రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) హాలులో హంద్రీ-నీవా సుజల స్రవంతి, హెచ్చెల్సీపై కలెక్టర్ శశిధర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ విషయం తెలుసుకుని సూరి గంట ఆలస్యంగా ఎమ్మెల్సీ కేశవ్‌తో కలిసి అక్కడకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోతే ఎలాగని మంత్రిని ప్రశ్నించారు. సమావేశం ఉందని అధికారులు కూడా తెలపకపోవడమేంటని ఆగ్రహించారు.
మీకు మీరే మీటింగులు పెట్టుకుంటే ఇక మేమెందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంతలో కేశవ్ కల్పించుకుని కనీసం అజెండా ఏంటో తెలిస్తే సమావేశంలో మాట్లాడటానికి వీలుంటుందన్నారు. ఎవరికీ తెలీకుండా సమావేశం పెడితే ప్రయోజనం ఏంటన్నారు. దీంతో మంత్రి పల్లె.. సూరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయన వినలేదు. చివరకు సమీక్ష సమావేశం సమాచారం అందరికీ తెలియజేయాలని అధికారులను ఆదేశిస్తూ.. ఇకమీదట ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.