GONUGUNTLA Surya Narayan
-
Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!
ఆయనో ‘భూ’చోడు. ఫోర్జరీలు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. వాటి ఆధారంగా భూదందాలకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అక్రమాలు అధికారిక విచారణల్లోనూ వెల్లడయ్యాయి. అయినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఆయన పట్ల అధికారులు ఎందుకింత ప్రేమ కనబరుస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయం. సాక్షి, పుట్టపర్తి: అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలో నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న 6.35 ఎకరాల భూమిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి కాజేశారు. సుమారు రూ.129 కోట్ల విలువ చేసే ఈ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అత్యంత చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ మినహా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా రిజిస్ట్రేషన్ అధికారులు తాత్సారం చేస్తుండగా...కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కూడా నివేదిక సమర్పణలో జాప్యం చేస్తోంది. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప అనే వ్యక్తి 1929లో అప్పటికే పింఛన్ తీసుకుంటున్న గుండూరావు నుంచి జేఎన్టీయూకు వెళ్లే దారిలోని సర్వే నంబర్ 301లో 7.77 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నారాయణప్ప పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు విడుదల చేశారు. ఆయన 1935లో బ్యాంకులో మార్ట్గేజ్ చేసి రుణం కూడా పొందారు. రాళ్లపల్లి నారాయణప్ప నుంచి తర్వాత నాలుగు తరాల వారికి భూమి మారుతూ వచ్చింది. అయితే, దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అని పేర్కొంటూ నవంబర్ 19, 1985 తారీఖుతో అన్ రిజిస్టర్డ్ వీలునామా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా 2018లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 301–3 సర్వే నంబరులో 6.35 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. చదవండి: (శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!) అనంతరం డిసెంబర్ 23, 2021లో మాలతేష్ నుంచి 6.35 ఎకరాలను వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, ధర్మవరానికి చెందిన యంగలశెట్టిరాజు (సూరి అనుచరుడు) కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాస్తవానికి గుండూరావు 1929 నాటికే ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే ఆయనకు 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయసు 116 ఏళ్లు! అంతటి వయస్సు ఉన్న వ్యక్తి అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారో అర్థం కాని విషయం. ఈ అన్ రిజిస్టర్డ్ వీలునామా ఫోర్జరీ అని ఆర్డీఓ కోర్టు సైతం నిర్ధారించింది. అయినప్పటికీ వరదాపురం సూరి తన గ్రామానికే చెందిన సబ్రిజి్రస్టార్ను లోబర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌తో సరి.. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఫోర్టరీ డాక్యుమెంట్లతో రిజి్రస్టేషన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నితిన్ సాయి, యంగలశెట్టి రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ..జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటిదాకా నితిన్ సాయి, యంగలశెట్టి రాజా, అక్రమాల సూత్రధారి అయిన వరదాపురం సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయకుండా భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారా? లేదా తప్పుదోవ పట్టించే ఎత్తుగడ వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నివేదిక సమర్పించడంలోనూ జాప్యమే.. సూరి చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఆధ్వర్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి సబ్ కలెక్టర్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సభ్యులుగా కలెక్టర్ నాగలక్ష్మి అప్పట్లోనే విచారణ కమిటీని నియమించారు. ఇందులో ఒక సభ్యుడు నివేదిక సమర్పించినా, మరొక సభ్యుడు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇంతటి భారీ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. మరొక అధికారి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ‘భూచోళ్ల’పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చేయడానికే అధికారులందరూ కలిసి కొత్త నాటకాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరాం అన్‌రిజిస్టర్డ్ వీలునామా ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం అనైతికమని పలువురు ఫిర్యాదు చేశారు. రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా రిజి్రస్టార్‌కు ఉత్తర్వులు జారీ చేశాం. – మాధవి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
ఇన్సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద'
సాక్షి, అమరావతి : రాజధాని భూకుంభకోణంలో తీగలాగితే చంద్రబాబు బృందం డొంక కదులుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీగా భూములు కొన్నారు. విజయవాడకు అత్యంత సమీపంలో.. వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండవల్లిలో 11.34 ఎకరాల భూమి కొనుగోలు చేయడాన్ని దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువే రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని గ్రామాల్లోనూ.. సీఆర్డీఏ పరిధిలోనూ భారీగా భూముల కొనుగోలులో వరదాపురం సూరి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన సీఐడీ.. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీకి అందజేసింది. దీంతో ఈ రెండు సంస్థలు సీఐడీకి సమాంతరంగా విచారణ చేపట్టనున్నాయి. బాబు హయాంలో కేసులు నిర్వీర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన సూరి 2014 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్వారీల్లో అక్రమ మైనింగ్.. నాసిరకంగా పనులు చేసినందుకు నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2014కు ముందే పలు కేసులు నమోదు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులను నిర్వీర్యం చేయించుకున్న సూరి.. ఆ తర్వాత చంద్రబాబు బృందంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం తెలుసుకున్న ఆయన.. తాడేపల్లి మండలం ఉండవల్లిలో సర్వే నంబర్లు 144–2ఏ2, 144–2ఏ3, 149–బీ2, 149–బీ3, 151–2ఏ, 195–ఏ, 196–సీ1ఏ1ఏ, 199–3, 207–3, 207–5ఏలలో తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ పేరుతో 5.6725 ఎకరాలు, సర్వే నంబర్లు 140–1బీ, 180–1బీ1, 184–ఏ2/3, 196బీ3బీ, 200–ఏ1, 206–1ఏలలో 5.67 ఎకరాలు మొత్తం 11.34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో సీఆర్డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, మనీల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు నివేదిక అందజేసింది. కాగా, 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు తనను తాను రక్షించుకోవడానికి బీజేపీ గూటికి చేరారు. -
అంకుల్.. అంకుల్..సార్.. సార్
సాక్షి, ధర్మవరం : పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా ఉండవు ఆ యువకునికి.. అధికార పార్టీ అండ చూసుకొని అధికారులను సైతం నిబంధనలకు విరుద్ధంగా తన చెప్పుచేతల్లో ఉంచుకునేలా వ్యవహరిస్తుంటే.. డివిజన్ స్థాయి పోలీసు అధికారి సైతం అతన్నే ‘బాస్’లా భావిస్తూ ‘సార్..సార్’ అని సంబోధిస్తుండడాన్ని చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. అతనేమో డివిజన్ స్థాయి పోలీసు అధికారిని కూడా ‘అంకుల్.. అంకుల్’ అని పిలవడం.. ఆ అధికారి మాత్రం తన స్థాయిని, ఎన్నికల నియమావళిని మరిచి ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పూర్తి స్థాయిలో గౌరవాన్ని ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఎవరతను.. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? అదెక్కడో కాదు.. ధర్మవరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. ధర్మవరం నియోజకవర్గ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అధికారిక హోదాలో అక్కడికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తనయుడు గోనుగుంట్ల నితిన్సాయికి పోలీసులు, ఎన్నికల అధికారులు సైతం రాచమర్యాదలు చేశారు. ఏకంగా గోనుగుంట్ల నితిన్‌సాయి ఫెసిలిటేషన్ సెంటర్లోకి దూసుకుపోతున్నా.. ఉద్యోగులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. -
సమాచార శాఖ మంత్రిపై ఎమ్మెల్యే ఫైర్
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) హాలులో హంద్రీ-నీవా సుజల స్రవంతి, హెచ్చెల్సీపై కలెక్టర్ శశిధర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ విషయం తెలుసుకుని సూరి గంట ఆలస్యంగా ఎమ్మెల్సీ కేశవ్‌తో కలిసి అక్కడకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోతే ఎలాగని మంత్రిని ప్రశ్నించారు. సమావేశం ఉందని అధికారులు కూడా తెలపకపోవడమేంటని ఆగ్రహించారు. మీకు మీరే మీటింగులు పెట్టుకుంటే ఇక మేమెందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో కేశవ్ కల్పించుకుని కనీసం అజెండా ఏంటో తెలిస్తే సమావేశంలో మాట్లాడటానికి వీలుంటుందన్నారు. ఎవరికీ తెలీకుండా సమావేశం పెడితే ప్రయోజనం ఏంటన్నారు. దీంతో మంత్రి పల్లె.. సూరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయన వినలేదు. చివరకు సమీక్ష సమావేశం సమాచారం అందరికీ తెలియజేయాలని అధికారులను ఆదేశిస్తూ.. ఇకమీదట ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.