న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తి కట్టబెట్టే ఆర్టికల్ 370 రద్దుపై ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిసారించింది. జమ్మూ కశ్మీర్‌లో కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన గ్లోబల్ మీడియా ఆర్టికల్ 370 రద్దుపై స్పందించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత ఉపఖండంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరమని వ్యాఖ్యానించింది. కశ్మీర్‌పై గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని లండన్‌కు చెందిన ది గార్డియన్ అభివర్ణించింది.
కశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించడం నాటకీయ చర్యగా పేర్కొంటూ ఈ నిర్ణయం పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరిగేందుకు దారితీయవచ్చని అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వానికి ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించింది. ఇక జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుందని బీబీసీ వ్యాఖ్యనించింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లోయలో అశాంతి తలెత్తవచ్చని, లోయలో ఇప్పటికే అలజడి వాతావరణం నెలకొందని, ఉద్రిక్తతలు పెరిగిపోయాయని బీబీసీ పేర్కొంది.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దుపై ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు సైకలాజికల్ షాక్ వంటిదని సీఎన్‌ఎన్ అభివర్ణించింది. కేంద్ర నిర్ణయం సరికొత్త ఘర్షణలకు తెరలేపిందని వాషింగ్టన్ పోస్ట్ హెచ్చరించింది. భారత్‌లో కశ్మీర్ చేరికకు మూలమైన ఆర్టికల్ 370 రద్దు జమ్ము కశ్మీర్‌తో భారత్ సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇక పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ ఆర్టికల్ 370 రద్దును తప్పుపట్టింది. హడావిడిగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంలో తొందరపాటును ప్రశ్నించింది. ఈ నిర్ణయంతో జమ్ము కశ్మీర్ ముస్లిం మెజారిటీ ప్రాంతం నుంచి హిందూ మెజారిటీ ప్రాంతంగా మారిపోతుందని కశ్మీరీలు భయపడుతున్నారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment