ఆలోచన, ప్రతిభకు తార్కాణం.. సెమినార్స్, ప్రెజెంటేషన్స్
నేటి పోటీ ప్రపంచంలో విజయవంతమైన కెరీర్ దిశగా అడుగులు వేయాలంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలే కీలకం.. అకడమిక్ కార్యకలాపాలతో సమాంతరంగా అటువంటి నైపుణ్యాలను పెంపొందించే అంశాలు, మెరుగుపరుచుకునే అవకాశాలు ఎన్నో ఉంటాయి.. వాటిని ప్రభావవంతంగా సద్వినియోగం చేసుకుంటే భవ్యమైన కెరీర్ దిశగా బాటలు వేసుకోవచ్చు.. అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి.. సెమినార్స్, పేపర్ ప్రెజెంటేషన్స్. ఎంతో కీలకమైన సెమినార్స్, పేపర్ ప్రెజెంటేషన్ అంశాల ప్రాముఖ్యత, తదితర అంశాలపై విశ్లేషణ..
ప్రస్తుత పరిస్థితులను గమనంలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థి భావి కెరీర్ దృష్ట్యా సెమినార్‌కు హాజరు కావడమనేది చాలా కీలకమైన ఘట్టం. కానీ చాలామంది విద్యార్థులు ఈ అంశం పట్ల నిర్లక్ష్యం వహిస్త్తున్నారు. సంబంధిత సబ్జెక్ట్‌పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే దిశలో సెమినార్స్ ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఆ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక అంశాలపై ఎప్పటికప్పుడూ ఆప్డేట్గా ఉండేందుకు కూడా సెమినార్స్ దోహదంచేస్తాయి.
అకడమిక్‌తోపాటు కెరీర్పరంగానూ:
కొన్ని ఇన్స్టిట్యూట్లలో విద్యార్థుల సెమినార్లు, పేపర్ ప్రజెంటేషన్లకు కొన్ని మార్కులు నిర్దేశించారు. కాబట్టి చాలా కళాశాలలు ప్రతి ఏటా స్టూడెంట్ కాన్ఫరెన్సులను నిర్వహిస్తున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరం. అకడమిక్‌తోపాటు కెరీర్పరంగానూ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. విద్యార్థులు తమ ఆలోచనలు, ప్రతిభకు అనుగుణంగా పేపర్లను రూపొందించినప్పుడే పేపర్ ప్రజెంటేషన్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
ఎందుకు:
స్వల్ప కాలంలోనే విద్యార్థులు తమ ప్రతిభను సంబంధిత రంగానికి చెందిన నిపుణుల ముందు ప్రదర్శించడానికి అద్భుతమైన వేదికగా ఈ సెమినార్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆ రంగంపై ఆసక్తి ఉన్న ఇతర విద్యార్థులతో కలిసి పని చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. సాధారణంగా సెమినార్లలో సంబంధిత రంగానికి అకడమిక్ ఎక్స్పర్ట్ లేదా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఇచ్చే ఉపన్యాసం లేదా ప్రెజెంటేషన్‌ను ఎంతో విలువైందిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారు చేసే సూచనలు, ఇచ్చే సలహాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు, పరిశ్రమల పనితీరు, నూతనంగా అందుబాటులోకి సాంకేతిక నైపుణ్యం (లేటెస్ట్ టెక్నాలజీ) వంటి అంశాలపై సమగ్రంగా వివరిస్తారు. అంతేకాకుండా సంబంధిత రంగంపై విస్తృత స్థాయి సమాచారం కావాలంటే అనుసరించాల్సిన పద్ధతులు, అందుబాటులోని వనరులపై కూడా చక్కటి అవగాహన కల్పించే సెమినార్లో స్పీకర్ ఉపన్యాసం ఉంటుంది.
మరింత అధ్యయనం:
సెమినార్ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించి మెటీరియల్‌ను పంపిణీ చేస్తారు. చాలా మంది దీన్ని అక్కడే వదిలేస్తారు. అలాకాకుండా మెటీరియల్‌ను మరింత అధ్యయనం కోసం ఇంటికి తీసుకెళ్లడం ఉపయుక్తం. అంతేకాకుండా సెమినార్ల సందర్భంగా ఏవైనా పోటీ (టెక్నికల్ ఫెస్టివల్/క్విజ్ వంటివి)లు నిర్వహిస్తే అందులో విజయం సాధించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి విజయాలను రెజ్యుమెలో ప్రస్తావించడం రిక్రూట్మెంట్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా సబ్జెక్ట్‌కు సంబంధించి వివరించే వాస్తవాలు, గణంకాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తద్వారా సబ్జెక్ట్‌పై మరింత పట్టు సాధించవచ్చు. సబ్జెక్ట్ పరంగా అవగాహన స్థాయిని తెలుసుకోవచ్చు.
ఎందుకంటే తద్వారా లోపాలను సరిద్దుకోవచ్చు. ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఇతరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త పద్ధతుల్లో, విభిన్న మార్గాల్లో అవగాహన స్థాయిని పెంచుకునే అవకాశం చిక్కుతుంది. సెమినార్లలో నేర్చుకున్న కొత్త టెక్నాలజీ ద్వారా ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుండొచ్చు. సెమినార్ స్పీకర్ల నుంచి వన్-ఆన్-వన్ గెడైన్స్ పొందొచ్చు.
ఇలా వ్యవహరించాలి:
అందరి కంటే ఎక్కువ తెలుసు అనే విధంగా వ్యవహరించవద్దు. ఉపన్యసించే వ్యక్తిని ఆటంకపరుస్తూ.. ఆయన చెప్పిన విషయాన్ని తప్పు అని చూపే ప్రయత్నం చేయకూడదు. సదరు వ్యక్తి ఉపన్యాసంలో నిజంగా ఏవైనా దోషాలుంటే ప్రసంగం ముగిసిన తర్వాత వినమ్రంగా తెలియజేయాలి. ఆదేపనిగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడడం, ప్రశ్నలు అడగటం వంటివి చేయకూడదు. తెలియని అంశాలపై ప్రశ్నలు అడగడంలో తప్పులేదు.
కానీ ఉన్న సమయాన్ని అంతా తీసుకునే విధంగా వ్యవహరించవద్దు. మీ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టతకు భంగం కలిగించని విధంగా వ్యవహరించాలి. సెమినార్ అంటే నియామక సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరవుతుంటారు. కాబట్టి సెమినార్లో మీపై అందరూ ఒక సకారత్మక దృక్పథాన్ని పెంచుకునే విధంగా వ్యవహార శైలి ఉండాలి. కాబట్టి సెమినార్ సందర్భంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. భయం, ఇతరులతో ముఖ్యంగా కొత్త వారితో కలివిడిగా ఉండలేకపోడం వంటి వాటిని అధిగమించాలి. స్వతహాగా బాధ్యతలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా సెమినార్లకు హాజరయ్యే వారి దృష్టిని ఆకర్షించవచ్చు. కోర్సు స్వరూపాన్ని మార్చకుండా కంటెంట్‌ను ప్రెజెంట్ చేసే నైపుణ్యం పెంచుకోవాలి. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలి.
కనీసం నాలుగు:
సెమినార్లకు హాజరయ్యే విషయంలో కూడా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి. అకడమిక్ షెడ్యూల్‌కు ఇబ్బంది కలగకుండా సెమినార్లకు హాజరయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. తదనుగుణంగా సంబంధిత వెబ్సైట్లలో ఉండే అలర్ట్ విధానాన్ని వినియోగించుకోవాలి.
తద్వారా సెమినార్, వర్క్‌షాప్, టెలీ సెమినార్, వెబినార్ నిర్వహణ సంబంధిత సమాచారాన్ని స్వల్ప కాలంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏయే సెమినార్లకు హాజరుకావాలనే విషయంపై స్పష్టత తెచ్చుకోవచ్చు. ఏడాదిలో కనీసం నాలుగు సెమినార్లకైనా హాజరుకావడానికి ప్రయత్నించాలి. సెమినార్‌కు హాజరయ్యే ముందు సంబంధిత అంశంపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి.
ప్రయోజనాలు:
కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది.
సంబంధిత రంగంలోని వ్యక్తులను కలుసుకోవడంతోపాటు పరస్పరం అభిప్రాయాలను పంచుకోవచ్చు.
ఎంచుకున్న రంగం భవిష్యత్ దిశగా ఆశిస్తున్న టెక్నాలజీ/ఉత్పత్తులపై ఒక అవగాహన వస్తుంది.
అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. తద్వారా లభించే ఫీడ్‌బ్యాక్‌తో లోపాలను సరిద్దుకోవచ్చు.
సంబంధిత సబ్జెక్ట్‌లో కొత్తగా వస్తున్న టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం ద్వారా అకడమిక్ పరంగా గట్టి పునాది వేసుకోవచ్చు.
తెలిసిన విషయం అయినప్పటికీ.. ఇంతవరకూ తెలియని భిన్న కోణంలో వినే అవకాశం ఉంటుంది. తద్వారా సబ్జెక్ట్‌ను వివిధ కోణాల్లో ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది.
తమ రంగాల్లో విజయం సాధించిన వారు ఇచ్చే ఉపన్యాసాలు స్ఫూర్తిని నింపుతాయి.
మీకు ఆసక్తి ఉన్న అంశంపై పని చేసే ఇతర విద్యార్థులను కలుసుకోవచ్చు. తద్వారా మీ ఆలోచనలను పంచుకోవడంతోపాటు ఇతరుల అవగాహనను పరిశీలించే అవకాశం ఉంటుంది.
ఇన్ పర్సన్ నెట్వర్కింగ్ స్కిల్స్‌ను ప్రాక్టీస్ చేసే అవకాశం చిక్కుతుంది.
ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్సకు ప్రాధాన్యత పెరుగుతోంది. మీ ఆలోచనలు, ప్రతిభను ఇతరులకు అవగాహన కల్పించడమనేది అకడమిక్ కార్యకలాపాల్లో ఎంతో ప్రధానమైంది. ఇందుకు పేపర్ ప్రెజెంటేషన్ ఎంతో సహాయకారిగా ఉంటుంది. ప్రెజెంటేషన్ సందర్భంగా పరిగణించాల్సిన అంశాలు..
ఎవరి ముందు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి?
సంబంధిత అంశం ప్రాముఖ్యత?
కీలకం:
సాధారణంగా ప్రెజెంటేషన్ కోసం పవర్ పాయింట్‌ను ఉపయోగించాలనే నిబంధన ఉంది. కేటాయించిన సమయాన్ని బట్టి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన ముఖ్యమైన అంశాలను నిర్ధ్దారించుకోవాలి. ప్రెజెంటేషన్‌కు సంబంధించి ప్రణాళిక (ప్లానింగ్ స్టేజ్)ను రూపొందించుకోవడం, అమలు (డెలివరీ స్టేజ్) చేసే సమయంలో దానికి హాజరయ్యే వారిని దృష్టిలో ఉంచుకోవడమనేది చాలా కీలకం.
ఎందుకంటే ప్లానింగ్ స్టేజ్‌లో టాపిక్‌ను ఏ విధంగా, ఎంత ప్రభావవంతంగా ప్రెజెంట్ చేశారు? ఎటువంటి భాషను ఉపయోగించారు? అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మీరిచ్చే ప్రెజెంటేషన్ విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి సమయంలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలు, ప్రెజెంటేషన్ నుంచి దృష్టి మరల్చకుండా చివరి వరకు ఏవిధంగా వ్యవహరించారు అనే అంశం ఉపయోగకరంగా ఉండడంతోపాటు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతాయి.
మరింత మెరుగ్గా:
తమ పేపర్లను సూపర్వైజర్ లేదా ఒకరిద్దరు సహచరులతో పంచుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా మీ పేపర్లపై ఫీడ్‌బ్యాక్‌ను కోరవచ్చు. దాంతో మరింత మెరుగ్గా ప్రెజెంటేషన్ ఇవ్వొచ్చు అనే అంశంపై అవగాహన వస్తుంది. స్నేహితులు టీమ్ సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రెజెంటేషన్ రూపొందించడంతోపాటు దాన్ని చూస్తూ ప్రసంగించడం కూడా ప్రధానం. అద్భుతంగా ప్రెజెంటేషన్‌ను రూపొందించినప్పటికీ దానికి అనుగుణంగా.. . ప్రసంగిస్తూ వినేవారిని ఆకట్టుకోవాలి.
ఇచ్చిన వ్యవధిలో మీ ప్రెజెంటేషన్‌ను సమర్పించాలంటే ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి. ప్రణాళిక ప్రకారం ప్రజెంటేషన్‌ను క్లుప్తంగా వివరించడానికి సాధన చేయాలి. పవర్‌పాయింట్‌లోని పాయింట్లు చూస్తూ వాటిని వివరంగా చెప్పగలగాలి. కేవలం స్టైడ్లో ఉన్న విషయాలను మాత్రమే చదివితే వినేవారికి ఆసక్తి తగ్గుతుంది. ముఖ్యమైన విషయాలను ఉదాహరణలతో సహా వివరించొచ్చు.
ముందుగానే:
మీ ప్రజెంటేషన్‌ను వినేవారి ప్రశ్నలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ ప్రెజెంటేషన్ అంశానికి సంబంధించి ఏయే ప్రశ్నలు అడగొచ్చో ముందుగానే అంచనావేయండి. వాటికి క్లుప్తంగా సమాధానాలు చెప్పేలా సాధన చేయండి. చాలా మంది విద్యార్థులు ప్రెజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏవిధంగా సమాధానం ఇవ్వాలి? అనే అంశాన్ని ఆలోచిస్తుంటారు. అలాకాకుండా ప్రెజెంటేషన్ సమయంలో వచ్చిన ప్రశ్నలను, సూచనలను, సలహాలను ఒక ప్రొఫెసర్ లేదా సహచరులను రికార్డ్ చేయమనటం ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వాటిని పరిశీలించి సంబంధిత అంశాలను అధ్యయనం చేయడం కెరీర్‌కు ఇతోధిక సహాయం చేస్తుంది.
నేర్చుకోవచ్చు:
సెమినార్లు, పేపర్స్ ప్రెజెంటేషన్ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్ కారణంగా విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాత పూర్వకంగా వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సంబంధిత డిపార్ట్‌మెంట్‌పై గణనీయమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షల కోణంలో కూడా ప్రెజెంటేషన్ కీలకంగా ఉంటుంది. ఎందుకంటే అక డమిక్ పరంగా విద్యార్థి తన అవగాహన స్థాయిని తెలుసుకునే అవకాశం చిక్కుతుంది.
తద్వారా లోపాలను సరిదిద్దుకొని పరీక్షలకు పక్కాగా సిద్ధం కావచ్చు. చాలా విభాగాల్లో అకడమిక్ కమ్యూనికేషన్లో జర్నల్స్ ప్రచురించడమనేది కీలకంగా మారింది. ఏదైనా పేపరు సమర్పించాలంటే దానికి.. . కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. విద్యార్థులు వాటిని అధ్యయనం చేస్తే పేపర్లు ఎలా రాయాలో, ఎలా సమర్పించాలో తెలుసుకోవచ్చు. అప్పుడే మంచి పరిశోధనా వ్యాసాలు రాయగలుగుతారు. ఈ నేపథ్యంలో పబ్లికేషన్‌కు సంబంధించి ప్రెజెంటేషన్‌ను ఒక ప్రాథమిక దశగా పేర్కొనవచ్చు. సమావేశాల్లో ఎలా మాట్లాడాలో అవగాహన ఏర్పడుతుంది.
అంతేకాకుండా భవిష్యత్ ఉద్యోగాన్వేషణ, కెరీర్లోనూ మేలు కలుగుతుంది. జాబ్ ఇంటర్వ్యూల్లోనూ మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. పేపర్ ప్రెజంటేషన్ల ద్వారా విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రెజెంటేషన్ ప్రభావవంతంగా ఉండలాంటే..
ఆకర్షణీయమైన స్లైడ్స్‌ను రూపొందించుకోవాలి. ప్రెజెంటేషన్‌లో పేరాగ్రాఫుల కొద్దీ రాయడం ద్వారా ప్రయోజనం ఉండదు. చెప్పాల్సిన అంశం క్లుప్తంగా.. . పాయింట్ల రూపంలో ఉండాలి.
ఎన్ని స్లైడ్లు రూపొందించుకోవాలి అనే విషయంలో కూడా స్పష్టతతో ఉండాలి. ఉదాహరణకు 40 నిమిషాల ప్రెజెంటేషన్‌లో 40 స్లైడ్స్ ఉండడమనేది చూసే వారికి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ మరీ ఎక్కువ, తక్కువ కాకుండా మధ్యస్థ సంఖ్యలో ఉండే విధంగా స్లైడ్స్‌ను రూపొందించుకోవాలి.
ప్రెజెంటేషన్‌లో ఇంట్రడక్షన్, మిడిల్, కన్‌క్లూజన్ వంటి అంశాలు ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి స్లైడ్ లోనూ విషయం క్లుప్తంగా, పాయింట్ల వారీగా ఉండాలి. పేరాలకొద్దీ రాస్తే మీ ప్రెజెంటేషన్‌ను వినేవారికి చదివే ఓపిక ఉండదు.
ప్రెజెంటేషన్సకు సంబంధించిన రెఫరెన్సులన్నింటినీ ఒకచోటే పేర్కొంటే మంచిది. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉండేలా జాగ్రత్త పడాలి.
ప్రెజెంటేషన్‌లో స్పెల్లింగు తప్పులు, ఇంగ్లిషు గ్రామర్ తప్పులు లేకుండా స్పెల్ చెక్ చేయాలి.
డాక్టర్ కె.సుధాకర్ రెడ్డి,
ప్రొఫెసర్ అండ్ హెడ్ (మెకానికల్), ఎంజీఐటీ, హైదరాబాద్