మహా గుబులు !
చెత్త డంపింగ్‌కు ససేమిరా అన్న మండూరు వాసులు
డంప్ చేస్తే విషం తాగుతాం !
తీవ్ర నిరసనల మధ్య డంపింగ్ యార్డు పరిశీలించిన మంత్రి రామలింగారెడ్డి
ముందుచూపులేని పాలికె
బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరు మహానగర పాలికెకు చెత్త గుబులు పట్టుకుంది. ఇన్నాళ్లు నగరంలోని చెత్తను మండూరు యార్డుకు తరలిస్తున్న విషయం తెల్సిందే. జూన్ ఒకటి తరువాత చెత్తను మండూరుకు తరలించేది లేదని అప్పటి వరకు గడువు కోరిన బీబీఎంపీ ఇప్పుడు చెత్తను ఎక్కడికి తరలించాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
బెంగళూరుకు 18 కి.మీ దూరం ఉన్న మండూరులో చెత్తను డంపింగ్ ఆపివేయాలని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వ స్తున్నారు. జనవరి ఒకటి నుంచి చెత్త డంపింగ్ ఆపివేస్తామని మొదటిసారిగా పాలికె మాట ఇచ్చింది. అటు తరువాత జూన్ ఒకటి వరకు గడువు కోరింది. ఆ గడువు కూడా పూర్తి కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవ డంలో పాలికె పూర్తిగా విఫలమైంది.
ఇదిలా ఉంటే ఆదివారం మండూరుతో పాటు బయ్యప్పనహళ్లి, గుండూరు, బొమ్మసంద్ర, మల్లసంద్ర, బీదరహళ్లి, భీమసంద్ర తదితర గ్రామాలకు చెందిన ప్రతి ఇంటికొక మహిళ స్వచ్ఛంద ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పాలికె అధికారుల దిమ్మతిరిగింది. మరొసారి డంపింగ్ చేస్తే సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని పలువురు విషం బాటిళ్లు చేతపట్టుకుని బైఠాయించారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణతో సహ అధికారులు మండూరు చేరుకుని స్థానికులకు న చ్చచెప్పడానికి ప్రయత్నించారు. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రితో సహ మేయర్, కమిషనర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు వీరు డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు.
మండూరులో డంపింగ్ యార్డ్ వద్దని, తాము రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఉన్న చుట్టు పక్కల 10 కిలోమీటర్లు పొడవునా దుర్వాసన భరించలేకున్నామని, రోగాలతో ఎప్పుడో పోతామోనని ఆందోళన పడుతున్నామని కొందరు మహిళలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులకు మాజీ మంత్రి, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద లింబావలి, మండూరు గ్రామ పంచాయతీ సభ్యుడు రాకేష్‌గౌడ తదితరులు మద్దతుగా నిలిచారు.