డెంటిస్ట్ నుంచి డైరె క్టర్ వరకూ..!
అంతర్జాతీయ స్థాయి సినిమా అంటే అది కొందరికే సాధ్యమయ్యేది కాదు... హృదయాన్ని తాకే కథ ఏదైనా ప్రపంచ స్థాయి సినిమాకు ముడి సరకు కాగలదు. అందుకే ఎవరైనా ప్రపంచస్థాయి సినిమాను రూపొందించగలరు... అని అంటాడు పరమ్‌గిల్. ఈ సిద్ధాంతాన్ని ఇతరుల కోసమే చెప్పడం లేదు. సొంతంగా నమ్మాడు. ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందించాడు. అవార్డులను అందుకొన్నాడు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఎవరైనా సమ్మతించాల్సిందే!
శాన్ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన గ్లోబల్ మూవీ ఫెస్టివల్లో గిల్ రూపొందించిన రెండు సినిమాలు ప్రదర్శనకు నోచుకొన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన దర్శకుడితను. ఒక బాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్సినిమా.. ఈ రెండు సినిమాలూ గ్లోబల్ మూవీ ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యాయి. గిల్‌కు ప్రశంసలు దక్కేలా చేశాయి. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన ఇతడికి ఉత్తమ దర్శకుడిగా అవార్డుతో పాటు లక్ష డాలర్ల బహుమతిని కూడా దక్కడం విశేషం. వృత్తిరీత్యా గిల్ ఒక డెంటిస్ట్ కావడం మరింత విశేషమైన అంశం.
పంజాబ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగాడు... అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని చదువు అనే అర్హతతోనే అమెరికాకు చేరుకొన్నాడు. 2001లో ఇతడు అమెరికా వెళ్లాడు. అక్కడ మళ్లీ అవస్థలే. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు. అయినప్పటికీ చదువు కొనసాగించాడు. పగలంతా కాలేజ్‌కు వెళ్లి రాత్రిపూట ఒక గ్యాస్‌ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేసేవాడట. ఇలా స్వయం సంపాదనతోనే న్యూజెర్సీలోని ఒక వర్సిటీలో డెంటిస్ట్‌గా మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. ఇన్ని రకాల కష్టాలతో ఎదిగిన పరమ్‌గిల్ కట్ చేస్తే దర్శకుడయ్యాడు.
దాదాపు ఏడెనిమిదేళ్లు డెంటిస్ట్‌గా పనిచేసి.. అనేక వనరులను సమీకరించుకొని ‘రాకిన్ మీరా’ అనే సినిమాను రూపొందించాడు. ఆంగ్లంలో రూపొందించిన ఈ కామెడీ సినిమాను భారత్, అమెరికాల్లో చిత్రీకరించారు. సినిమా పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఎంతో కష్టపడ్డా ఫలితం మాత్రం అపజయమే. 2009 వేసవిలో అమెరికాలో విడుదల అయిన ఈ సినిమా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. దాదాపు పదిహేను లక్షల డాలర్లు వెచ్చించి రూపొందించిన ‘రాకిన్ మీరా’ పదిలక్షల డాలర్లను కూడా వసూలు చేయలేకపోయింది. ఇది వ్యక్తిగతంగా గిల్‌కు భారీ నష్టమే.
మరొకరయితే మళ్లీ సినిమా జోలికి వెళ్లే వారు కాదు. థియేటర్లో సినిమా చూడటానికి కూడా భయపడే వాళ్లేమో. కానీ గిల్ వెనక్కి తగ్గలేదు.భారీ నష్టాన్ని ఎదుర్కొన్నా భయపడలేదు. మరో సినిమాకు స్క్రిప్ట్ రాయడంలో మునిగిపోయాడు. అలా రూపొందించినదే ‘హోటల్ హాలీవుడ్’. ఈ సినిమాకు అమెరికాలో గొప్ప స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ కాసుల పంట పండించింది. సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో పరమ్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది.
అపజయం ఎదురైనప్పుడు పరమ్‌గిల్ నిరాశ పడి ఉంటే, అక్కడే ఆగి ఉంటే దర్శకుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఉండేది కాదు.
విజయం సాధించిన పరమ్‌కు కొంతమంది నిర్మాతలు కలిసివచ్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఒకేసారి ఒక హాలీవుడ్ సినిమాను, మరో బాలీవుడ్ి సనిమాను రూపొందించే అవకాశాన్ని ఇచ్చారు.
హాలీవుడ్ సినిమా పేరు ‘లాస్ట్ సప్పర్’, బాలీవుడ్సినిమా పేరు‘డీఓఏ- డెత్ ఆఫ్ అమర్’ ఈ రెండు సినిమాలూ అనేక ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యాయి. విమర్శల ప్రశంసలను అందుకొన్నాయి. ఈ రెండు సినిమాలూ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి.
ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.
పరమ్ సినిమాలు అన్నీ థ్రిల్లర్లే. అయితే ఆ సినిమాల్లో ఉన్న మలుపుల కన్నా పరమ్ జీవితంలోనే ఎక్కువమలుపులున్నాయి!
డెంటిస్టుగా స్థిరపడాల్సిన పరమ్ సృజనాత్మకతను ఆయుధంగా మలుచుకొని దర్శకుడిగా ఎదిగిన తీరుకు మించిన మలుపు ఏముంటుంది!
సినీ పరిశ్రమలో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు గిల్. ఆ పుస్తకం పేరు ‘హౌ టు లాస్ ఏ మిలియన్ డాలర్స్ అండ్ నాట్ లూజ్ యువర్ స్మైల్’. ఈ పేరును బట్టే అది ఎంతటి పాజిటివ్ ఔట్లుక్ ఉన్న పుస్తకమో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాత్రం పాజిటివ్నెస్ ఉంటే చాలదూ జీవితంలో విజేతగా నిలవడానికి!