goods bogey
-
గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు
మహబూబ్‌నగర్: రన్నింగ్‌లో ఉన్న గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం కర్నూలు వైపు నుంచి సికింద్రాబాద్ వైపు ఓ గూడ్స్ రైలు వెళుతుండగా 11.15గంటల సమయంలో దానికి సంబంధించిన బోగీలు విడిపోయాయి. ఇది గమనించకపోవడంతో ఇంజన్ ఇంచార్జ్ రైలును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన గూడ్స్‌రైలు గార్డు వాకీ టాకీ ద్వారా లోకో పైలెట్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు గూడ్స్ రైలు ముందుకు వెళ్లిపోయింది. వెంటనే ఇంజన్‌ను ట్రాక్‌పై వెనక్కి తీసుకొచ్చి బోగీలను జోడించుకుని 20 నిమిషాల్లో మళ్లీ ముందుకు బయల్దేరింది. ఘటన జరిగిన సమయంలో గుంటూరు, తుంగభద్ర రైళ్లు రావాల్సి ఉండగా.. ముందస్తు సమాచారంతో వాటిని కాసేపు నిలిపివేశారు. బోగీలకు మధ్య ఉన్న హెయిర్పంపు కప్ లింగ్ ఊడిపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
1,400 కిమీ దూరం, 4 ఏళ్లు సా...గింది
బస్తీ, ఉత్తరప్రదేశ్ : బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఈ పాట మన రైల్వేలకు చాలా బాగా సరిపోతుంది. మన రైల్లు గంటలు, నిమిషాలు మాత్రమే కాక అప్పుడప్పుడు రోజుల తరబడి కూడా ఆలస్యంగా నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే రైలు బండి మాత్రం ఏకంగా సంవత్సరాల తరబడి ఆలస్యంగా వచ్చింది. ఏపీ నుంచి యూపీకి అంటే దాదాపు 1, 400 కిమీ దూరాన్ని చేరడానికి ఈ గూడ్స్ వ్యాగన్ బండికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన రామచంద్ర గుప్తా అనే వ్యాపారి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణంలో ఉన్న ఇండియన్ పొటాషియమ్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 1, 316 బస్తాల డీఏపీ ఎరువును బుక్ చేశాడు. దాంతో ఐపీఎల్ కంపెనీ ఈ ఎరువును సరఫరా చేసేందుకు రామచంద్ర గుప్తా పేరు మీద ఒక గూడ్స్ వ్యాగన్‌ను బుక్ చేశారు. సాధరంణంగా విశాఖ నుంచి యూపీలోని బస్తీని చేరడానికి పట్టే సమయం దాదాపు 42 గంటలు, అంటే మూడు రోజులు. కానీ మన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ గూడ్స్ వ్యాగన్ యూపీకి చేరడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. 2014 నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ గూడ్స్ వ్యాగన్ ఈ రోజు (జులై 28) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బస్తీని చేరుకుంది. దాంతో ఆశ్యర్యపోయిన రైల్వే అధికారులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యాగన్ ఫిజికల్ కండిషన్ సరిగా లేకపోవడం చేత దానికి మరమత్తులు చేసే ఉద్దేశంతో బోగిని తప్పించారు. తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి తన గమ్యస్థానికి చేర్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా దాదాపు 3 సంవత్సరాల 8 నెలల తర్వాత ఈ బోగీ బస్తీని చేరుకుంది. దాంతో రైల్వే అధికారులు రామచంద్ర గుప్తాకు ఈ వ్యాగన్ గురించి సమాచారం అందించారు. కానీ గుప్తా మాత్రం ఆ ఎరువులను తీసుకోవడానికి నిరాకరించారు. పాడైపోయిన ఈ ఎరువులను తీసుకుని ఏం చేసుకోవాలి అని ప్రశ్నించారు. అంతేకాక తాను గతంలోనే పలుమార్లు ఈ వ్యాగన్ గురించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ వారు మాత్రం దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం కంపెనీ యాజమాన్యం, రైల్వే బోర్డు మాట్లాడుకోని నిర్ణయించుకుంటారని తెలిపారు. వ్యాగన్‌లోని ఎరువుల ఖరీదు దాదాపు 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. -
నరకానికి నకలు!
రక్షణ పరికరాలు ఇవ్వరు చావబాది పని చేయిస్తారు తాజాగా ఓ కార్మికుడి మృతితోవెల్లడవుతున్న వాస్తవాలు ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ కోల్ విభాగంలో కాంట్రాక్టు కార్మికులు ఎంత దీనావస్థలో పనిచేస్తున్నారో పై అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి. అక్కడి పని ప్రదేశంలో అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో వెల్లడవుతోంది. కార్మికులను గొడ్డుల్లా పనిచేయించుకోవడం.. కనీస విలువ కూడా ఇవ్వకపోవడం.. రక్షణ చర్యలు తీసుకోకపోవడం.. రక్షణ పరికరాలు కూడా అందించకపోవడం బట్టి చూస్తే అక్కడి పని పరిస్థితులు ఎంత ఆందోళనకరస్థితిలోఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం అంచున విధినిర్వహణ... స్థానిక ఎన్టీటీపీఎస్లోని కోల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిత్యం ప్రమాదం అంచున విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధికారుల నుంచి మానసిక ఒత్తిళ్లు, మరోవైపు ప్రమాదాల నడుమ దినదినగండంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఎన్టీటీపీఎస్ కోల్ విభాగంలో 200 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. రక్షణ పరికరాలు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలతో వారు సహవాసం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు నిర్వహిస్తున్న పామర్తి వెంకటేశ్వరరావు (40) మృతి చెందాడు. 1995లో వసంతరావు (30) అనే కార్మికుడు వ్యాగన్ గూడ్స్ బోగీ ఢీకొని చనిపోయాడు. 500 మెగావాట్ల యూనిట్ నిర్మాణంలో పనులు నిర్వహిస్తూ నలుగురు కార్మికుల వరకు ప్రమాదాలకు గురై మృతిచెందారు. మూడో దశలో కోల్ విభాగంలో పనిచేస్తున్న మాబూ (50) అనే మహిళ మూడు నెలల క్రితం గాయాలపాలైంది. వారికి నష్టపరిహారం మాత్రం సక్రమంగా ఇవ్వలేదు. తాజాగా శుక్రవారం సందిపాము రవికుమార్ (34) అనే కార్మికుడు యంత్రంలో పడి నలిగి మృతిచెందాడు. కార్మికులపై కొరడా... కొందరు అధికారులు కార్మికులపై కొరడా ఝుళిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నిరోజులైనా ఎన్టీటీపీఎస్లో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా తమకు నచ్చినవిధంగా పనిచేయించుకోవడం కోసం చేయిచేసుకోవడానికీ తెగబడుతున్నారని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తాను చెప్పిన విధంగా చేయలేదన్న కోపంతో ఏడీఈ భాష్కరరావు మృతుడు రవిని చితకబాది పనిచేయించాడని కార్మిక సంఘాలే ఆరోపించాయి. అప్పటికే మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన రవి ఆ ఒత్తిడిలో ప్రమాదానికి గురై చనిపోయాడని తెలిపారు. గత మూడు రోజులుగా వేధింపులకు గురిచేస్తున్న ఏడీఈ భాస్కరరావే బలవంతంగా ప్రమాదంలో చనిపోయేలా చేశారన్న ఆరోపణలు కూడా కార్మికుల నుంచి వినవస్తున్నాయి. ప్రమాదం జరగ్గానే చల్లగా జారుకున్న ఏడీఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇంజినీర్ల అసోసియేషన్ నుంచి రూ.5 లక్షలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విధంగా కొందరు అధికారుల తీరుతో కార్మికులు బలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తమ సంక్షేమం పట్టించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. అధికారులు పక్షపాత ధోరణి వీడాలి కోల్ విభాగంలో అనేక మంది కార్మికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. ఎన్టీటీపీఎస్లో ప్రమాద కేంద్రాలను గుర్తించి పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలి. రక్షణ పరికరాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలి. - చింతా శ్రీకృష్ణబాబు, కార్మిక నాయకుడు తప్పకుండా చర్యలు తీసుకుంటా.. ఎన్టీటీపీఎస్లో ప్రమాదాలు జరగకుండా ఇక మీదట ప్రత్యేక దృష్టి పెడతాం. అన్ని పని ప్రదేశాలనూ పరిశీలించి రక్షణ చర్యలపై అడిగి తెలుసుకుని అందుకనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. - జె.సమ్మయ్య, చీఫ్ ఇంజినీర్ రక్షణ పరికరాలేవీ? కార్మికులకు రక్షణ పరికరాలు సరిగా ఇవ్వడం లేదనేది ప్రధాన ఆరోపణ. నిబంధనల ప్రకారం బొగ్గు విభాగంలో పనిచేసే కార్మికులకు తలకు హెల్మెట్, చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు బూట్లు, ముక్కుకు మాస్క్ వంటి పరికరాలు ఇవ్వాల్సి ఉంది. కార్మికులు ప్రమాదాలకు గురవకుండా ఆయా ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పని ప్రదేశంలో రక్షణ చర్యల గురించి ఆరా తీయాలి. ప్రస్తుతం కార్మికులకు ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు ఇస్తున్నారా లేదా అనేదానిపై కూడా అధికారులు ఆరా తీయడం లేదు.