామ్యమన్నా, అది పని చేసే తీరన్నా, లేదా పార్లమెంటరీ వ్యవస్థలో భిన్నాభిప్రాయానికి చోటు ఉండి తీరాలన్న ప్రాథమిక విలువన్నా - కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఆధునిక పాలకులకు గౌరవం లేదు.
దీనిని నిరూపించేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చివరకు భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణించే రాజ్యాంగ విరుద్ధ సంస్కృతిని కూడా ప్రవేశపెడుతున్నారు. వివిధ స్థాయిలలో రాష్ట్ర, జాతీయ పాత్రికేయ సంస్థలు, పాత్రికేయులు ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం మీద ఇటు గవర్నర్‌కు, అటు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌కు నివేదించాయి. దీని మీద ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ చానల్ ప్రసారాల నిలిపివేత మీద ఎంత విస్మయం ప్రకటించినా; ప్రసారాల పునరు ద్ధరణకు కౌన్సిల్ పరిధిలో చేపట్టగల చర్యలకు గల అవకాశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
అంటే లోగడ చైర్మన్ల మాదిరిగానే మాటమాత్రంగా ఆ సంగతి చెప్పారు. కానీ రాజ్యాంగం గుర్తించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు, వృత్తి వ్యాపార రక్షణ ప్రాథమిక హక్కుగా గుర్తించిన ప్రకటనకు పూచీ పడుతూ, వాటిని అమలు చేయించడంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన పాల కులను శిక్షించే క్రిమినల్ నిబంధనలను అమలు చేయించే అవకాశం కౌన్సి ల్కు మాత్రం లేదు. అందుకే పాలకుల ఆగడాలు అనంతంగా కొనసాగ డానికి అసలు కారణమని పత్రికా రచయితలు మరచిపోరాదు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కౌన్సిల్ కలగచేసుకుని శిక్షించే అధికారాన్ని దఖలు పరుస్తూ ప్రెస్ కౌన్సిల్ చట్టాలను సవరించాలని, పార్లమెంట్ చొరవ చూపాలని ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ కట్జూ పదే పదే విజ్ఞప్తి చేశారు.
కొత్త సవాళ్ల కాలం
దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో పలుచోట్ల కూడా వివిధ స్థాయిలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో పాత్రికేయులు, విలేకరులు, సంపాదకులపైన పాలక వర్గాలు కన్నెర్ర చేస్తూ అధికార గణంతో దాడులు, అరెస్టులు చేయించడం చూస్తున్నాం. వారి ఈ అహంకారానికీ, అసహనానికీ చేదోడు వాదోడవుతున్న మూలం ఏది? ఈ ప్రశ్నకు జర్మనీ రాజధాని బాన్‌లో పాత్రికేయ శిఖరాగ్ర సభ (2016)ను నిర్వహించిన ప్రపంచ సంస్థ గ్లోబల్ మీడియా ఫోరమ్ చర్చల సారాంశంలో దీటైన సమాధానం దొరుకుతుంది. నేడు సమాచార సాంకేతిక వ్యవస్థ, డిజిటల్ విప్లవం శరవేగాన దూసుకు రావడంతో పాత్రికేయ వృత్తికి పాలక వర్గాల నుంచి ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఆ ఫోరమ్ చర్చించింది. ఈ సదస్సులోనే టర్కిష్ దినపత్రిక ‘హురి యత్’ ప్రధాన సంపాదకుడు సీదత్ ఎర్గిన్కు ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పుర స్కారాన్ని కాయే డీక్మాన్ (ప్రసిద్ధ జర్మనీ పత్రిక ‘బిల్’ అధినేత) ప్రదానం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రకటించినందుకు, విమర్శనాత్మక వ్యాస పరంపరను వెలువరించినందుకు సీదత్ను టర్కిష్ పాలకులు నాలుగేళ్ల పాటు ఎలా కారాగార ం పాలు చేశారో ఆ సందర్భంగా డీక్మాన్ గుర్తు చేశారు. మితవాద పాలకవర్గ పార్టీ కార్యకర్తలు గుంపుగా ఎర్గిన్ పత్రికా కార్యాల యంపై దాడులు చేసి, మరొక వ్యాసకర్తను ఏవిధంగా తీవ్రంగా గాయ పరిచిందీ కూడా ఆ సదస్సులో వెల్లడించాడు. యూరప్‌లో మితవాదపక్షాలు అధికారంలో ఉన్న దేశాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛపైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వివరించారు.
ఎర్గిన్ ప్రసంగిస్తూ, ‘ నిరంకుశ ధోరణులకు అలవాటుపడిన పాలకులు ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కడానికి ఓటింగ్ ద్వారా ప్రజా ప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే సౌలభ్యానికి అవకాశం కల్పించిన ఎలక్టోరల్ ప్రజాస్వామ్యం అనే ఓ బిల్లును తెరగా పెట్టుకుంటున్నారని, ఈ ధోరణి ప్రజా స్వామ్య మనుగడకు అత్యంత ప్రమాదకరం’అని ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిం చాడు. అలాగే ఎక్కడికక్కడ పౌర సమాజాలు చైతన్యం పొంది రంగంలోకి దిగి ఉద్యమించడం ద్వారానే భావ స్వేచ్ఛనూ, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛనూ తద్వారా ప్రజాస్వామ్య విలువల్ని రక్షించుకోగల్గుతారని ‘ఇంటర్ న్యూస్’ వ్యవస్థాపకుడు డేవిడ్ హాఫ్మాన్ ‘తిరగబడుతున్న పౌరులు’ అన్న తాజా గ్రంథంలో పేర్కొన్నాడు. అంతేగాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలలో గానీ లేదా తలుపులు మూసివేసుకునే మూస వ్యవస్థలలో గానీ - ప్రజా బాహుళ్యం సత్తా, వారి అధికారం ఏదో ఒక రూపంలో ఒక్క ప్రసార మాధ్య మాల ద్వారా మాత్రమే వ్యక్తమవుతూ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల పుట్టుపూర్వోత్తరాలను తడుముతూ హాఫ్మాన్ మరొక విషయం కూడా వెల్లడించాడు: ‘‘శరవేగాన ఆవిష్కరించుకుంటున్న, పరి వ్యాప్తమవుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞాన వేదికలు, భారీస్థాయిలో ప్రజా స్వామీకరణ పొందుతున్న మీడియా నేడు ఎలాంటి నిరంకుశ పాలనా వ్యవస్థనైనా ‘ఢీ’ కొనగల సవాళ్లను విసరగల్గుతోంది. గత వంద సంవత్సరా లుగా నిరంకుశ అహంకార పాలనా వ్యవస్థలు యుద్ధాల మీద ఆధారపడి ఉనికిని కాపాడుకుంటూ వచ్చాయి. కాగా నూతనంగా దూసుకువచ్చిన సమాచార సాంకేతిక విప్లవం ఈ 21వ శతాబ్దాన్ని తీర్చిదిద్దే సైద్ధాంతిక శక్తి కాబోతున్నది’’. ఎందుకంటే, దాపరికం లేని సమాచార వ్యవస్థ అనేది మానవ స్వేచ్ఛకు పరిపూర్ణతను కల్పించడానికి ఒక కీలక సాధనం అని సామా జిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల సమాచార స్రవంతికి అడ్డుకట్టలు వేయడం ద్వారా మానవ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేయడమే అవు తుందని వారి ఆవేదన. అయితే ఎటుతిరిగీ వచ్చిపడుతున్న చిక్కంతా, దురదృష్టవశాత్తూ ‘‘ఎన్నికల ప్రజాస్వామ్యం’’ అనే ముసుగు కింద అయిదేళ్ల పాలనతో మురిసిపోయి రకరకాల ప్రలోభాల ద్వారా మీడియాలో ఒక వర్గాన్ని (విలేకరులు, సంపాదకుల్ని) తాత్కాలిక పదవుల కోసం ‘సాకుతో’ పాత్రికేయుల మధ్య ఐక్యతను గండికొట్టడానికి పాలకులు అలవాటుపడ్డారు.
పత్రికా రచయితలకు ఎరలు
గతంలో దుబాయ్, కువైట్, మలేసియా, సింగపూర్ విహారయాత్రల ద్వారా కొందరు పాత్రికేయుల్ని తిప్పుకొచ్చింది పాలకవర్గం, వారిని బానిసలుగా మార్చడం కోసం. అలాంటి వారి పేర్లను ఒకవైపున ఆనాటి (1995-2003) ‘బ్లిట్జ్’, ‘టెలిగ్రాఫ్’ పత్రికలు ప్రకటించిన విషయాన్ని మరవరాదు. లేకపోతే కొందరు పాత్రికేయులు సొంత చానళ్లు ప్రారంభించగల కోట్ల ఆర్జన ఎక్కడి నుంచి సంక్రమించిందో చెప్పగలగాలి. ఈ రకమైన వాతావరణంలో పరి ణామాల ప్రభావంవల్ల పాత్రికేయ వృత్తిలో ‘కుక్కమూతి పిందెలు’ తలెత్తడం సహజం. పైగా రాజకీయాలు, ప్రధాన స్రవంతిలో ఉన్న మాస్‌మీడియా పరస్పరం చేతులు కలుపుతున్నచోట్ల పత్రికా రంగంలో విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రష్యన్ మీడియా చరిత్రకారుడు, జర్నలిస్టు ఇవాన్ జసోర్స్కీ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు అమలులోకి వచ్చిన తర్వాత నేటి రష్యాలో మీడియా పరిస్థితిని సమీక్షిస్తూ వెల్లడించాడు. రాజకీయ ఫ్యాక్షన్లు ఎలా రకరకాల నేషనల్ చానల్స్‌గా ఏర్పడి వార్తా స్రవంతి వాస్తవ పరిణామాలను గుర్తించకుండా తప్పించుకు తిరుగాడుతున్నాయో రాశాడు.
ఈ ‘సంస్కరణల’ ప్రభావంలోనే ఆంగ్లో-అమెరికన్, ఆస్ట్రేలియన్ మీడియా గుత్త సంస్థలు ఇండియాలోకి మిడతల దండులా ప్రకాశించడానికి, విదేశీ మీడియా గుత్త కంపెనీలు ప్రత్యక్ష పెట్టుబడులతో భారత పత్రికా రంగాన్ని అల్లకల్లోలం చేయడానికి రూపర్డ్ మర్దోక్, కెర్రీపాకర్లు కాంగ్రెస్, బీజేపీల ఆరెస్సెస్‌ల సాయంతో రెక్కలు కట్టుకుని వాలారని మరచిపోరాదు!
abkprasad2006@yahoo.co.in
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు