తమిళసినిమా: గోలీసోడా–2 చిత్రం ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఎలాంటి కాస్టింగ్, అంచనాలు లేకుండా ఇంతకు ముందు విడుదలైన గోలీసోడా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం గోలీసోడా –2. దీంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి నమ్మకంతోనే గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత వి.సత్యమూర్తి పొందారు.
ఇంతకుముందు ‘తప్పుదండా’ చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించిన సత్యమూర్తి దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వం వహించిన నెంజిల్ తుణివిరుందాళ్, విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన ఒరు నల్లనాళ్ పాత్తు సోల్రేన్ చిత్రాలను తమిళనాడులో విడుదల చేశారు. ప్రస్తుతం తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సత్యమూర్తి గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొందడం విశేషం. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ విజయ్‌మిల్టన్ చిత్రాలు సాంకేతిక విలువలతో, ఆసక్తికరమైన కథాంశాలతో కూడి ఉంటాయన్నారు. అందుకే ఆయన చిత్రాలంటే తనకు ప్రత్యేక ఆసక్తి అని పేర్కొన్నారు. తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొంది సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
దర్శకుడు గౌతమ్‌మీనన్ వాయిస్‌ఓవర్ ఇచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విశేష ఆదరణ పొందుతోందని, విజయ్‌విల్లన్ ఆయన యూనిట్‌పై నమ్మకంతోనూ గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు వి.సత్యమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment