జీవో 421ను అపహాస్యం చేస్తున్న ప్రభుత్వం
మానవహక్కుల వేదిక ప్రతినిధులు
రెంజల్/కోటగిరి: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు విడుదల చేసిన జీవో నం. 421ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం వారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెంజల్ మండలం నీలాలో మృతి చెందిన రైతు జింక భూమన్న, కోటగిరి మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు శంకర్ కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం సాటాపూర్‌లో వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ, రాష్ట్ర ఉపాద్యక్షుడు గోర్రెపాటి మాధవరావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 530 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. జీవో నం. 421 ప్రకారం ఆర్డీఓ నేతృత్వంలో ముగ్గురు డివిజన్‌స్థాయి అధికారుల బృందం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలసి విచారణ చేపట్టాల్సి ఉన్నా, ఎక్కడా అమలుకావడం లేదని ఆరోపించారు. పరిహారాన్ని రూ. ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.