రుణ పరిమితి పెంపుపై రెండ్రోజుల్లో నిర్ణయం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి కే.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) వడ్డీలేని రుణాల పరిమితి మొత్తాన్ని పెంచడం, బంగారు తల్లి పథకం కొనసాగింపుపై రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) వెల్లడించారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించడమా? ఏవైనా మార్పులు చేయాలా? అన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యం తీసుకుంటారని చెప్పారు. శుక్రవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సుధీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలకు ప్రస్తుతమున్న రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచితే పడే భారమెంతో లెక్కించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం(ఎన్ఆర్ఎల్పీ) కింద రూ. 450 కోట్ల నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరిం చారు. అలాగే ‘సెర్ప్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవల అందించడానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,000 కోట్ల ఆర్థిక సాయం తీసుకోనున్నట్లు చెప్పారు. పిల్లల ఆదరణకు నోచుకోని వృద్ధుల కోసం షెల్టర్లు నిర్వహించే యోచన చేస్తున్నామని తెలిపారు. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను వారే విక్రయించుకోవడానికి వీలుగా ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాలో ‘కృషి’ మార్ట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. వడ్డీలేని రుణాలు తీసుకున్న మహిళలను వడ్డీ కట్టాలని బ్యాంకులు లేదా స్త్రీనిధి సంస్థ ఒత్తిడి తేరాదని చెప్పారు.
అధికారులను నిలదీసిన మంత్రి: కాగా, సెర్ప్ కార్యకలాపాలు ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాల్లో తలదూర్చేలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. సెర్ప్ ఓ సమాంతర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ... ఇతర శాఖలు సరిగా పనిచేయని పక్షంలో అవసరమైన సహకారాన్ని మాత్రమే అందించాలని ఆయన అధికారులకు సూచించారు.
స్త్రీనిధి డివిడెండ్: స్త్రీనిధి సంస్థ ప్రభుత్వానికి 98 లక్షల రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి ప్రభుత్వానికి అందచేశారు.