భారత్ ఓ దిగ్గజం: గ్లోబల్ మీడియా
భారత్ ఓ దిగ్గజం: గ్లోబల్ మీడియా
Published Thu, Feb 16 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
వాషింగ్టన్: అంతరిక్ష సాంకేతికతలో భారత్ ఓ దిగ్గజంగా మారిందని ప్రపంచమీడియా పేర్కొంది. ప్రపంచ దేశాలన్నీ ఒకే ప్రయోగంలో రెండంకెల సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి మల్లగుల్లాలు పడుతుంటే.. భారత్ మాత్రం తక్కువ ఖర్చుతో చరిత్ర సృష్టించిందని ఆకాశానికి ఎత్తేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) బుధవారం ఒకే రాకెట్(పీఎస్‌ఎల్వే సీ-37) ద్వారా 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఎవరెవరు ఏమన్నారంటే..
వాషింగ్టన్ పోస్టు: ఇస్రో తక్కువ ఖర్చుతో జరిపిన తాజా ప్రయోగం ప్రపంచదేశాల్లో మరింత నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యానించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీఎస్ఎల్వీతో ప్రయోగం కోసం ఇస్రోకు విదేశీ ఉపగ్రహాలు క్యూ కడుతున్నాయని చెప్పింది.
న్యూయార్క్ టైమ్స్: ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో చేర్చి ఎదుగుతున్న స్పేస్ టెక్నాలజీ మార్కెట్‌కు భారత్ రారాజు అయిందని పేర్కొంది. శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడుతున్న సమయంలో మిస్ పాత్‌లో విడుదలైతే ఒకదానితో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం ఉందని చెప్పింది.
సీఎన్‌ఎన్: అమెరికా, రష్యాలను ఇక మర్చిపోండి; నిజమైన అంతరిక్ష రేసు ఆసియాలో జరుగుతోందని వాఖ్యానించింది.
లండన్ టైమ్స్: ఇండియా చేసిన ప్రయోగం అంతర్జాతీయ స్పేస్ దిగ్గజాల సరసన ఆ దేశాన్ని నిలబెట్టేలా చేసిందని పేర్కొంది. అమెరికా, రష్యా, యూరప్‌లు ఖర్చు పెట్టిన మొత్తాని కంటే భారత్ అతి తక్కువ ఖర్చుతో ఎన్నో ప్రయోగాలు నిర్వహించిందని కొనియాడింది.
గార్డియన్: 1980ల్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన ఆరో దేశంగా రికార్డుల్లోకెక్కిన భారత్ అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ మార్కెట్ ను ఎదుర్కొనే స్ధాయికి చేరిందని పేర్కొంది. వీనస్ గ్రహం మీదకు కూడా ప్రయోగం చేస్తామని భారత్ ప్రకటించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
బీబీసీ: భారత్ ప్రయోగం అంతర్జాతీయ స్పేస్ మార్కెట్లో కొత్త శక్తి పుట్టుకువస్తోందనడానికి సూచన అని వ్యాఖ్యానించింది.
చైనా ప్రభుత్వ మీడియా: 104 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ కొత్త చరిత్రను సృష్టించిందని వ్యాఖ్యానించింది.
Advertisement