Golkonda bonalu
-
హైదరాబాద్‌లో గోల్కొండ బోనాల సందడి (ఫోటోలు)
-
Telangana Bonalu 2024: అమ్మా బైలెల్లినాదో...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఎనిమిది వందల ఏళ్లుగా వస్తోంది. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా,ఈ బోనాల వేడుకలు మాత్రం అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరద నీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకు సమర్పిస్తారు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, ΄÷ంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాలపాటలు ఆడమగ, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు‘‘గండిపేట గండెమ్మా దండ బెడత ఉండమ్మా....., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే....., అమ్మా బైలెల్లినాదే....అమ్మా సల్లంగ సూడమ్మ..... మైసమ్మా మైసమ్మా.... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. అమ్మవార్లకు సోదరుడు పోతురాజుపోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు చేస్తారు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు.బోనం అంటే... భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయ లతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.ఇంటి ఆడబిడ్డ లెక్కఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ్రపాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ్రపాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ్రపాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ జగదంబికదే తొలిబోనంబోనాల మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ్రపాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్రపారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.– డి.వి.ఆర్. భాస్కర్ -
జూన్ 22 నుంచి గోల్కొండ బోనాలు
హైదరాబాద్: గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు జూన్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 22 గురువారం మొదటి, జూన్ 25 ఆదివారం 2వ బోనం, జూన్ 29న గురువారం 3వ బోనం ఉంది. ఆదివారం జూలై 2న 4వ బోనం, జూలై 6న 5వ బోనం, 6వ బోనం జూలై 9న, 13 జూలైన 7వ బోనం ఉంటుంది. అదే విధంగా 8వ బోనం 16 జూలై ఆదివారం, జూలై 20న గురువారం 9వ పూజ ఉంటుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా గోల్కొండ కోట నుంచే బోనాలు ప్రారంభమవుతాయి. -
బోనం ఎత్తుదాం.. నేటి నుంచి మహా సంబురం
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్/లంగర్‌హౌస్: ‘అమ్మా బైలెల్లినాదో...నాయనా తల్లీ బైలెల్లినాదో...’ ప్రతి ఆషాఢ మాసం ఆదివారం రోజున భాగ్యనగరాన్ని పులకింపజేసే మహాద్భుత గానమది. ఆ పాటతో నగరం ఆధ్యాత్మిక కాంతులను అద్దుకుంటుంది. భక్తులు పరవశించిపోతారు. నాలుగు శతాబ్దాలుగా నగరంలోని అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగకు నగరం మరోసారి సర్వసన్నద్ధమైంది. ఆదివారం ఆరంభం కానున్న గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది. అలాగే ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా ఆదివారమేప్రారంభమవుతుంది. ఎంతో వైభవంగా జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలతోనే నగరంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రతి ఘట్టం భక్తి పూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. కోటపై కొలువు దీరిన అమ్మవారిని చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అలంకరించుకొని భారీ ఊరేగింపు నడుమ ఆదివారం కోటపైకి తీసుకెళ్లి ప్రతిష్టిస్తారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగిపోతాయి. కోట పైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో కోట మొత్తం పెద్ద జాతరనే తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో నిండి కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్త రామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. నజర్ బోనం..భారీ తొట్టెలు మొదటి పూజలో అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. 32 అడుగుల ఎత్తైన భారీ తొట్టెలను కూడా మొదటి పూజలో సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్ చౌరస్తా నుండి ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెల తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాల సమర్పణ లంగర్‌హౌస్‌లో ప్రారంభమ్యే ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి అమ్మవారిని, నగలతో పాటు పల్లకిలో ఊరేగింపుగా కోటపైకి తీసుకెళతారు. అమ్మవారిని నగలతో అలంకరించి, తొలిబోనం సమర్పిస్తారు. సామూహిక బోనాల సమర్పణ.. మొదటి బోనం తరువాత భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే రోజుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ నెల 18 న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించను న్నారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్ దర్వాజ అమ్మవార్లతో పాటు వి విధ దేవాలయాల నుండి దాదాపు 100కు పైగా తొ ట్టెల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు. తొలి బోనం విశిష్టత.. లంగర్‌హౌస్ ప్రాంతాన్ని గతంలో లంగర్ఖానా అనేవారు. ఆ రోజుల్లో ఇక్కడ వంట గదులు ఉండేవి. ఆహార ధాన్యాలను ఇక్కడి బాండాగారాల్లో దాచి పెట్టి రాజులకు, సైనికులకు లంగర్హౌస్లోనే భోజనాలు సిద్ధం చేసి పంపించేవారు. అమ్మవారి నైవేద్యాన్ని కూడా ఇక్కడి నుండే వండి పంపించడంతో బోనాలను లంగర్హౌస్వాసులు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది. ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు గతంలో బోనాల ఉత్సవాలు నిర్వహించిన అనుభవంతో మాకు తలెత్తిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. అందరు కుల వృత్తుల వారికి ప్రాధాన్యతను ఇస్తూ వారి చేతుల మీదుగా బోనాలు నిర్వహించనున్నాం. శానిటైజర్‌తో పాటు, మాస్కులు అందుబాటులో ఉంచాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శనం కోసం వరుసలు, మంచి నీరు, టాయిలెట్లు కూడా కోట కింద నుండి పైన వరకు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచాం. – కోయల్కర్ గోవింద్రాజ్, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక.. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు లంగర్‌హౌస్, గోల్కొండలో ప్రారంభమై ముగియడం ఒక ప్రత్యేకత. ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలకు మరో ప్రత్యేకత ఉంది. ఎక్కడ లేని విధంగా గోల్కొండ బోనాల ఉత్సవాల్లో అత్యధిక శాతం ముస్లిం సోదరులు, సోదరీమణులు పాల్గొని సేవలు అందిస్తూ వారి చేతుల మీదుగా బోనాలను వైభవంగా నిర్వహిస్తూ వారి లౌకిక, ఐక్యతా భావాన్ని చాటుకుంటున్నారు. దారి పొడవున బోనాల ఊరేగింపులకు స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ రోజు.. ఏమిటి? నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు ప్రారంభం గోల్కొండ బోనాలు.. తొమ్మిది పూజలు ► మొదటి పూజ– 11వ తేదీ ఆదివారం ► రెండవ పూజ–15న గురువారం ► మూడవ పూజ–18న ఆదివారం ► నాల్గవ పూజ– 22న గురువారం ► ఐదవ పూజ–25న ఆదివారం ► ఆరవ పూజ–29న గురువారం ► ఏడవ పూజ–1 ఆగస్టు ఆదివారం ► ఎనిమిదవ పూజ–5 ఆగస్టు గురువారం ► తొమ్మిదవ చివరి పూజ–8 ఆగస్టు ఆదివారం ఈ వేడుకలతో బోనాలు ముగుస్తాయి. ► నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటాల ఎదుర్కోలు వేడుకలు ► 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అమ్మవారి ఘటం ఒక్కో రోజు ఒక ప్రాంతంలో తిరుగుతుంది. ఇంటింటికి వెళ్లి భక్తుల పూజలు అందుకుంటుంది. ► 23వ తేదీ బోయిగూడ ప్రాంతానికి వెళ్లి 24వ తేదీ రాత్రి 7గంటలకు దేవాలయానికి తిరిగి వస్తుంది. ► 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి. ► 26వ తేదీన రంగం కార్యక్రమం. ► పాతబస్తీలో ఈ నెల 23న కలశ స్థాపనతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం. ► 25న పాతబస్తీలో ఘట స్థాపన ఊరేగింపు, ఆగస్టు 1న బోనాల సమర్పణ. 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు. ► ఆగస్టు 3వ తేదీన అమ్మవారికి సమర్పించే మారు బోనంతో ఈసారి బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి. తొమ్మిది రోజులు.. తొమ్మిది పూజలు ఆషాఢ మాసంలో మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చల్లగా చూడు తల్లీ అంటూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నెత్తిన బోనంతో కోటపైన కొలువుదీరిన అమ్మవారిని కాలినడకన వచ్చి దర్శించుకుంటారు. ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణలో 27 కుల వృత్తుల వారు అమ్మవారికి వివిధ రకాల సేవలు అందిస్తారు. అమ్మవారి అలంకరణ, పూజ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం శతాబ్దాలుగా కులవృత్తుల వారే నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి పూజ ఆదివారం మొదలై 9వ పూజ ఆగస్టు 8వ తేదీ ఆదివారంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. పాతబస్తీ నుంచి బంగారు బోనం.. మొదటి బోనంతో పాటు పాతబస్తీ నుంచి భక్తులు బంగారు పాత్రలో బోనంతోపాటు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ అమ్మవారి దేవాలయానికి చేరుకుని బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు స్వాగతం పలికి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తారు. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటలకు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలతో పోతురాజుల వీరంగంతో బంగారు బోనం తీసుకుని గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. -
బోనమెత్తిన భాగ్యనగరం
-
బోనం.. పర్యావరణహితం
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ జగదాంబిక బోనాలను ఈసారి పర్యావరణహితంగా నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈసారి ఉత్సవాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు సైతం ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులను వినియోగించకుండా అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసే సదుపాయాల్లోనూ ప్లాస్టిక్‌వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు మంచి నీటి సరఫరాకు పేపర్, మట్టి గ్లాసులను వినియోగించనున్నారు. వాటర్ ప్యాకెట్లు అందజేయాల్సి వస్తే.. బాగా దళసరిగా ఉండే ప్యాకెట్లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. గోల్కొండ కోటకు వెళ్లే రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసే మంచినీటి కేంద్రాల్లో వీలైనంత వరకు మట్టి గ్లాసులను వినియోగించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.తొలి రోజు దాదాపు 1.5 లక్షల మంది భక్తులు తరలి రానున్నట్లు అంచనా. అలాగే 22న భక్తుల రద్దీ భారీగా పెరుగనుంది. ఆ రోజు 3లక్షల మందికి పైగా భక్తు లు తరలివచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత భక్తు ల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టనుంది. ఇం దుకనుగుణంంగా మంచినీటి సరఫరా, ఇతర ఏర్పాట్లను వివిధ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది ‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మెట్ల పునరుద్ధరణ... చారిత్రక జగదాంబిక ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లను పురావస్తుశాఖ అధికారులు పునరుద్ధరించారు. ఈ మార్గంలో సుమారు 300లకు పైగా మెట్లు ఉన్నాయి. ఊడిపోయిన కొన్ని మెట్లను వాటి సహజత్వానికి అనుగుణంగా పునరుద్ధరించి, భక్తులు వెళ్లేందుకు వీలుగా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలను సైతం పునరుద్ధరించారు. అలాగే ఇప్పటి వరకు అక్కన్న మాదన్నల రికార్డు రూమ్‌ల వద్ద భక్తులు విడిది చేస్తున్నారు. దీంతో రికార్డు రూమ్ సహజత్వం దెబ్బతింటోందని పురావస్తు శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది బోనాలను అలంకరించుకునేందుకు, వంటలు చేసుకునేందుకు రికార్డు రూమ్‌కు దూరంగా మొదటి బావి వద్ద అనుమతినిచ్చినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. రికార్డు రూమ్‌తో పాటు, కోట సహజత్వానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటునట్లు పురావస్తుశాఖ గోల్కొండ ఇన్చార్జి భానుప్రకాశ్ వర్మ ‘సాక్షి’తో చెప్పారు. మొదటి బావి వద్ద స్థలం ఎంతో విశాలంగా ఉంటుందని అక్కడ భక్తులు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. ఆలయ మార్గంలో అలంకరణ... ఆషాఢమాసంలో ఎంతో వైభవంగా జరిగే బోనాల వేడుకలు గోల్కొండతో మొదలవుతాయి. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మార్గాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలకు వీలుగా, రద్దీ నియంత్రణకు అనుకూలంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆలయ మార్గంలో 60 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1,800 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భద్రత చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఈసారి బంగారు బోనం..పట్టువస్త్రం
చార్మినార్: బోనాలు.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే గొప్ప పండుగ.. ఏపీ, ఢిల్లీతోపాటు అమెరికాలో కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం బోనాలకు రూ.15కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత నాలుగేళ్లుగా ఉత్సవాలను కనీవినీ ఎరుగని విధంగా వేడుకలు జరుపుతున్నారు. ఈసారి బోనాల జాతర వివరాలిలా... ⇔ ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఈ నెల 15 న గోల్కొండ అమ్మ వారి బోనాలతో ప్రారంభమవుతున్నాయి. ⇔ ఈ నెల 16,17,18లలో లాల్‌దర్వాజ సింహావాహినీ దేవాలయం కమిటి ఆధ్వర్యంలో డిల్లీలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించనున్నారు. ⇔ డిల్లీలో జరిగే బోనాల జాతర ఉత్సవాలకు పలువురు కేంద్ర,రాష్ట్ర మంత్రులతో పాటు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొంటారు. ⇔ జూలై 22న విజయవాడ కనక దుర్గా అమ్మవారికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బోనాల సమర్పణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ⇔ విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం వరకు భజాభజంత్రీలతో, కళా బృందాల నృత్య ప్రదర్శనలతో బోనాల జాతర ఊరేగింపు నిర్వహించనున్నారు. ⇔ బోనంతో పాటు పట్టు వస్త్రాలు, కృష్ణానదిలో గంగా తెప్ప తదితర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ⇔ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నారు. ⇔ జూలై 29వ తేదీన సికింద్రా బాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. ⇔ అదే రోజే పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు. ⇔ శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి ఊరేగింపు బయలుదేరుతుంది. ⇔ ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ నగరంతో పాటు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ⇔ అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం 6వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. బంగారు బోనం..పట్టువస్త్రం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో ఈసారి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ నెల 15వ తేదీన గోల్కోండ అమ్మవారికి కమిటీ తరపున బంగారు బోనం, పట్టువస్త్రా లు సమర్పించనున్నారు. అలాగే 17వ తేదీన బల్కంపేట అమ్మవారికి, 20వ తేదీన పెద్దమ్మ గుడి అమ్మవారికి, 24న సికింద్రాబాద్ ఉబ్జయిని మహంకాళి అమ్మవారికి, 26న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి, 31న లాల్‌దర్వాజా సింహవాహిణి అమ్మవారికి, ఆగస్టు 5న మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు. -
అమ్మకు బోనం
-
‘గోల్కొండ’ బోనాలు
-
ప్రారంభమైన గోల్కొండ బోనాలు!