మరింత కళ తప్పిన పసిడి
ముంబై: పసిడి వెలవెలబోతోంది. రెండున్నర సంవత్సరాలుగా 25 వేలకు పైన స్థిరంగా ఉన్న పుత్తడి మొదటిసారి పాతికవేలకు దిగువకు దిగింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ నవంబరు నెలలో మరింత కళ తప్పాయని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన పసిడి ధర ఈ నెలలో మరింత క్షీణించి స్వల్పంగా దిగువకు జారుకుంది. దీంతో బంగారం ధరలు మరింత పతనమ్యే సంకేతాలను అందిస్తోంది.
కాగా సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 23,820, ఇక 24 క్యారెట్ల ధర రూ.25,480 దగ్గర ఉంది. గోల్డ్ ఎంసీఎక్స్ మార్కెట్ లో 10. గ్రాముల పసిడి విలువ 25 వేల మార్కుకు స్వల్ప దిగువన రూ.24,952 దగ్గర ట్రేడవుతోంది. దీంతో ఇన్టెస్లర్లలో కొత్త ఆశలు మరింత చిగురుస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధర క్షీణత నవంబరు నాటికి 7.5 శాతానికి చేరింది. ఇది 2013 జూన్ మాసంలోని ధరలతో పోలిస్తే మరింత కనిష్టం.
ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో దాని తదుపరి ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లు పెంచనుందనే అంచనాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఒక దశాబ్దం తర్వాత యూఎస్ వడ్డీ రేటు పెంపు వార్తలతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకున్న డాలర్ విలువ మరింత పెరిగితే బంగారం ధరలు ఇంకా దిగిరావడం ఖాయమని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో బంగారు మైనర్లు, తమ కరెన్సీ బలహీనత భయాన్ని పోగొట్టేందుకు గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల క్షీణతను నిరోధించేందుకు బంగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన గణాంకాలను ఆదివారం విడుదల చేశారు.
అటు ఈ గురువారం జరగనున్న సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యసమీక్షా సమావేశం కూడా కరెన్సీ మార్కెట్ పై దృష్టి పెట్టనుంది. ద్రవ్యవిధానాన్ని మరింత సరళతరం చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నానికి హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ 24, 960 రూపాయలుగా నమోదైంది. గోల్డ్ ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రాముల పుత్తడి విలువ 25 వేలకు దిగువకు స్వల్పంగా జారుకుని 24, 952 దగ్గర ఉంది. గత ఆరు సంవత్సరాల్లో బంగారం ధరల పట్టికను ఓ సారి గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.