గూగుల్ షేరు మీరూ కొనొచ్చు!
తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలందిస్తున్నాయి. మరోవైపు, విదేశీ మార్కెట్లు... ముఖ్యంగా అమెరికా స్టాక్‌మార్కెట్లు గరిష్ట స్థాయిలకు దూసుకెళుతూ... ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చే యడంపై ఆసక్తి చూపుతున్నారు. మరి విదేశీ మార్కెట్లలో మనమూ ఇన్వెస్ట్ చేయాలంటే కుదురుతుందా? గూగుల్, యాపిల్ లాంటి కంపెనీల షేర్లు మనమూ కొనొచ్చా? దీనికోసం ఏం చేయాలి? ఖాతా తెరిచేదెలా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసేదే ఈ వారం
ప్రాఫిట్ ప్రధాన కథనం...
విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు తొలుత విదేశీ బ్రోకింగ్ సంస్థ భాగస్వామ్యం ఉన్న దేశీ బ్రోకింగ్ సంస్థను సంప్రదించాలి. ప్రస్తుతం ఐసీఐసీఐ డెరైక్ట్, కొటక్ సెక్యూరిటీస్, ఇండియా ఇన్ఫోలైన్, రిలయన్స్ మనీ, రెలిగేర్ వంటి బ్రోకింగ్ సంస్థలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. వీటిలో నుంచి మనకు అనువైన సంస్థను ఎంచుకుని, ట్రేడింగ్ అకౌంట్ తెరవాలి. దీనికోసం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయబోతున్నామో.. ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలి (ఐడెంటిఫికేషన్, నివాస ధ్రువీకరణ పత్రాలు మొదలైనవి).
దరఖాస్తు.. డిక్లరేషన్ ఫారాలను నింపాలి. అటుపై విదేశీ మారక నిర్వహణకు (ఫెమా) సంబంధించిన డిక్లరేషన్ ఫారం, లావాదేవీల నిర్వహణకు సదరు బ్యాంకు.. డీలర్లకు అధికారాన్నిచ్చే ఫారం మొదలైన వాటిని నింపాలి. ఇలా ఖాతా ప్రారంభించిన తర్వాత... ఇన్వెస్ట్‌మెంట్‌కు కావాల్సిన నిధులను బదలాయించేందుకు విదేశీ బ్రోకింగ్ సంస్థ బ్యాంక్ అకౌంట్ నంబరును ఇక్కడి బ్రోకింగ్ సంస్థ ఇస్తుంది. అలాగే విదేశీ షేర్లలో ట్రేడింగ్‌కు ఉపయోగపడే ట్రేడింగ్ అకౌంట్‌కు సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కూడా లభిస్తుంది. ట్రేడింగ్‌లో సహకరించేందుకు ప్రత్యేకంగా ఒక ఎగ్జిక్యూటివ్‌ను కూడా బ్రోకింగ్ సంస్థ నియమిస్తుంది.
ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు..
విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించి ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించింది. దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో షేర్లు, స్థిరాస్తులు, డెట్ లేదా ఇతర పెట్టుబడి సాధనాల్లో గరిష్టంగా 2,00,000 డాలర్ల దాకా (రూ. 1.2 కోట్లు దాకా) ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్బీఐ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోనక్కర్లేదు. ఈ పెట్టుబడులపై వచ్చే రాబడులను కూడా తిరిగి అక్కడే పెట్టుబడిగా పెట్టవచ్చు. ప్రత్యేకంగా అనుమతి అక్కర్లేదు.
వ్యయాలు..
విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని వ్యయాలూ ఉంటాయి. మన దగ్గరలాగానే ట్రేడింగ్ అకౌంట్‌ను ప్రారంభించేందుకు, ప్రతి లావాదేవీపై బ్రోకింగ్ చార్జీలు మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్రోకరేజీలు వన్ టైమ్ వార్షిక ఫీజుల విధానాన్ని కూడా పాటిస్తుంటాయి. కాబట్టి, ముందుగా వ్యయాలు, ముందు చెప్పకుండా తర్వాత వసూలు చేసే విధమైన ఫీజులు లాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
రిస్కులు .. పన్నులు..
విదేశంలో ఇన్వెస్ట్ చేయడమంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రిస్కులు కూడా కొంత ఉంటాయి. కనుక ఆయా దేశాల్లో పరిణామాలు, స్టాక్స్‌పై వాటి ప్రభావాలు మొదలైనవి ఒక కంట పరిశీలిస్తూ ఉండాలి. ఇక, కరెన్సీ ఆధారిత రిస్కు కొంత ఉంటుంది. విదేశీ మార్కెట్లలో డాలర్ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం కనుక.. మారకం విలువపరమైన అంశాలపై కాస్త అవగాహన ఉండటం మంచిది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పటిష్టంగా ఉన్న తరుణంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీనివల్ల డాలర్లు ఎక్కువగా వస్తాయి. దాంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ డబ్బు చేతిలో ఉంటుంది.
అలాగే, వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు రూపాయి విలువ తగ్గినప్పుడు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ రూపాయలు మన చేతికొస్తాయి. ఇక పన్నులపరమైన విషయానికొస్తే.. విదేశీ పెట్టుబడులకు దేశీ పన్ను రేట్లు కాకుండా ప్రత్యేక రేట్లు ఉంటాయి. 12 నెలలకు మించి హోల్డింగ్ చేస్తే 20 శాతం దాకా పన్ను ఉం టుంది. అలాగే, ఆయా దేశ చట్టాల ప్రకారం అక్కడ కూడా పన్ను ఉంటుంది.
- పర్సనల్ ఫైనాన్స్ విభాగం