జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : కార్మికుల డిమాండ్ల సాధనలో భాగంగా మంగళవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రెండ్రోజుల నిరాహార దీక్షను ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లపై దశలవారీగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. మూడో దశలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల్లో మ్యాచింగ్ గ్రాంట్ కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
గ్రాట్యూటీపై రూ.10లక్షలు సీలింగ్ ఎత్తివేయాలని, ప్రతి సంవత్సరం 15 రోజుల వేతనం బదులు నెల వేతనాన్ని గ్రాట్యూటీగా చెల్లించాలని, ఐటీ పరిధిని రూ.6లక్షలకు, రిటైర్డ్ కార్మికుల పింఛన్‌ను 25 నుంచి 40 శాతానికి పెంచాలని, మెడికల్ అన్‌ఫిట్, చనిపోయిన కార్మికుల పిల్లలకు ఫాస్ట్‌ట్రాక్ ద్వారా డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్షలో సెంట్రల్ కార్యదర్శి వంగ రాజేశ్వర్‌రావు, ఆర్కే 5 బ్రాంచీ కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, నాయకులు కాంపెల్లి నర్సయ్య, దేవేందర్, సారేందర్, అశోక్, వీరమల్లు, సంఘం సదానందం, జడల పోశం కూర్చున్నారు. యూనియన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య, కార్యదర్శి మంద మల్లారెడ్డి, బ్రాంచీల కార్యదర్శులు కొట్టె కిషన్‌రావు(ఆర్కే7), ఎస్కే బాజీసైదా(ఎస్సార్పీ) పాల్గొన్నారు.
మందమర్రిలో...
మందమర్రి : సింగరేణిలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట రిలే దీక్ష చేపట్టారు. సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ నాయకులకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలమైందని అన్నారు. దీక్షలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.భానుదాస్, బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, భీమనాథుని సుదర్శన్, సోమిశెట్టి రాజేశం, ఇప్పకాయల లింగయ్య, అంకతి సాయిలు, ఒడ్నాల శంకర్, హైమద్ అలీ, సంజీవ్ కూర్చున్నారు.