బోనాల సందడి షురూ | Telangana: Bonalu Celebrations To Begin Hyderabad | Sakshi
Sakshi News home page

బోనాల సందడి షురూ

Published Sat, Jun 11 2022 10:52 AM | Last Updated on Sat, Jun 11 2022 3:05 PM

Telangana: Bonalu Celebrations To Begin Hyderabad - Sakshi

లాల్‌దర్వాజా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు (ఫైల్‌)

సాక్షి,చార్మినార్‌(హైదరాబాద్‌): హైదరాబాద్‌ నగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందడి మొదలైంది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా  నిర్వహించడానికి ప్రభుత్వం  ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన బోనాల జాతర నిర్వాహణ,ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోనాల జాతర ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

అంతేకాకుండా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల ఏర్పాట్లపై కూడా మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఇక పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనా­ల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈఏడాది  బోనాల జాతర ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కమిటి చైర్మన్‌ రాకేశ్‌ తివారి తెలిపారు.  ఉత్సవాలు ఈనెల 30వ తేదీన గోల్కొండ అమ్మవారి బోనాలతో ప్రారంభమవుతున్నాయి.  

ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధి.. 
బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే బోనాల జాతర ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు.  నగరంలో బోనాల ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్‌ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ప్రస్తుతం కళాకారుల నృత్య ప్రదర్శనలకు ఆర్డర్లు ఇస్తున్నారు. రెండు నెలలకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు.  

మంత్రముగ్ధుల్ని చేసే కళాకారుల నృత్యాలు..
బోనాల  ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అమ్మవారి ఘటాల ఊరేగింపులో కళాకారులు ప్రదర్శించే వివిధ రకాల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.  వివిధ నృత్య భంగిమల్లో వారు ప్రదర్శించే హావభావాలు దారి పొడవునా ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. అమ్మవారి ఘటాల ఊరేగింపులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారులే కాకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని భక్తులను ఉత్తేజ పరుస్తారు.

ఘటాల సామూహిక ఊరేగింపు.. 
బోనాల సమర్పణ మరుసటి రోజు పాతబస్తీలోని దేవాలయాల నుంచి అమ్మవారి ఘటాలతో సామూహిక ఊరేగింపు నిర్వహిస్తారు.  అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఊరేగింపు ఉప్పుగూడ, బేలా, గౌలిపురా, శాలిబండ, కోట్ల అలీజా, మీరాలంమండి, కసరట్ట తదితర ప్రాంతాల నుంచి చార్మినార్‌ ద్వారా నయా పూల్‌లోని మూసీ వరకు కొనసాగుతుంది.  

ఆకట్టుకునే నృత్యాలు..
బోనాల ఉరేగింపు కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పు­లోళ్లు, హనుమంతునిలో రాముడు, త­య్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొ­య్య, జడల కోలాటం తదితర కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

చదవండి: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా?


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement