పల్లెకు టికెట్‌ వద్దంటూ వాట్సాప్‌ సందేశాలు.. | - | Sakshi
Sakshi News home page

పల్లెకు టికెట్‌ వద్దంటూ వాట్సాప్‌ సందేశాలు..

Published Tue, May 23 2023 9:32 AM | Last Updated on Tue, May 23 2023 9:38 AM

- - Sakshi

పుట్టపర్తి: టీడీపీ నేతలు అప్పుడే టికెట్ల కోసం పోరుబాట పట్టారు. రానున్న ఎన్నికల్లో తమకంటే తమకే టికెట్‌ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అధిష్టానానికి తమ వాణి బలంగా వినిపిస్తున్నారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై నిరసన గళం వినిపిస్తూ వారి అరాచకాలు, అక్రమాలను బయటపెడుతున్నారు. తాజాగా పుట్టపర్తిలో తమ్ముళ్ల గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది.

పల్లెకు టికెట్‌ వద్దంటూ వాట్సాప్‌ సందేశాలు..
పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లెకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగులుతోంది. గడచిన నాలుగేళ్లుగా పల్లెకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పెదరాసు సుబ్రహ్మణ్యం, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పీసీ గంగన్న, ఓడీచెరువుకు చెందిన ఇస్మాయిల్‌ అసమ్మతి వర్గంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ టికెట్‌ ఈసారి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇవ్వకూడదంటూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండురోజులుగా పల్లెకు వ్యతిరేకంగా ఏకంగా వాట్సప్‌ సందేశాలను వైరల్‌ చేస్తున్నారు. టీడీపీ గ్రూపులతో పాటు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో పల్లెకు వ్యతిరేకంగా సందేశాలు వైరల్‌ చేస్తున్నారు.

అసమ్మతి నేతలతో భేటీ..
పల్లెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెదరాసు సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు, పార్టీ సీనియర్‌ నేతలను ఏకతాటిపైకి తెచ్చి పల్లైపె పోరుబాటకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు సమావేశాలు, విందు మంతానాలు చేశారు. అలాగే పుట్టపర్తిలో పల్లెకు టికెట్‌ ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతోందని టీడీపీ అధిష్టానానికి కూడా గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. తాను పల్లె రఘునాథరెడ్డి కంటే పార్టీలో సీనియర్‌నని, పైగా స్థానికుడినని అందువల్లే ఈసారి టికెట్‌ తనకే ఇవ్వాలని బలిజ సామాజికవర్గానికి చెందిన నేత పెదరాసు సుబ్రహ్మణ్యం ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

సీనియర్లు, బీసీలను అణగదొక్కిన పల్లె..
తాము టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేస్తూ వస్తున్నామని ‘పల్లె’ వ్యతిరేక వర్గం వాదిస్తోంది. చివరకు గతంలో ‘పల్లె’ గెలుపులోనూ తమదే కీలక పాత్ర అని చెబుతోంది. తాము ఇంత చేస్తే బీసీలు, సీనియర్లను ‘పల్లె’ ఏమాత్రం పట్టించుకోకపోగా, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర అసమ్మతి నేతలు వాపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోన తామే సొంతంగా డబ్బులు ఖర్చు చేసి పార్టీ అభ్యర్థుల విజయానికి పాటు పడ్డామని, అలాంటి తమను పల్లె ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందువల్ల తామూ ఆయనకు మద్దతు పలికేది లేదని స్పష్టం చేస్తున్నారు.

కార్యకర్తల బాగోగులు విస్మరించి...
పార్టీ కోసం అహరహం శ్రమించిన కార్యకర్తలను, సీనియర్‌ నేతల బాగోగులను విస్మరించిన పల్లె రఘునాథరెడ్డి...కేవలం తన స్వార్థం తాను చూసుకున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ‘కియా’ కంపెనీ వద్ద 250 ఎకరాలు కొనుగోలు చేసి రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తీవ్ర ఒత్తిడిలో పల్లె..
అసమ్మతి నేతల చర్యలతో దిక్కుతోచని స్థితిలో పడిన పల్లె రఘునాథరెడ్డి కొందరిని ఇంటికి పిలిపి బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రోజురోజుకూ తన ప్రాభవం తగ్గుతుండటంతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు అనుచరులే చెబుతున్నారు. అసమ్మతి నేతల చర్యలతో ఈసారి టికెట్‌ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement