Gollagudem
-
ఆ ఊరిలో.. ట్యాక్స్ ఫ్రీ
ద్వారకాతిరుమల: ఆ ఊళ్లో కుళాయి పన్ను, ఇంటి పన్ను ఎవరూ కట్టక్కర్లేదు. ఆ గ్రామ పంచాయతీ చెరువులోని చేపలు కూడా గ్రామస్తులకు ఉచితమే. ఇప్పటికే ఓ ఏడాది పాటు అందివచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం పంచాయతీలోని గొల్లగూడెం గ్రామం ఏడాది క్రితం నూతన పంచాయతీగా ఏర్పడింది. సుమారు 2 వేల జనాభా, 1,418 మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నించారు. ఫలించకపోవడంతో చివరకు పోటీ అనివార్యమైంది. దీంతో శ్రీమంతుడిగా పేరున్న వైఎస్సార్ సీపీ నేత బొండాడ వెంకన్నబాబు తన తండ్రి నాగభూషణాన్ని పోటీకి దింపారు. ఆయనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు పంచాయతీకి కుళాయి, ఇంటి పన్నులు ఎవరూ చెల్లించక్కర్లేదని హామీ ఇచ్చారు. దాంతో పాటు ప్రస్తుత బకాయిలను కూడా తానే చెల్లిస్తానన్నారు. చేపల పెంపకానికి వినియోగిస్తున్న మందులు, వ్యర్థాల కారణంగా గ్రామంలోని పంచాయతీ చెరువు దుర్వాసన వెదజల్లుతోందని.. తన తండ్రి సర్పంచ్ అయిన తరువాత చెరువులో ఎటువంటి మందులు, వ్యర్థాలు వేయకుండా చేపలు పెంచి ప్రజలకు ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో గొల్లగూడెంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గెలిచిన వెంటనే.. త్రిముఖ పోటీలో బొండాడ నాగభూషణం ప్రత్యర్థులపై 435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఏడాది పన్నులతో పాటు, అప్పటి వరకూ ఉన్న పన్ను బకాయిల మొత్తం రూ.9.50 లక్షలు పంచాయతీకి చెల్లించారు. గ్రామంలోని చెరువును రూ.1.50 లక్షలకు బహిరంగ వేలం ద్వారా మూడేళ్ల కాల పరిమితికి దక్కించుకుని, అందులో సహజసిద్ధంగా చేపల పెంపకం చేపట్టారు. ఆ చేపలను ఈ ఏడాది ఫిబ్రవరి 17న గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండటంతో.. అప్పటి వరకూ ఈ ట్యాక్స్ ఫ్రీ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాదికి సంబంధించిన కుళాయి, ఇంటి పన్నుల సొమ్ము రూ.5.11 లక్షలను కొద్ది రోజుల క్రితమే పంచాయతీకి చెల్లించారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం.. రాష్ట్రంలోనే తొలి ట్యాక్స్ ఫ్రీ గ్రామంగా గొల్లగూడెం నిలుస్తోంది. మిగిలిన గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం ఆదర్శం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పంచాయతీ ట్యాక్స్‌లు ప్రజల తరఫున మేమే చెల్లిస్తున్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహాయ సహకారాలతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. – బొండాడ వెంకన్నబాబు, సర్పంచ్ కుమారుడు నూరు శాతం పన్ను వసూలైంది గ్రామంలోని ప్రతి ఒక్కరి కుళా యి, ఇంటి పన్నులను సర్పంచ్ నాగభూషణం, ఆయన కుమారుడు వెంకన్నబాబు చెల్లిస్తున్నా రు. దీనివల్ల మా పంచాయతీలో నూరు శాతం పన్నులు వసూలవుతున్నాయి. ప న్ను వసూలు కోసం ఇంటింటిటీ తిరిగే బాధ తప్పింది. – జక్కంపూడి రాజేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గంధం బాధ తప్పింది గతంలో పంచాయతీ చెరువులో చేపల పెంపకం కోసం మందులు, వ్యర్థాలను వాడేవారు. దాంతో చెరువు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లేది. అటుగా నడవలేకపోయేవాళ్లం. వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం దయవల్ల చెరువు బాగుపడింది. – ఎర్ర దుర్గ, గ్రామస్తురాలు పన్నుల భారం లేదు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం గ్రామంలోని సుమారు 700 గృహాలకు కుళాయి, ఇంటి పన్నులను చెల్లిస్తున్నారు. దీనివల్ల మాకు పన్నుల భారం తప్పింది. చాలా సంతోషంగా ఉంది. – కొడవలూరి పద్మావతి, గ్రామస్తురాలు -
కోడిపందెం శిబిరంపై పోలీసుల దాడి.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తపూరు : కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నూతిలో పడిపోయి మృతిచెందారు. మృతులు చిట్టూరి శ్రీనివాసరావు(20), మేకల చెన్నకేశవరావు(26)గా గుర్తించారు. పండుగ రోజుల్లో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
21న చంద్రబాబు రాక
ఏలూరు (మెట్రో) : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 21న జిల్లాకు రానున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో ఉంగుటూరు మండలం గొల్ల గూడెం చేరుకుంటారు. అక్కడ పోలవరం కుడికాలువపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను 11 గంటలకు ఆయన ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో పోలవరం వెళతారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. మధ్యాహ్నం 2.30 గంటలకు అధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు పోలవరం నుంచి హెలికాప్టర్లో విజయవాడ బయలుదేరుతారు. -
21న సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం
గొల్లగూడెం(ఉంగుటూరు): దేశంలోనే తొలిసారిగా కాలువ గట్టుపై గొల్లగూడెం పోలవరం గట్టు వద్ద ఏర్పాటు చేసిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ పథకం పూర్తయ్యింది. దీనిని ఈనెల 21న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ జెన్కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరావు, సలహాదారుడు జి.ఆదిశేషు తెలిపారు. పోలవరం గట్టుపై రూ.34 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయన్నారు. ఉత్పత్తిని గొల్లగూడెం 33 కేవీ విద్యుత్ సబ్‌సేష్టన్‌కు అనుసంధానం చేయనున్నారు. మంగళవారం సోలార్ పథకాన్ని వారు పరిశీలించారు. ట్రయిల్ రన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట సోలార్ ప్రాజెక్ట్ ఏఈ కొలగాని వీవీఎస్ మూర్తి, డీఈఈ కె.కోటేశ్వరారవు, ఏఈఈలు ఎం.రామకృష్ణ, బ్రహ్మానంద్, పోటాన్ సంస్థ ఎండీ గౌతం ఉన్నారు. -
గట్టు.. ఇదీ లోగుట్టు
ఎడాపెడా అక్రమాలకు తెగబడటం.. ప్రజాధనాన్ని లూటీ చేయడం వారి దినచర్య. ఆనక అధికారం అండతో పాపాల్ని కడిగేసుకోవడం వారికి పరిపాటి. తాడిపూడి, పోలవరం కుడికాలువ వెంబడి ఇదే తంతు నడుస్తోంది. ప్రజాప్రతినిధులు.. అధికారుల అండతో నిత్యం భారీఎత్తున ఎర్ర కంకరను తవ్వుకుపోతున్నారు. దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నచందంగా ఇక్కడ కంకర మాఫియా బుసలు కొడుతోంది. ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు గండిపడిన వైనం ఈ వాస్తవాల్ని మరోసారి బహిర్గతం చేసింది. ఉంగుటూరు : తాడిపూడి కాలువకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద రెండోసారి గండి పడటానికి అక్రమార్కులే కారణమనే విషయం మరోసారి వెల్లడైంది. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో చీకటి మాటున సాగిస్తున్న గ్రావెల్ తవ్వకాల వల్లే కాలువ గట్టు తెగిపోయింది. కాలువ గట్లతోపాటు, గట్ల పక్కన గల ఎర్రకంకరను తవ్వి తరలించుకుపోతున్నారు. ఇదే ప్రాంతంలో 2013లోనూ గండి పడింది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమ తవ్వకాలను నిలువరించే ప్రయత్నం చేయకపోగా.. కంకర మాఫియాకు వంతపాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆగని తవ్వకాలు పోలవరం, తాడిపూడి కాలువ గట్లవెంబడి రాత్రి వేళల్లో పొక్లెయిన్ల సాయంతో కంకర తవ్వి నిత్యం ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. దీనిని దొడ్డిదారిన విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఎవరికి అందాల్సిన సొమ్ము వారికి అందుతుం డటంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టవేసే నాథుడు కనబడటం లేదు. ఇదే విషయమై అనేకసార్లు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి, మీకోసం కార్యక్రమాల్లో ప్రజలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదం టే కంకర మాఫియా ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కాలువ గట్లపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానైనా లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. అక్రమ తవ్వకాలు సాగిపోతుంటే పట్టించుకోరేం అని అడిగితే ‘మాకు పిల్లాపాపలు ఉన్నారు. మా జీవితాలను గట్ల కోసం పణంగా పెట్టలేం’ అని కొందరు అధికారులు చెబుతున్నారంటే.. మాఫియా ఎంతగా పేట్రేగిపోతోందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. 10 అడుగులపైనే గండి గొల్లగూడెం వద్ద తాడిపూడి కాలువకు 10 అడుగుల పైనే గండి పండింది. 2013లోనూ ఇక్కడే గండిపడగా, వరద నీరు తిమ్మాయపాలెం గ్రామంలోని కోడేరు చెరువులో చేరింది. అనంతరం చెరువుకు గండిపడి తిమ్మాయపాలెం నూతన కాలనీ రోడ్డు ముంపునకు గురైంది. సోమవారం వేకువజామున తిరిగి అదే ప్రాం తంలో గండిపడగా తిమ్మాయపాలెం ముంపుబారిన పడింది. గతంలో గండిపడినా అధికారులు పూర్తిస్థారుులో చర్యలు తీసుకోలేదు. దీంతో అదే ప్రాంతంలో రెండోసారి గండి పడిందని రైతులు చెబుతున్నారు. గ్రావెల్‌ను తవ్వేస్తుండటంతో ఉంగుటూరు మండలం పరిధిలో తాడిపూడి, పోలవరం కుడికాలువ గట్లు బలహీనమయ్యూరుు. ఒక్కరోజు మాత్రమే వర్షం కురవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని.. వర్షాలు ఇలాగే కొనసాగితే ఊళ్లు, పంటలు మునగటం ఖాయమని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. వంతెన నిర్మించాలి ఏటా భారీ వర్షాల వల్ల వరద నీరు రావటంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. 2013 భారీ వర్షాలకు ఇదే ప్రాంతం వద్ద గండి పడింది. అరుునా సరైన చర్యలు తీసుకోలేదు. సోమవారం మరోసారి గండి పడటంతో 60 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తిమ్మయ్యపాలెం వద్ద వంతెన నిర్మించాలి. - మారిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాంక్రీట్ లైనింగ్ వేయాలని కోరాం తాడిపూడి కాలువ గట్లను పటిష్టత కోసం కాంక్రీట్ లైనింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాం. గట్ల పటిష్టానికి చర్యలు తీసుకుంటాం. తవ్విన గ్రావెల్‌ను గట్లపైనే ఉంచేలా చూడాలని అధికారులను కోరతాం. - గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే