భయం కూడా మంచిదే!
ప్రతి మనిషికీ ఎంతో కొంత భయం, పెద్దలయం దు, గురువులయందు భయభక్తులు ఉండితీరాలి. ఈ ‘భయం’ గౌరవంతో కూడినదై ఉండాలి. అలా ఉంటే తప్పు చేసి పెద్దల మనసు నొప్పించకూడదనే భావన ఏర్పడుతుంది. మనిషి మంచి మార్గంలో నడవడానికి భయం తప్పనిసరి. ‘తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు’ అనే భయం ఉంటే, మనిషి తప్పు చేయడు.
పెద్దలను తూలనాడితే నరకానికి పోతామని, అక్కడ భయంకరమైన శిక్షలు పడతాయనే భయం ఉంటే తప్పు చేయడానికి జంకుతారు. పరుల సొమ్మును అపహరిస్తే తమ సొమ్మును పోగొట్టుకుంటారనే భయం ఉంటే ఆ పని చేయటానికి సాహ సించరు. తల్లిదండ్రులను వీధిపాలు చేసి జల్సాగా గడిపేవారు, ముందు ముందు వారి పిల్లలు కూడా వారికి ఈ గతే కలిగిస్తారనే భయంతో ఉంటే, వారు పెద్దలను జాగ్రత్తగా చూస్తారు.
దేనికైనా భయం ఒక్కటే ఉంటే సరిపోదు. గౌరవం, భక్తి, దైవం, విశ్వాసం, ప్రేమ, ఆదరం... వంటివి ఉంటే, పాపం చేయడానికి సాహసించరని పురాణాలు చెబుతున్నాయి.
ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడు ఏ విధంగా మరణించాడో తెలిసిందే. సీతను అపహరించిన రావణుడు తన బంధువర్గాన్ని పోగొట్టుకోవడమేకాక తాను సైతం నేలకూలాడు. కంసుడు, కీచకుడు, దుర్యోధనుడు... ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలమంది ఉన్నారు. వీరందరికీ ఉన్న ఒకే ఒక్క దుర్గుణం, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే భయం లేకపోవడమే. అందుకే ‘మంచి భయం’ మనిషిని నిరంతరం కాపాడుతూ ఉంటుందని పెద్దల మాటను ఆచరించడానికి ప్రయత్నించాలి.