Golisoda
-
14న తెరపైకి గోలీసోడా–2
తమిళసినిమా: పక్కింటి అమ్మాయి లాంటి భావన, స్పష్టమైన తమిళ భాష ఉచ్చరింపు. అందమైన రూపం వెరసి నటి సుభిక్ష. ఇలాంటి సహజమైన గుణాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టకుంటున్న ఈ భామ కడుగు చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో నటించింది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తనదైన ముద్రవేసుకుంది. అందుకే ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తన తాజా చిత్రం గోలీసోడా–2లో ఏకంగా హీరోయిన్ని చేసేశారు. భరత్ సీనీ హీరోగా నటించి నిర్మించిన ఈ చిత్రం 14న తెరపైకి రానుంది. ఈ ఆనందంలో గోలీసోడా–2 చిత్రంలో నటించిన అనుభవాలను సుభిక్ష చెబుతూ కడుగు చిత్రంలో చిన్న పాత్ర అయినా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పింది. ఆ చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు తనను కడుగు సుభిక్ష అని పిలుస్తుండడం సంతోషంగా ఉందని అంది. మళ్లీ విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో నటించే అవకాశం లభిస్తే బాగుండు అనుకుంటుండగా ఈ గోలీసోడా–2 చిత్రంలో నటించే అవకాశం తన ఇంటి తలుపు తట్టిందని ఊహించలేదని చెప్పింది. ఇందులో భరత్ సీనీకి జంటగా నటించానని చెప్పింది. ఇందులో తన పాత్ర పేరు ఇన్భవల్లి అని తెలిపింది. పక్కింటి అమ్మాయి లాంటి జాలీగా సాగే పాత్ర అని చెప్పింది. ఈ చిత్ర కథ, తన పాత్ర గురించి దర్శకుడు విజయ్‌మిల్టన్ చెప్పినప్పుడు సహజంగా నటిస్తే చాలని, ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారంది. కడుగు చిత్రంలో తనకు భరత్ సీనీకి చాలా తక్కువ సన్నివేశాలే చోటు చేసుకున్నాయన్న విషయాన్ని దర్శకుడి వద్ద ప్రస్తావించగా తన తన మాటల్ని సరిగా అర్థం చేసుకున్న ఆయన గోలీసోడా–2 చిత్రంలో చాలా బలమైన పాత్రను ఇచ్చారని చెప్పింది. ఇందులో భరత్ సీనీ యాక్షన్ సన్నివేశాల్లో కంటే ప్రేమ సన్నివేశాల్లోనే బాగా నటించారని తెలిపింది. గోలీసోడా చిత్రంలో తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు విజయ్ మిల్టన్ దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన గోలీసోడా–2 చిత్రాన్ని రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ సీనీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. -
ముగ్గురు దర్శకుల గోలీసోడా– 2
తమిళసినిమా: ఒక చిత్రానికి ముగ్గురు దర్శకులు కలిస్తే అది గోలీసోడా– 2 అవుతుంది. గోలీసోడా బాలలు ముఖ్య భూమిక పోషించిన ఈ చిత్రం 2015లో విడుదలైన సంచలన విజయాన్ని అందుకుంది. దీని సృష్టికర్త విజయ్ మిల్టన్. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన మోగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఆ తరువాత విక్రమ్ హీరోగా ‘10 ఎన్డ్రత్తుకుల్’చిత్రం చేశారు. ఆ చిత్రం నిరాశపరిచినా దర్శకుడు రాజ్‌కుమార్, భరత్‌తో తెరకెక్కించిన ‘కడుగు’ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా విజయ్‌మిల్టన్ తనను దర్శకుడిని చేసిన గోలీసోడా చిత్రానికి సీక్వెల్‌గా ‘గోలీసోడా– 2’పేరుతో మరో ప్రయోగం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో దర్శకుడు సముద్రకని, గౌతమ్‌మీనన్‌లు ప్రధాన పాత్రలను పోషించడం. దర్శకుడు విజయ్మిల్టన్నే ఛాయాగ్రహణ బాధ్యతను నిర్వహించిన ఈ చిత్రాన్ని రఫ్‌నోట్ సంస్థ సమర్పణలో భరత్ సీనీ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత డ్రామాతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ‘పొండాటి’అనే పాట ఇప్పటికే విడుదలై సినీ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోందని చిత్ర దర్శకుడు తెలిపారు. కాగా చిత్రంలోని ఇతర పాటలను కూడా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి అచ్చురాజమణి సంగీతాన్ని అందించారు. గోలీసోడాకు సీక్వెల్ అయిన గోలీసోడా– 2 ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే ఆశాభావాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
మార్చి 29న గోలీసోడా –2
తమిళసినిమా: గోలీసోడా–2 చిత్రం ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఎలాంటి కాస్టింగ్, అంచనాలు లేకుండా ఇంతకు ముందు విడుదలైన గోలీసోడా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం గోలీసోడా –2. దీంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి నమ్మకంతోనే గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత వి.సత్యమూర్తి పొందారు. ఇంతకుముందు ‘తప్పుదండా’ చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించిన సత్యమూర్తి దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వం వహించిన నెంజిల్ తుణివిరుందాళ్, విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన ఒరు నల్లనాళ్ పాత్తు సోల్రేన్ చిత్రాలను తమిళనాడులో విడుదల చేశారు. ప్రస్తుతం తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యమూర్తి గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొందడం విశేషం. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ విజయ్‌మిల్టన్ చిత్రాలు సాంకేతిక విలువలతో, ఆసక్తికరమైన కథాంశాలతో కూడి ఉంటాయన్నారు. అందుకే ఆయన చిత్రాలంటే తనకు ప్రత్యేక ఆసక్తి అని పేర్కొన్నారు. తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొంది సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ వాయిస్ఓవర్ ఇచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విశేష ఆదరణ పొందుతోందని, విజయ్విల్లన్ ఆయన యూనిట్‌పై నమ్మకంతోనూ గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు వి.సత్యమూర్తి తెలిపారు. -
ఆయన నటిస్తే బాగుంటుందని భావించా!
కోలీవుడ్‌లో ప్రామిసింగ్ దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. తన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో నటుడిగా మెరిసే ఈయనకు ఇటీవల ఇతర చిత్రాల్లోనూ నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఒక పక్క విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంతో బిజీగా ఉన్నా తన మనసును హత్తుకునే పాత్రల్లో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అలా తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం గోలీ సోడా–2. ఇంతకు ముందు వచ్చిన గోలీసోడా చిన్న చిత్రంగా రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం గోలీ సోడా–2. గోలీసోడా చిత్రంతో మెగా ఫోన్ పట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్‌మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ఓవర్ వాయిస్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఇదే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ వివరిస్తూ నిజం చెప్పాలంటే ఈ చిత్రం కథ రాస్తున్నప్పుడే ఇందులోని ఒక పాత్రను దర్శకుడు గౌతమ్‌మీనన్ చేస్తే బాగుంటుందని భావించానన్నారు. కథను ఆయనకు వినిపించి అందులో పాత్రలో నటిం చమని కోరగా వెంటనే అంగీకరించారని అన్నారు. ఆయనది గౌరవ పాత్రే అయినా కథకు చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదే విధంగా ఈ పాత్ర ఆయన యథార్థ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. గోలీసోడా–2 చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌మిల్టన్ సోదరుడు భరత్సినీ తన రఫ్‌నోట్ పతాకంపై నిర్మిస్తున్నారన్నది గమనార్హం. -
హీరోగా లగడపాటి వారసుడు
పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లగడపాటి శ్రీధర్ తనయుడు, విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించిన విక్రమ్ కన్నడ సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారుతున్నాడు. నలుగురు యువకుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన గోలీసోడా సినిమాను అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో లగడపాటి శ్రీదర్ తనయుడు విక్రమ్ సహిదేవ్తో పాటు కన్నడ నటులు సాధు కోకిల, అరుణ్ సాగర్ల తనయులు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కన్నడలో రిలీజ్ తరువాత తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు లగడపాటి శ్రీధర్. -
కథేమిటని అడగలేదు
సాధారణంగా ఏ నటుడైనా నటి అయినా ఒక స్థాయికి చేరుకున్నాక దర్శక నిర్మాతలను కథ చెప్పండి అని అడగడం, విన్న తర్వాత అది బాగోలేదు, ఫలానా అంశాలు చేర్చండి అంటూ జోక్యం చేసుకుంటూ ఉంటారు. నటి సమంత కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కథల విషయంలోనే కాదు, ధరించే దుస్తులు తదితర అంశాలలోనూ జోక్యం చేసుకుంటారని, హీరోల ఆధిక్యంపై ప్రశ్నిస్తుంటారని సమాచారం. అలాంటిది తాజాగా విక్రమ్ సరసన నటిస్తున్న పత్తుఎండ్రదుకుళే చిత్ర కథేంటని అడగలేదట. కారణం ఆ చిత్రం దర్శకుడే అంటారామె. గోలీసోడా ద్వారా మెగాఫోన్ పట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్‌మిల్టన్ బాల తారలతో ఆ చిత్రాన్ని తెరకెక్కించి ఘనవిజయాన్ని సాధించారు. అలాంటి దర్శకుడి తాజా చిత్రం పత్తుఎండ్రదుకుళే. ఐ చిత్రం తర్వాత విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఇందులో నటించాల్సిందిగా ఆమెను అడిగినప్పుడు కథ గురించి అడగకుండా వెంటనే ఓకే చెప్పారట. విజయ్ మిల్టన్ తొలి చిత్రం గోలీసోడా చూసిన ఈమెకు ఆ చిత్రం తెగ నచ్చేసిందట. వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి పొగడ్తలతో ముంచేశారట కూడా. అంత మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడు పత్తుఎండ్రదుకుళే చిత్రంలో తన పాత్రను బాగానే తీర్చిదిద్ది ఉంటారనే నమ్మకంతో కథ వినకుండానే న టించడానికి అంగీకరించారట. కత్తి చిత్రంతో కోలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకున్నా ఆ చిత్రంలో తనకు నటించడానికి పెద్దగా అవకాశం ఏమీ లేదని పెదవి విరిచిన సమంత పత్తుఎండ్రదుకుళేపై చాలా ఆశలు పెట్టుకున్నారు. త్వరలో విజయ్‌తో మరోసినిమాకు సిద్ధమవుతున్నారు.