సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్/లంగర్‌హౌస్: ‘అమ్మా బైలెల్లినాదో...నాయనా తల్లీ బైలెల్లినాదో...’ ప్రతి ఆషాఢ మాసం ఆదివారం రోజున భాగ్యనగరాన్ని పులకింపజేసే మహాద్భుత గానమది. ఆ పాటతో నగరం ఆధ్యాత్మిక కాంతులను అద్దుకుంటుంది. భక్తులు పరవశించిపోతారు. నాలుగు శతాబ్దాలుగా నగరంలోని అన్ని వర్గాలను, విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక, సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగకు నగరం మరోసారి సర్వసన్నద్ధమైంది.
ఆదివారం ఆరంభం కానున్న గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది. అలాగే ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా ఆదివారమేప్రారంభమవుతుంది.
ఎంతో వైభవంగా జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలతోనే నగరంలో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రతి ఘట్టం భక్తి పూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. కోటపై కొలువు దీరిన అమ్మవారిని చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అలంకరించుకొని భారీ ఊరేగింపు నడుమ ఆదివారం కోటపైకి తీసుకెళ్లి ప్రతిష్టిస్తారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగిపోతాయి. కోట పైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో కోట మొత్తం పెద్ద జాతరనే తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో నిండి కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్త రామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.
నజర్ బోనం..భారీ తొట్టెలు
మొదటి పూజలో అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. 32 అడుగుల ఎత్తైన భారీ తొట్టెలను కూడా మొదటి పూజలో సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్ చౌరస్తా నుండి ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెల తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది.
ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాల సమర్పణ
లంగర్‌హౌస్‌లో ప్రారంభమ్యే ఊరేగింపులో మంత్రులు, ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు నిర్వహించి అక్కడి నుండి బోనాలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడంతో మొదటి పూజ ముగియనుంది. చోటాబజార్‌లోని ప్రధాన పూజారి ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి అమ్మవారిని, నగలతో పాటు పల్లకిలో ఊరేగింపుగా కోటపైకి తీసుకెళతారు. అమ్మవారిని నగలతో అలంకరించి, తొలిబోనం సమర్పిస్తారు.
సామూహిక బోనాల సమర్పణ..
మొదటి బోనం తరువాత భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే రోజుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ నెల 18 న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించను న్నారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్ దర్వాజ అమ్మవార్లతో పాటు వి విధ దేవాలయాల నుండి దాదాపు 100కు పైగా తొ ట్టెల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు.
తొలి బోనం విశిష్టత..
లంగర్‌హౌస్ ప్రాంతాన్ని గతంలో లంగర్‌ఖానా అనేవారు. ఆ రోజుల్లో ఇక్కడ వంట గదులు ఉండేవి. ఆహార ధాన్యాలను ఇక్కడి బాండాగారాల్లో దాచి పెట్టి రాజులకు, సైనికులకు లంగర్‌హౌస్‌లోనే భోజనాలు సిద్ధం చేసి పంపించేవారు. అమ్మవారి నైవేద్యాన్ని కూడా ఇక్కడి నుండే వండి పంపించడంతో బోనాలను లంగర్‌హౌస్‌వాసులు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోంది.
ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు
గతంలో బోనాల ఉత్సవాలు నిర్వహించిన అనుభవంతో మాకు తలెత్తిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. అందరు కుల వృత్తుల వారికి ప్రాధాన్యతను ఇస్తూ వారి చేతుల మీదుగా బోనాలు నిర్వహించనున్నాం. శానిటైజర్‌తో పాటు, మాస్కులు అందుబాటులో ఉంచాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దర్శనం కోసం వరుసలు, మంచి నీరు, టాయిలెట్లు కూడా కోట కింద నుండి పైన వరకు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచాం.
– కోయల్కర్ గోవింద్‌రాజ్, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన సభ్యులు
హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక..
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు లంగర్‌హౌస్, గోల్కొండలో ప్రారంభమై ముగియడం ఒక ప్రత్యేకత. ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలకు మరో ప్రత్యేకత ఉంది. ఎక్కడ లేని విధంగా గోల్కొండ బోనాల ఉత్సవాల్లో అత్యధిక శాతం ముస్లిం సోదరులు, సోదరీమణులు పాల్గొని సేవలు అందిస్తూ వారి చేతుల మీదుగా బోనాలను వైభవంగా నిర్వహిస్తూ వారి లౌకిక, ఐక్యతా భావాన్ని చాటుకుంటున్నారు. దారి పొడవున బోనాల ఊరేగింపులకు స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
ఏ రోజు.. ఏమిటి?
నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు ప్రారంభం
గోల్కొండ బోనాలు.. తొమ్మిది పూజలు
► మొదటి పూజ– 11వ తేదీ ఆదివారం
► రెండవ పూజ–15న గురువారం
► మూడవ పూజ–18న ఆదివారం
► నాల్గవ పూజ– 22న గురువారం
► ఐదవ పూజ–25న ఆదివారం
► ఆరవ పూజ–29న గురువారం
► ఏడవ పూజ–1 ఆగస్టు ఆదివారం
► ఎనిమిదవ పూజ–5 ఆగస్టు గురువారం
► తొమ్మిదవ చివరి పూజ–8 ఆగస్టు ఆదివారం ఈ వేడుకలతో బోనాలు ముగుస్తాయి.
► నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటాల ఎదుర్కోలు వేడుకలు
► 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అమ్మవారి ఘటం ఒక్కో రోజు ఒక ప్రాంతంలో తిరుగుతుంది. ఇంటింటికి వెళ్లి భక్తుల పూజలు అందుకుంటుంది.
► 23వ తేదీ బోయిగూడ ప్రాంతానికి వెళ్లి 24వ తేదీ రాత్రి 7గంటలకు దేవాలయానికి తిరిగి వస్తుంది.
► 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి.
► 26వ తేదీన రంగం కార్యక్రమం.
► పాతబస్తీలో ఈ నెల 23న కలశ స్థాపనతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం.
► 25న పాతబస్తీలో ఘట స్థాపన ఊరేగింపు, ఆగస్టు 1న బోనాల సమర్పణ. 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు.
► ఆగస్టు 3వ తేదీన అమ్మవారికి సమర్పించే మారు బోనంతో ఈసారి బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
తొమ్మిది రోజులు.. తొమ్మిది పూజలు
ఆషాఢ మాసంలో మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చల్లగా చూడు తల్లీ అంటూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నెత్తిన బోనంతో కోటపైన కొలువుదీరిన అమ్మవారిని కాలినడకన వచ్చి దర్శించుకుంటారు. ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణలో 27 కుల వృత్తుల వారు అమ్మవారికి వివిధ రకాల సేవలు అందిస్తారు. అమ్మవారి అలంకరణ, పూజ నిర్వహణ ఏర్పాట్లు మొత్తం శతాబ్దాలుగా కులవృత్తుల వారే నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటి పూజ ఆదివారం మొదలై 9వ పూజ ఆగస్టు 8వ తేదీ ఆదివారంతో ఈ వేడుకలు ముగియనున్నాయి.
పాతబస్తీ నుంచి బంగారు బోనం..
మొదటి బోనంతో పాటు పాతబస్తీ నుంచి భక్తులు బంగారు పాత్రలో బోనంతోపాటు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ అమ్మవారి దేవాలయానికి చేరుకుని బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు స్వాగతం పలికి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తారు. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటలకు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలతో పోతురాజుల వీరంగంతో బంగారు బోనం తీసుకుని గోల్కొండ జగదాంబ అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment