ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద' | Huge TDP irregularities in insider trading | Sakshi
Sakshi News home page

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద'

Published Sat, Feb 8 2020 3:21 AM | Last Updated on Sat, Feb 8 2020 3:21 AM

Huge TDP irregularities in insider trading - Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని భూకుంభకోణంలో తీగలాగితే చంద్రబాబు బృందం డొంక కదులుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో భారీగా భూములు కొన్నారు. విజయవాడకు అత్యంత సమీపంలో.. వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండవల్లిలో 11.34 ఎకరాల భూమి కొనుగోలు చేయడాన్ని దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించింది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువే రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని గ్రామాల్లోనూ.. సీఆర్‌డీఏ పరిధిలోనూ భారీగా భూముల కొనుగోలులో వరదాపురం సూరి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన సీఐడీ.. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీకి అందజేసింది. దీంతో ఈ రెండు సంస్థలు సీఐడీకి సమాంతరంగా విచారణ చేపట్టనున్నాయి.  

బాబు హయాంలో కేసులు నిర్వీర్యం 
టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన సూరి 2014 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్వారీల్లో అక్రమ మైనింగ్‌.. నాసిరకంగా పనులు చేసినందుకు నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌పై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 2014కు ముందే పలు కేసులు నమోదు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులను నిర్వీర్యం చేయించుకున్న సూరి.. ఆ తర్వాత చంద్రబాబు బృందంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం తెలుసుకున్న ఆయన.. తాడేపల్లి మండలం ఉండవల్లిలో సర్వే నంబర్లు 144–2ఏ2, 144–2ఏ3, 149–బీ2, 149–బీ3, 151–2ఏ, 195–ఏ, 196–సీ1ఏ1ఏ, 199–3, 207–3, 207–5ఏలలో తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ పేరుతో 5.6725 ఎకరాలు, సర్వే నంబర్లు 140–1బీ, 180–1బీ1, 184–ఏ2/3, 196బీ3బీ, 200–ఏ1, 206–1ఏలలో 5.67 ఎకరాలు మొత్తం 11.34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

ఇదే రీతిలో సీఆర్‌డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, మనీల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు నివేదిక అందజేసింది. కాగా, 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం  చంద్రబాబు ఆదేశాల మేరకు తనను తాను రక్షించుకోవడానికి బీజేపీ గూటికి చేరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement