ఏప్రిల్7,8న సాహితీ పండుగ
- కర్నూలులో జాతీయ తెలుగు రచయితల మహాసభలు
– నవలా, కథా, నాటకం, కవిత్వంపై చర్చా గోష్టులు
– ముగింపు రోజున కవి సమ్మేళనం
– హాజరుకానున్న సుప్రసిద్ధ రచయితలు
రాచపాలెం, సింగమనేని, తెలకపల్లి తదితరులు
కర్నూలు (కల్చరల్) : లలిత కళా సమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 7,8 తేదీల్లో కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో జాతీయ తెలుగు రచయితల మహా సభలు నిర్వహించనున్నామని లలిత కళా సమితి అధ్యక్షుడు, మహా సభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పత్తిఓబులయ్య తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటలకు జరిగే తెలుగు రచయితల ప్రారంభోత్సవంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డా.రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, డా.పాపినేని శివశంకర్, సుప్రసిద్ధ రచయిత సింగమనేని నారాయణ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. అదే రోజున పుస్తక ప్రదర్శనను అతిథులు ప్రారంభిస్తారన్నారు.
తొలి రోజున ‘తెలుగు కవిత్వ ధోరణులు ఒక పరిశీలన’ అనే అంశంపై, తెలుగు నాటకం, విభిన్న రీతులు అనే అంశంపై, తెలుగు నవల ఆధునిక పోకడలు అనే అంశంపై చర్చా కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్ మియా ఆధ్వర్యంలో తెలుగు గాన విభావరి కార్యక్రమం ఉంటుందన్నారు. 8న ఉదయం 10.30 గంటలకు తెలుగు కథా పరిణామం అనే అంశంపై, 12 గంటలకు స్త్రీ వాద సాహిత్యం సమాలోచనలు అనే అంశంపై, మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు సాహిత్యం, విమర్శ అనే అంశంపై చర్చ ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి ఆసక్తి కలిగిన కవులు తమ కవితలను లలిత కళా సమితి, సీ.క్యాంపు కర్నూలు అనే చిరునామాకు తమ కవితలు పంపవచ్చన్నారు.
సభల నిర్వహణకు ప్రత్యేక ఆహ్వాన కమిటీ
కర్నూలు నగరంలో 20ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతీయ స్థాయి తెలుగు రచయితల మహాసభలకు కన్వీనర్‌గా ప్రముఖ కథా రచయిత ఇనాయతుల్లా వ్యవహరిస్తారని, కమిటీలో ప్రముఖ నవలా రచయిత ఎస్‌డీవీ అజీజ్, రచయితలు జంధ్యాల రఘుబాబు, డా.విజయ్‌కుమార్, కెంగార మోహన్, డా.మధుసూదనాచార్యులు, కళ్యాణదుర్గం స్వర్ణలత, దండెబోయిన పార్వతి, డా.వి.పోతన తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ మహా సభల్లో జిల్లా వ్యాప్తంగా కవులు, రచయితలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మహాసభల కన్వీనర్, కథా రచయిత ఇనాయతుల్లా, లలిత కళా సమితి కార్యదర్శి మహమ్మద్‌మియా, కోశాధికారి బాలవెంకటేశ్వర్లు, మహా సభల కో కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.